Advertisement

నువ్వా.. నేనా?

Feb 28 2021 @ 23:26PM

మున్సిపల్‌ ఎన్నికల్లో చాలా చోట్ల గట్టి పోటీ

ప్రచారంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న అభ్యర్థులు

ఓటర్లపై ప్రాంతాల వారీగా అంచనాలు

రేపు నామినేషన్ల ఉపసంహరణ 

రెబల్‌ అభ్యర్థులపై తేలని పంచాయితీ

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నప్పటికీ చాలాచోట్ల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు, నేతలు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఓటరుకు ఓం కావాలో అడుగుతున్నారు.  కొందరైతే గుట్టుగా సర్వేలు చేస్తున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికల కంటే పట్టణ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో సులువుగా నిలదొక్కుకునే చాన్స్‌ ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రత్యర్థి వ్యూహాలను తెలుసుకుని అంతకు మించి ఎత్తులేస్తున్నాయి. 

మరోవైపు నామినేషన్ల ఉప సంహరణకు గడువు సమీపిస్తోంది. గతేడాది మార్చి నెలలో నామినేషన్లు వేసిన వారిలో అనేక మంది డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అలాగే ప్రధాన పార్టీల నుంచి పార్టీ గుర్తించిన అభ్యర్థులతో పాటు రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారున్నారు. డమ్మీలు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో పెద్ద సంఖ్యలో వారు తమ నామినేషన్లను వెనక్కు తీసుకోనున్నారు. అయితే నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 2, 11, 14 వార్డుల పరిధిలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన తరువాత మృతి చెందారు. వీరి స్థానంలో ఆదివారం నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉన్నా గడువు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. ఈ కారణంగా మరణించిన వ్యక్తులకు చెందిన కుటుంబీకులే(డమ్మీ అభ్యర్థులు) అసలు పోటీ దారులుగా నిలువనున్నారు. 

ఇదిలా ఉండగా నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియకు మార్చి 2, 3 తేదీల్లో అవకాశం కల్పించారు. 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు గడువుంది. దీంతో అందరి దృష్టి నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. ఇప్పటికే రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి. మరో రెండు రోజులు గడువున్న కాణంగా రెబల్‌ అభ్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో రెబల్‌ అభ్యర్థులుగా వేసిన వారిలో కూడా గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారున్నారు. అలాగే అయా డివిజన్లలో, వార్డుల్లో గెలుపు గుర్రాలుగా పేరొందారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందే సత్తా ఉన్న వారూ ఉన్నారు. బరిలో ఉండేందుకే ఎక్కువ మంది రెబల్స్‌ పట్టుబడుతున్నారు. అధికార పార్టీలోనే రెబల్‌ సమస్య ఉంది. వీరంతా ఇప్పటికే బొత్స వద్ద అభిప్రాయాలను వెళ్లడించారు. తమకు గెలిచే సత్తా ఉందని బి ఫారాలను ఇప్పించాలని కోరారు. చివరికి ఏవిధంగా ముందుకు సాగుతారో చూడాలి. ప్రస్తుతం ప్రచారాల్లో మాత్రం రెబల్‌ అభ్యర్థులు సైతం జోరుగా దూసుకెళ్తున్నారు. 

వార్డుల సంఖ్య కంటే వివిధ పార్టీల అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విజయనగరంలో 50 డివిజన్లు ఉండగా రెండు రెట్లు అధికంగా నామినేషన్లు అధికార పార్టీవి ఉన్నాయి. ఇందులో డమ్మీ అభ్యర్థులతో పాటు రెబల్‌ అభ్యర్థులున్నారు. వారి విషయంలో అధికార పార్టీ తీసుకోబోయే నిర్ణయంపైనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని బరిలోకి దింపారు. తద్వారా పట్టణంలో మరింత పట్టును పదిలం చేసుకోవాలన్నది ఉద్దేశంగా కనిపిస్తోంది.  ప్రత్యర్థి వర్గం కూడా బలమైనది కావటంతో అనేక చోట్ల నామినేషన్లు వేశారు. ఈ ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో మంగళ, బుధవారాల్లో స్పష్టత రానుంది. Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.