ఉపరితలాన్నే ఆగిపోతున్న యువ కలాలు

ABN , First Publish Date - 2021-02-15T06:00:36+05:30 IST

ఎప్పటికీ తిరిగి చేరుకోలేని గ్రామీణ జీవన సరళ త్వాన్నీ, బాల్యపు అమాయకత్వాన్నీ తలుచుకుంటూ ‘తానే మారెనా? జగమే మారెనా?’ అని వగచే రచనలు పాఠకులను నోస్టాల్జియాలో...

ఉపరితలాన్నే ఆగిపోతున్న యువ కలాలు

ఎప్పటికీ తిరిగి చేరుకోలేని గ్రామీణ జీవన సరళ త్వాన్నీ, బాల్యపు అమాయకత్వాన్నీ తలుచుకుంటూ ‘తానే మారెనా? జగమే మారెనా?’ అని వగచే రచనలు పాఠకులను నోస్టాల్జియాలో ముంచెత్తుతాయి. నగరానికి వలస వచ్చిన మొదటి తరం రచయితలు చాలామంది ఇక్కడే ఆగిపోతారు. వారి ప్రతిభను, ఇతివృ త్తాలను పోగొట్టుకున్న బాల్యానికీ, వదిలివచ్చిన అనుబంధా లకూ, ముగిసిపోయిన స్నేహాలకూ పరిమితం చేస్తారు. వాటిలోని సార్వజనీనత అదే మానసిక స్థితిలో ఉన్న పాఠకులను ఆకట్టుకుంటుంది. వాళ్లు కనెక్ట్‌ అవుతారు.


కొంతమంది రచయితలు ఈ దశను అధిగమిస్తారు. తానూ, జగమూ రెండూ మారిపోయాయని గుర్తిస్తారు. తమ బాల్యదినాల గ్రామీణ లేదా చిన్న టౌన్ల వ్యవస్థ సమూలంగా మారిపోయిందని గ్రహిస్తారు. అప్పుడు వారు లక్షలాదిమందిని ఒకచోట చేరుస్తూనే వాళ్లల్లో ప్రతి ఒక్కరినీ ఏకాకుల్ని చేసే నగరజీవన సంక్లిష్టతను తమ రచనలలో స్పృశించే సాహసం చేస్తారు. తెలుగు కథాసాహిత్యంలో ఈ సాహసం చేసిన వాళ్లల్లో ఖదీర్‌ బాబు, కుప్పిలి పద్మ ముందువరుసలో ఉంటారు.


‘మన పట్టణాలూ, నగరాలూ నిజానికి అడ్డదిడ్డంగా పెరిగి పోయిన గ్రామాలే కదా?’ అనే ప్రశ్న ఒకటి ఉంది. ఇందులో కొంత నిజం ఉంది. అద్దె ఇళ్లకోసం వెతుక్కొనేవారికి ‘శాకా హారులకు మాత్రమే’ అనే సూచికలు అడుగడుగునా కనిపించి నప్పటికీ, ‘పరువు’ హత్యలకు నెలవులుగా కొనసాగుతు న్నప్పటికీ, పురజనులకు అవి ప్రసాదించే ఒంటరితనమే వాటి విశిష్టత. ఒకవైపు నేరప్రవృత్తినీ, మరోవైపు అన్నిట్లోనూ, అందరికీ ఛాయిస్‌లు ఉన్నాయనే తప్పుడు అవగాహననూ ప్రోత్సహించే మేరకు మనవి నగరాలే.


అయితే నేటికాలపు పరిణామాలను యథాతథంగా నమోదు చేసినప్పుడు అవి పొంతనలేని శకలాలుగా, డిస్టర్బ్‌ చేసే సంఘటనలుగా, అసంబద్ధ విషాదాలుగా పాఠకులకు ఎదురు పడతాయి. అదే సమయంలో వాటిని నిర్దేశిస్తున్న బాహ్య శక్తులు కనుమరుగవుతాయి. ఆవిధంగా అదృశ్యం కావడమే మన కాలపు ప్రధాన లక్షణం. ఏ ఒక్క అంశమూ పైకి కనిపించేంత సరళంగా ఉండబోదన్నది మాత్రమే సర్వ సాధారణ సూత్రీకరణగా నిలుస్తుంది.


ఉపరితల శకలాలను కథలుగా మలిచే ప్రయత్నంలో మునిగితేలే రచయితలు రంగుల బుడగలలో తేలిపోతూ, స్వయంగా సృష్టించుకున్న స్ప్లెండిడ్‌ ఐసొలేషన్‌లోకి వెళ్లి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముందుతరానికి చెందిన పి.సత్యవతి వంటి కొద్దిమంది కథకులు ఇప్పటికీ తమ రచనలలో బాహ్యశక్తుల ప్రమేయాలను ఆధునిక వాస్తవికతతో అలవోకగా అనుసంధానిస్తునే ఉన్నారు. 


రచనలన్నీ ఆధిపత్యాలను నిలదీసే రాజకీయ ప్రకటనలు చేసితీరాలనే కఠోర నియమం ఏదీ లేదుగానీ ఉత్తమ సాహిత్యం వాస్తవికతను ప్రతిబింబించడానికి మాత్రమే పరిమితం కాజాలదనే వాదన నేటికీ బలంగానే వినిపిస్తున్నది.


చీల్చబడిన నేటి గడ్డమీద శత్రువెవరో, మిత్రులెవరో తెలియని గందరగోళం మధ్య మనల్ని, మన కథల్లోని పాత్రల్ని నడిపించే శక్తుల మూలాలను గుర్తించడం మరింత కష్టసాధ్యంగా మారిపోయింది. పైపై వివరణలతో, అచారిత్రక వ్యాఖ్యానాలతో జనాల్ని గందరగోళపరుస్తూ సమాజాన్ని వెనక్కినెట్టే ప్రయత్నాలు ముమ్మరం అవుతూన్న నేటి పరిస్థితుల్లో బాధ్యతలెరిగిన రచయితలకు, విమర్శకు లకు మరింత లోతైన అధ్యయనం అవసరమైంది. సృజనాత్మకత ఎదుర్కొంటూన్న నేటి సవాలు ఇదే.


ప్రపంచ సాహిత్యం, సినీమాలతో సజీవ సంబంధం, సామాజిక శాస్త్రాలతో ఏదో ఒక మేరకు పరిచయం లేకపోతే మూలాలను వెతికిపట్టుకోవడం అసాధ్యం అయిపోతున్నది. రచయితల, కళాకారుల ఒంటరితనం పరాకాష్టకు చేరుకున్నట్లుగా తోస్తుంది.  


మరోవైపు ఉపరితల శకలాల తళుకుబెళుకులు ఏకకాలంలో ఆకర్షణీయంగానూ, అసంబద్ధంగానూ మన కనులముందు నడయాడుతున్నవి - మనల్ని షాక్‌ చేస్తూ, డిప్రెస్‌ చేస్తూ. తమను కవితలుగా, కథలుగా మలిచి కాగితాలపైకి ఎక్కించమని దిన పత్రికలు, టీవీ ఛానెళ్ల వార్తలు నిత్యం ఘోషిస్తున్నవి. సమకాలీన సంఘటనలకు తక్షణ స్పందనలుగా కవితలు పేరు పొందాయి. తెలుగు కథ కూడా ఆ దారిలోనే - నాలుగడుగులు వెనుకగా - నడుస్తున్న ట్లుంది. చాలామంది కథా రచయితల ఇతివృత్తాల ఎంపిక వారి ఉద్వేగభరిత స్పందనకు నిదర్శనంగా నిలుస్తున్నదేతప్ప శిల్పంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో కథలు చతికిలబడిపోతున్నవి.


ఈ పరిస్థితుల్లో రచయితలకు తమ రచనలను దౌడు తీయించడానికి నాలుగు గుర్రాలు ఉపయోగపడతాయి. మొదటిది తీర్పులూ, పరిష్కారాలూ లేకుండా వాస్తవికతను యథాతథంగా, పొడిపొడిగా - వీలైతే కాస్తంత తడిని చేర్చి పాఠకుల ముందుంచడం. రెండవది అసంబద్ధతను ఆహ్వా నించి పాఠకులచేత ఆస్వాదింపజేయడం; ఇందుకుగాను మనో వైజ్ఞానిక శాస్త్రపు సహకారం తీసుకోవడం; పట్టుబడితే చాప్లిన్‌ తరహా విషాదభరిత హాస్యం జోడించడం. మూడవ సాధనం- శకలాల మూలాలను వెలికితీసి సామాజిక గతి సూత్రాల ఆధారంగా వాటి ప్రయాణపు పోకడను వివరిం చడం. ఇది పాత పద్ధతే కావచ్చు; కానీ ఇందుకుగాను నేటి సత్యానంతర సమాజంలో వాస్తవ సేకరణ మరింత జటిలంగా మారిపోయింది. చివరిది- నాలుగు అడుగులు వెనక్కి వెళ్లి అక్కడే ఉండిపోవడం లేదా మళ్లీ ముందుకి వచ్చి గతాన్ని వర్తమానంతో సంధించడం. ఉదాహరణకి పౌరాణిక పాత్ర లను, గాథలను కొత్త వెలుగులో చూపించే ప్రయత్నం ఓల్గా సమర్థవంతంగా చేస్తున్నారు. నిజానికి ఈ నాలుగింటిలో ఏ ఒక్క సాధనాన్నో ఎన్నుకోనక్ఖర్లేదు. మంటో వ్రాసిన ‘తోబా టేక్‌ సింగ్‌’, ‘ఖోల్దో’ వంటి గుండెల్ని పిండే కథల్ని స్వకీయం, సామాజికం అని విడదీసి చూడలేం. మన రావిశాస్త్రి కథల్ని కూడా. పఠనాసక్తి, జీవితానుభవం, పరిశీలనా దృష్టి ఉండాలే గానీ రచయితలకు శిల్పరీతి అడ్డంకి కాబోదు.


అస్తిత్వ వాదనలు బలంగా వీస్తున్న నేటికాలంలో బాధితుల స్వరం నుండి, ధిక్కారం మీదుగా ప్రామాణికతలను నిలదీ యడంతో ఆగిపోకుండా ప్రత్యామ్నాయ నిర్మాణాలవైపు ఆయా సమూహాలు ప్రయాణిస్తున్నవి. ఆచరణ విధించే బాధ్యతలను సమీపిస్తున్నవి. నేటి ఉత్తేజపూరితమైన పరిణామాలను ప్రకటించడానికి రచయితలు తమకు అందుబాటులో ఉన్న అశ్వశక్తిని మొత్తంగా వినియోగించాల్సి ఉంటుంది. అప్పుడు త్రిపుర మాటల్ని హర్షధ్వానాల మధ్య గుర్తుచేసుకోవచ్చు:

‘అశ్వారూఢ యోధుల బల్లెపు మొనలు

ఆకాశాన్ని ముట్టుకున్నాయని

గుర్రాలు ఎంతో గర్వం చెందాయి’

ఉణుదుర్తి సుధాకర్‌

90006 01068


Updated Date - 2021-02-15T06:00:36+05:30 IST