Uttar Pradesh: మహిళా ఉద్యోగులపై యోగి సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-29T21:35:06+05:30 IST

ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

Uttar Pradesh: మహిళా ఉద్యోగులపై యోగి సంచలన నిర్ణయం

లక్నో : ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీల్లో మహిళల చేత ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని ఆదేశించింది. ఒకవేళ పని చేయిస్తే ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని తెలిపింది. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే 27న జారీ చేసిన నోటిఫికేషన్‌లో, మహిళ లిఖితపూర్వక సమ్మతి తెలియజేసినపుడు మినహా,  ఏ మహిళ చేత అయినా ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని తెలిపింది. ఒకవేళ  రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పని చేయించినట్లయితే, ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని తెలిపింది. 


రాత్రి ఏడు గంటల తర్వాత కానీ, ఉదయం 6 గంటలకు ముందు కానీ పని చేయడానికి తిరస్కరించిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించరాదని చెప్పింది. 


రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పని చేసే మహిళలకు వారి ఇళ్ళ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి వారి ఇళ్ళకు ఉచిత రవాణా సదుపాయాన్ని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యమే కల్పించాలని తెలిపింది. అదేవిధంగా వారికి ఆహారాన్ని కూడా యాజమాన్యమే అందజేయాలని పేర్కొంది. వారికి రక్షణ కల్పించే విధంగా పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 


మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, బట్టలు మార్చుకునేందుకు గదులను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు పని చేయవలసి వస్తే, కనీసం నలుగురు మహిళలు కలిసి ఉండేలా చూడాలని తెలిపింది. 


లైంగిక వేధింపులను నిరోధించేందుకు తగిన చర్యలను తీసుకోవాలని తెలిపింది. 


Updated Date - 2022-05-29T21:35:06+05:30 IST