ఆరవల్లిలో యోగి వేమన విగ్రహం
యోగి వేమన జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
అత్తిలి, జనవరి 17: ఆరవల్లి ప్రజలకు ఆరాఽధ్య దైవంగా నిలిచిన యోగి వేమన జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి వచ్చిదంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. కాని ఆరవల్లి గ్రామస్థులకు జనవరి 18న నిర్వహించే వేమన జయంతి పెద్ద పండుగ. మహిళలకు, పెద్దలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. 1926కు ముందు గ్రామం లో ప్రతీఏటా అగ్ని ప్రమాదాలు సంభవించేవి. అలాంటి పరిస్థితిల్లో గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి (దాసు) 1926 జనవరి 18న గ్రామంలో వేమన చిత్రపటాన్ని తాటాకు పందిరిలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా చేయడం తరువాత ప్రమాదాలు తగ్గిపోయాయని అప్పటినుంచి ప్రతీ ఏడాది జనవరి 18న వేమన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1984లో గ్రామంలో వేమన మందిరం నిర్మించారు.
కాలభైరవ సంతర్పణ
ప్రతీ ఏటా జనవరి 18న అన్నదానం నిర్వహిస్తారు. ఈ అన్నసమారాధన కేవలం మనుషులకు మాత్రమే కాదు కావిడిలో ఆహార పదార్థాలు ఉంచి ఊరంతా తిరుగుతూ కుక్కలకు కూడా భోజనం వడ్డిస్తుంటారు. గ్రామానికి కాపలాగా ఉండే కాలభైరవులు కాబట్టి కాలభైరవ సంతర్పణ పేరుతో ఈ విధంగా చేస్తున్నారు. మంగళవారం అన్నసమారాధన, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాలీబాల్ పోటీలు, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.