UP: విధులలో నిర్లక్ష్యం...73 మంది అధికారులకు యోగి నోటీసులు

ABN , First Publish Date - 2022-09-02T20:15:17+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొరడా...

UP: విధులలో నిర్లక్ష్యం...73 మంది అధికారులకు యోగి నోటీసులు

లక్నో: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపిన (Dereliciton of duty) అధికారులపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 73 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. జన్ సున్‌వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్ ద్వారా స్థానిక యంత్రాగం, పోలీసులు, ఫేస్‌బుక్ నుంచి సీఎంఓ కార్యాలయానికి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో 10 మంది శాఖాధికారులు (Heads of Deparments), ఐదుగురు కమిషనర్లు, 10 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లు, ఐదుగురు డవలప్‌మెంట్ అథారిటీ వైస్-ప్రెసిడెంట్లు, ఐదుగురు మున్సిపల్ కమిషనర్‌లు, 10 మంది తహసిల్దారులు కూడా ఉన్నారు. వీటితో పాటు ముగ్గురు ఏడీజీలు, ఐడీలు, ఐదుగురు ఐజీలు, డీఐజీలు, 10 కమిషనరేట్లు, 10 పోలీస్ స్టేషన్లను వివరణ ఇవ్వాలని కోరింది.


ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు అందుకున్న శాఖల్లో పర్సనల్, ఆయుష్, టెక్నికల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డవలప్‌మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, నమామి గంగే, రూరల్ వాటర్ సప్లయ్, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, క్లైమైట్ ఛేంజ్ శాఖలు ఉన్నాయి. జూలై నెల రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రంలోని 73 మంది అధికారులకు సీఎం నోటీసులు పంపినట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులతో జరిపిన అనేక సమావేశాల్లో సీఎం చాలా స్పష్టంగా విధులను అలక్ష్యం చేసే వారు ఏ స్థాయి అధికారులైనా సహించేది లేదని చాలా స్పష్టంగా చెప్పినట్టు ఆయన తెలిపారు. పలు హెచ్చరికలు చేసినప్పటికీ పదేపదే ఫిర్యాదులను ఎదుర్కొంటున్న అధికారులపై సీఎం చర్యలకు దిగినట్టు చెప్పారు.

Updated Date - 2022-09-02T20:15:17+05:30 IST