ఈ చలానా చెల్లించాల్సిందే..

ABN , First Publish Date - 2021-03-01T04:40:56+05:30 IST

సెల్‌ఫోన్‌లో ఒక క్లిక్‌ నొక్కితే రూ.1000 జరిమానా పడాల్సిందే..సెల్‌ఫోన్‌కు సందేశమో లేదంటే ఇంటికి నోటీసో వచ్చే వరకు వాహనదారుడికి కూడా తెలియదు తాము ట్రాఫిక్‌ ఉల్లంఘన చేసిన సంగతి...

ఈ చలానా చెల్లించాల్సిందే..
బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌

జరిమానాల్లో చెల్లిస్తున్నది మూడోవంతే

నేటి నుంచి పాలమూరు జిల్లాలో స్పెషల్‌డ్రైవ్‌

పెండింగ్‌ ఈ చలానా ఉంటే చట్టపరమైన చర్యలకు ఆదేశం

రెండు నెలల్లో జిల్లాలో రూ.65 లక్షల ఈ చలానా జరిమానాలు


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 28: సెల్‌ఫోన్‌లో ఒక క్లిక్‌ నొక్కితే రూ.1000 జరిమానా పడాల్సిందే..సెల్‌ఫోన్‌కు సందేశమో లేదంటే ఇంటికి నోటీసో వచ్చే వరకు వాహనదారుడికి కూడా తెలియదు తాము ట్రాఫిక్‌ ఉల్లంఘన చేసిన సంగతి... అప్పటికప్పుడు జరిమానా చెల్లించాల్సిన పని లేపోవడంతో వాహనదారుడు ఈ చలానా ద్వారా వేసిన జరిమానా చెల్లించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.. ఇలా ఒక్కో వాహనదారుడికి పదుల సంఖ్యలో ఈ చలానా జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి.. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమయానికి రాకుండా పోతోంది.. అదే మ్యాన్‌వల్‌గా అయితే అప్పటికప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వాహనం సీజ్‌ చేయడమో, కేసు నమోదుచేయడమో చేస్తారు. ఈ పద్దతిన వాహనం పట్టుకున్న వెంటనే పోలీసులకు పెద్దఎత్తున పైరవీకారుల నుంచి ఫోన్లు రావడం అధికారులకు తలనొప్పిగా మారేది. వీటన్నింటికి చెక్‌ పెట్టాలనే ప్రభుత్వం ఈ చలానా ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. అయితే, విధించిన జరిమానాల్లో మూడోవంతు మాత్రమే వాహనదారులు జరిమానాలు చెల్లిస్తున్నారు. మిగతా వాటిని వసూలు పెద్ద సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు వీటి వసూలుపై దృష్టి సారించారు. 


ప్రతి నెలా రూ.30 లక్షలకు పైగానే

 ఈ చలానాల ద్వారా ప్రతినెల జిల్లాలో రూ. 30 లక్షలకు పైగానే జరిమానాలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే 11586 కేసుల్లో రూ.55,35,390 జరిమానా విధించారు. మిగతా స్టేషన్ల పరిధిలో మరో రూ. 10 లక్షల వరకు జరిమానాలు విధించారు. ఈ చలానా విధానం పాలమూరులో 2019 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. తొలి నాళ్లలో కాస్త తక్కువగానే జరిమానాలు విధించినా ఆ తరువాత వాటిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 3 కోట్ల వరకు ఈ చలానా జరిమానాలు విధించారు. అయితే, ఇందులో కేవలం మూడోవంతు మాత్రమే వాహనదారులు మీసేవలో వీటిని చెల్లిస్తున్నారు. ఈ ఛలానాలో ముఖ్యంగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, నెంబర్‌ప్లేట్‌ లేకుండా వాహనాలు నపడపడం. జిగ్‌జాగ్‌ పద్ధతిలో నెంబర్‌ రాయించుకోవడం, హెల్మెట్‌ లేకపోవం వంటి ఉల్లంఘనలకు ఈ చలానాల ద్వారా జరిమానాలు విధిస్తారు. ట్రాఫిక్‌ పోలీసులు, కానిస్టేబుళ్లు తమ సెల్‌ఫోన్‌లలో ఉల్లంఘనలపై ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయగానే వాహనదారుడి ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తుంది. వారం రోజుల్లో ఇంటికి నోటీసు వస్తుంది.


ఒకరికి బదులు మరొకరికి

కొన్ని సందర్బాల్లో ఒకరికి బదులు మరొకరికి నోటీసులు అందుతున్నాయి. వాహనదారులు నెంబర్‌ప్లేట్‌పై జిగ్‌జాగ్‌ పద్ధతిలో నెంబర్లు రాయించుకోవడం వల్ల సరిగా నెంబర్లు కనిపించక ఒక నెంబరు తారుమారు కావడం వల్ల మరో వాహనదారుడికి నోటీసు వెళితే వాళ్లు ఖంగుతినాల్సి వస్తున్నది. ఇలాంటి వాళ్లు సమీప పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లి వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. 

నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

పెండింగ్‌ ఈ చలానాలు వసూలుతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నేటినుంచి ఐదురోజుల పాటు జిల్లా అంతటా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఈ తనిఖీల్లో పెండింగ్‌ ఈ చలానా ఉన్న వాహనాలు పట్టుబడితే వాటినుంచి జరిమానాలు వసూలు చేయడం, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధపడనున్నారు. అవసరమైతే వాహనాలను జప్తు చేయడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేయడం వంటివి చేయనున్నారు. వాహనదారులు తమ వాహనాలపై ఈ చలానాలు ఉంటే వెంటనే వాటిని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించుకోవాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. 


జరిమానాలు వసూలు చేయాల్సిందే 

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై వాహనాదారులకు ఈ చలానా ద్వారా జరిమానా విధించినా వాటిని చెల్లించకుండా మళ్లీ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. అందుకే పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ఐదురోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఈ చలానా ద్వారా జరిమానాలు వేసిన వాహనాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. పోలీసులు పట్టుకునే పరిస్థితి రాకుండా ఎవరికి వాళ్లు మీ సేవలో తమ వాహనాలపై ఉన్న ఈ చలానా జరిమానాలను చెల్లించాలి. 

- రెమారాజేశ్వరి ఎస్పీ, మహబూబ్‌నగర్‌



Updated Date - 2021-03-01T04:40:56+05:30 IST