న్యాయస్థానాలకు మీరు పాఠాలు చెప్పొద్దు

ABN , First Publish Date - 2022-04-22T07:01:34+05:30 IST

న్యాయస్థానాలకు పాఠాలు చెప్పొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి

న్యాయస్థానాలకు మీరు పాఠాలు చెప్పొద్దు

  •  కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: న్యాయస్థానాలకు పాఠాలు చెప్పొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై కోర్టే నిర్ణయించాలంటే అంగీకరించడానికి సిద్ధంగా లేం’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ కేంద్రానికి స్పష్టం చేశారు. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తనను పోర్చుగల్‌ నుంచి తీసుకొచ్చేటప్పుడు 25 ఏళ్లకు మించి జైలు శిక్ష వేయబోమని భారత ప్రభుత్వం అక్కడి కోర్టుకు హామీ ఇచ్చిందని, కానీ 25 ఏళ్లు దాటినా ఆ హామీని నిలబెట్టుకోలేదంటూ అబూ సలేం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోం సెక్రటరీ అజయ్‌ భల్లా కోర్టుకు వివరణ ఇచ్చారు.


అబూ సలేంకు జైలు శిక్ష విషయంలో కేంద్రం 2002 డిసెంబరు 17న ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందన్నారు. అబూ సలేంకు 25 ఏళ్ల జైలు శిక్ష 2030 నవంబరు 10న ముగుస్తుందని, ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన హామీ అమల్లోకి వస్తుందని కోర్టుకు వివరించారు. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అభిప్రాయంతో సంబం ధం లేకుండా కేసులపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థకు చట్ట ప్రకారం స్వేచ్ఛ ఉందన్నారు. హోం సెక్రటరీ వివరణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసు విషయంలో నిర్ణయం తీసుకోమని మాకు చెప్పడానికి హోం సెక్రటరీ ఎవరు?’’ అని వ్యాఖ్యానించింది. 


Updated Date - 2022-04-22T07:01:34+05:30 IST