యోగి న్యాయం

ABN , First Publish Date - 2022-03-22T08:03:23+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఆగ్రాకు చెందిన ఓ విలేఖరిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటనపై ఎడిటర్స్ గిల్డ్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్ర అసంతృప్తినీ ఆగ్రహాన్నీ ప్రకటించింది. గౌరవ్ బన్సల్ అనే ఈ విలేఖరి ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో...

యోగి న్యాయం

ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఆగ్రాకు చెందిన ఓ విలేఖరిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటనపై ఎడిటర్స్ గిల్డ్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్ర అసంతృప్తినీ ఆగ్రహాన్నీ ప్రకటించింది. గౌరవ్ బన్సల్ అనే ఈ విలేఖరి ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రకటించడం పోలీసుల కోపానికి కారణం. మార్చి 15న పోలీసులు గౌరవ్‌ను అరెస్టు చేశారు. ప్రభుత్వాధికారులను దుర్భాషలాడటం, వారిని విధులు నిర్వర్తించకుండా అడ్డుపడటం ఇత్యాది అభియోగాలు విలేఖరిపై ఉన్నాయి. పోలీసుస్టేషన్‌లో సరిగ్గా నిలబడలేని, వొణుకుతున్న స్థితిలో ఉన్న బన్సల్ వీడియో ఒకదానిని సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. ఈ దారుణంపై దర్యాప్తు జరగాలని వ్యాఖ్యానించారు. 


బన్సల్‌ను వెంటనే వదిలిపెట్టి న్యాయస్థానాల పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేస్తోంది. పాత్రికేయులను స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వకుండా వారిపై కఠిన చట్టాలను ప్రయోగించడం సరికాదని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాపోయింది. ఇతనిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ, రాత్రంతా జైల్లో చితకబాదారనీ, దుర్భాషలాడారనీ ఆ పాత్రికేయుడి తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఈ ‘పంజాబ్ కేసరి’ విలేఖరి మార్చి 8న ఆగ్రాలోని మండి సమితి ఓట్ల కౌంటింగ్ సెంటర్‌లోకి మరో పదిహేనుమందితో చొరబడి, ఈవీఎంలను అధికారులు మార్చేస్తున్నారంటూ అల్లరి చేశాడనీ, కౌంటింగ్ కేంద్రం బయట అధికారులతో దురుసుగా ప్రవర్తించాడని పోలీసుల ఆరోపణ. ఈ అసత్య ప్రచారం కారణంగా అక్కడ జనం పోగవడంతో, అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని నియంత్రించవలసి వచ్చిందనీ, ఈ దశలోనూ ఆయన పోలీసు ఉన్నతాధికారులతో హద్దులు దాటి ప్రవర్తించాడని అభియోగం. ఈ దుష్ర్పవర్తన బన్సల్‌కు అలవాటేననీ, ఆయనమీద ఇప్పటికే కొన్ని కేసులున్నాయనీ, తాము బన్సల్‌ని హింసించామన్న మాట మాత్రం సరికాదని పోలీసులు అంటున్నారు.


సదరు విలేఖరి సమాజ్‌వాదీ పార్టీ ప్రేమికుడనీ, బీజేపీ ద్వేషి అనీ కొందరు నేతలు అంటున్నారు. ఈ కారణంగానే అక్కడ లేని అక్రమాలతో యోగి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే ప్రయత్నం చేశాడని వారి వాదన. ఓటింగ్ ముగిసి, ఒకచోట ఉంచిన ఈవీఎంల భద్రత విషయంలో అభ్యర్థులతో పాటు మిగతావారికి కూడా భయాలూ అనుమానాలూ ఉండటం సహజం. పైగా, ఎన్నికలు ఇంత పోటాపోటీగా జరిగి, గెలుపోటముల మధ్య తేడా స్వల్పసంఖ్యలో ఉంటుందనుకున్నప్పుడు చిన్న చిన్న ఘటనలు కూడా పెను అనుమానాలు దారితీస్తాయి. బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా మాటల్లో చెప్పాలంటే నేడు యోగి, రేపు మోదీ రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలు కనుక, అందరికళ్ళూ ఎన్నికల ప్రక్రియమీదా, ఈవీఎంల భద్రతమీదా ఉంటాయి. అభ్యర్థులకు, ఉన్నతాధికారులకు తెలియచేయకుండా ఈవీఎంల విషయంలో అధికారులు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఘటనలు కూడా మొన్నటి ఎన్నికల్లో వెలుగుచూశాయి. ఇక, సదరు విలేఖరి ఆరోపణ సరికానప్పుడు పోలీసులు ఖండించవచ్చు, ప్రజలకు నిజం తెలియచేయవచ్చు. ఒక కథనంమీద అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయడానికి అనేక వేదికలున్నాయి, కోర్టులూ ఉన్నాయి. అయినా, కేసు పెట్టవలసినంత తీవ్రమైన తప్పు బన్సల్ చేశాడని నమ్ముతున్న పోలీసులు అతడిని చిత్రహింసలు కూడా పెట్టడం మరీ ఆశ్చర్యకరం. గత ఐదేళ్ళుగా విలేఖరుల పట్ల యోగి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూసినవారికి ఈ ఘటనలో పోలీసుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగించదు. దేశాన్ని కుదిపేసిన హథ్రాస్ ఘటనను కవర్ చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల విలేఖరులపై కూడా యోగి ప్రభుత్వం కేసులు పెట్టింది. కరోనా క్వారంటైన్ సెంటర్‌లో వేధింపులపై కథనం రాసినా, ప్రధాని దత్తతతీసుకున్న డోమరి గ్రామంలో ఆకలికేకలపై వార్త రాసినా సదరు విలేఖరులపై ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగించగలిగే సమర్థత యూపీ పోలీసులకు ఉంది. ఒక దళితకుటుంబం గ్రామంలో ఎదుర్కొంటున్న వివక్షను విలేఖరులు వెలుగులోకి తెస్తే, సమాజంలో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని యోగి ప్రభుత్వం కేసుపెట్టింది. కేంద్రహోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాని నలుగురు రైతులను చంపేసిన ఆయన పుత్రరత్నం గురించి ఓ ప్రశ్న అడిగిన పాపానికి ఓ విలేఖరి ఆయన చేతుల్లో తిట్లూ దెబ్బలూ తిన్నాడు. అయినా, కేసులు పెట్టే హక్కు పోలీసులదనీ, కోర్టుల్లో నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం విలేఖరులదని యోగి ప్రభుత్వం వాదించడం ఆశ్చర్య కలిగిస్తుంది.

Updated Date - 2022-03-22T08:03:23+05:30 IST