ఊగిసలాటలో యువ హీరోలు

ABN , First Publish Date - 2022-10-02T07:13:32+05:30 IST

‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘పుష్ప’... ఈ విజయాలు భారతీయ సినిమా రూపు రేఖల్ని పూర్తిగా మార్చేశాయి.

ఊగిసలాటలో యువ హీరోలు

 ‘‘పాన్‌ ఇండియా కథలంటూ వేరుగా ఉండవు. నార్త్‌ వాళ్లు మన సినిమాల్ని ఇష్టపడుతున్నారంటే కారణం... మన కథల్లో ఉండే మ్యాజిక్‌ నచ్చడం వల్లే. హిందీ సినిమాలా.. మన తెలుగు సినిమా తీస్తే... వాళ్లు మెచ్చుకోరు’’ 

- శ్రీవిష్ణు


బాహుబలి’, ‘కేజీఎఫ్‌’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘పుష్ప’... ఈ విజయాలు భారతీయ సినిమా రూపు రేఖల్ని పూర్తిగా మార్చేశాయి. ఓ సినిమా సరిహద్దులు చెరిపేసి అన్ని భాషల్లోకీ వెళ్లగలిగితే ఎన్ని వసూళ్లు సాధించగలదో అంకెలతో సహా లెక్కగట్టి చూపించాయి. ‘పాన్‌ ఇండియా’ అనే మత్తు అందరికీ ఎక్కించేశాయి. ఇప్పుడు అదే మత్తులో చిత్రసీమ మొత్తం ఊగుతోంది. బడా హీరోల సినిమా అనగానే ‘పాన్‌ ఇండియా’ ముద్ర తప్పని సరి. ఎందుకంటే వాళ్ల క్రేజ్‌, ఇమేజ్‌ వేరు. ‘పాన్‌ ఇండియా’ అనే మాట తెలియక ముందే కొంతమంది హీరోలు తమిళంలోనూ, మలయాళంలోనూ తమకంటూ అభిమానగణం సంపాదించుకోగలిగారు. అక్కడ వారి సినిమాలు విడుదల అవ్వడం, భారీ వసూళ్లని సంపాదించుకోవడం సర్వసాధారణమైన విషయాలే. ఇప్పుడు వాళ్లంతా తమ మార్కెట్‌ని ఇంకాస్త విస్తరించుకోగలిగారు. ప్రభాస్‌, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ చిత్రాలు డిఫాల్ట్‌గా పాన్‌  ఇండియా సినిమాలైపోయాయి. ఇప్పుడు యువ హీరోల వంతు వచ్చింది. వాళ్లూ పాన్‌  ఇండియా కలలు కంటున్నారు. కాకపోతే.. అదంత ఈజీ కాదు. పాన్‌ ఇండియా ట్యాగ్‌ తగిలించుకోవాలన్న ఆశ ప్రతీ హీరోకీ ఉంటుంది. అయితే... ఆ ప్రయాణంలో వాళ్లకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి.


ఇది వరకు యంగ్‌ హీరోల దగ్గరకు ఓ కథ వస్తే... బాగుంటే ‘ఓకే’ అనేవారు. లేదంటే ‘లైట్‌’ తీసుకొనే వారు. ఇప్పుడు అలా కాదు. కథ నచ్చితే సరిపోవడం లేదు. ఆ కథకు ‘పాన్‌ ఇండియా’ లక్షణాలు ఉన్నాయా? లేవా అని బేరీజు వేస్తున్నారు. హిందీ వాళ్లకు, తమిళ ప్రేక్షకులకు, కన్నడ వాసీలకు నచ్చే విషయాలు ఏమున్నాయో చూడాల్సిందే. ఆ ఉద్దేశం హీరోలకు లేకపోయినా.. నిర్మాతలకో, దర్శకులకో ఉంటుంది. ‘ఈ సినిమాతో మీ మార్కెట్‌ని విస్తరించొచ్చు..’ అని ఎవరైనా అంటే చాలు. ఆ కథకు పాన్‌ ఇండియా రెక్కలొచ్చేస్తాయి. అలా.. తమ సినిమాలకు పాన్‌ ఇండియా కలరింగు ఇచ్చి, అక్కడ కూడా రిలీజ్‌ చేసి చేతులు కాల్చుకొన్న హీరోలున్నారు. ‘లైగర్‌’ కథగా అనుకొన్నప్పుడు కేవలం తెలుగులోనే తీద్దామనుకొన్నారు. కానీ... మధ్యలో పాన్‌ ఇండియా ఆలోచన వచ్చింది. దాంతో కథలో మార్పులు చేర్పులూ జరిగాయి. భారీ తారాగణం అవసరమయ్యారు.


ఆఖరికి మైక్‌ టైసన్‌ని కూడా తీసుకురావాల్సివచ్చింది. దాన్నే తెలుగుకి పరిమితం చేసి తీసుంటే.. ఫలితం ఇంకోలా ఉండేదేమో..? నిఖిల్‌ నటించిన ‘కార్తికేయ 2’ది మరో కథ. ఈ సినిమా విడుదలకు ముందు చాలా డ్రామానే నడిచింది. గట్టి కాంపిటీషన్‌ మధ్య ‘కార్తికేయ 2’ వచ్చింది. ఈ సినిమాకి కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. కంటెంట్‌ని నమ్మిన దర్శక నిర్మాతలు ఈ సినిమాని హిందీలో చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. తెలుగులో ఆడుతుందని నమ్మకం ఉన్నా, హిందీ మార్కెట్‌పై, అక్కడి వసూళ్లపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలూ లేవు. అయితే ‘కార్తికేయ 2’ నార్త్‌ బెల్ట్‌లో అనూహ్యమైన వసూళ్లు అందుకొంది. ఆదరణ దృష్ట్యా రోజు రోజుకీ థియేటర్లు పెంచుకొంటూ వెళ్లారు. బాలీవుడ్‌ నుంచి ఎవ్వరూ ఊహించని ఫలితం దక్కడంతో నిఖిల్‌ కూడా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా కథల్ని ఒప్పుకొంటే నిఖిల్‌ హిందీ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే. నాని, వరుణ్‌తేజ్‌ పాన్‌ ఇండియా దిశగా అడుగులేస్తున్నారు. నాని ‘దసరా’ హిందీలోనూ వెళ్తోంది. వరుణ్‌తేజ్‌ నావికా దళ అధికారిగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. అది వరుణ్‌కు తొలి పాన్‌ ఇండియా చిత్రం. అయితే.. శర్వానంద్‌, శ్రీవిష్ణు, నాగచైతన్య, నితిన్‌ లాంటి హీరోలు మాత్రం పాన్‌ ఇండియా సినిమాల వైపు అంతగా మొగ్గు చూపించడం లేదు. నాగచైతన్య ఇటీవల అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టయితే... చైతూ కూడా తప్పకుండా పాన్‌ ఇండియా వైపుగా అడుగులు వేసేవాడే. కానీ.. ‘లాల్‌ సింగ్‌’ ఫలితం బెడసి కొట్టింది. దాంతో.. ఆ దిశగా చైతూ ఆలోచించలేకపోతున్నాడు.

అయితే చాలామంది హీరోలకు ఓ కన్‌ఫ్యూజన్‌ ఉంది. తాము తెలుగుపై మాత్రమే ఫోకస్‌ చేస్తే సరిపోతుందా? లేదంటే మిగిలిన భాషల్నీ దృష్టిలో ఉంచుకోవాలా? అని. నిజానికి పాన్‌ ఇండియా కథలు, తెలుగు కథలూ అంటూ వేరుగా ఉండవు. మన కథల్లో నిజాయితీ ఉండాలి. అందులో కొత్త పాయింట్‌ కనిపించాలి. అప్పుడు తప్పకుండా మిగిలిన భాషలవాళ్లూ ఆదరిస్తారు. ఆ నిజం తెలుసుకోలేక.. చాలామంది హీరోలు బోల్తా కొడుతున్నారు. ఈ విషయాన్ని శ్రీవిష్ణు లాంటి యువ హీరోలు సైతం ఒప్పుకొంటున్నారు. ‘‘పాన్‌ ఇండియా కథలంటూ వేరుగా ఉండవు. నార్త్‌ వాళ్లు మన సినిమాల్ని ఇష్టపడుతున్నారంటే కారణం... మన కథల్లో ఉండే మ్యాజిక్‌ నచ్చడం వల్లే. హిందీ సినిమాలా.. మన తెలుగు సినిమా తీస్తే... వాళ్లు మెచ్చుకోరు’’ అని చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు. ఇంచుమించుగా రామ్‌ అభిప్రాయం కూడా ఇదే. ‘‘తెలుగు సినిమాల్లో ఉంటే హీరోయిజం, ఇక్కడి యాక్షన్‌... బాలీవుడ్‌ వాళ్లకు నచ్చుతోంది. అందుకోసమే మన సినిమాలు చూస్తున్నారు. మనం హిందీ సినిమాల్ని కాపీ కొడితే.. కచ్చితంగా ఫలితాలు తేడాగా వస్తాయి. మన తెలుగు సినిమాని హిందీలో మార్కెట్‌ చేసుకోవడంపై దృష్టి పెడితే సరిపోతుంది’’ అన్నాడు.

Updated Date - 2022-10-02T07:13:32+05:30 IST