రూ.కోట్లలో క్రికెట్‌ బెట్టింగ్‌ టర్నోవర్‌

ABN , First Publish Date - 2022-05-16T07:09:38+05:30 IST

ఐపీఎల్‌ సీజన రాగానే కొంతమంది యువతలో కొత్త జోష్‌ నిండుకుంటోంది. జీవితాలను ఫణంగా పెట్టి పందేలను ఆడుతున్నారు.

రూ.కోట్లలో క్రికెట్‌ బెట్టింగ్‌ టర్నోవర్‌

బెట్టింగ్‌ ఉచ్చులో  యువత

రాయదుర్గం  కేంద్రంగా దందా 

రింగ్‌ మాస్టర్‌  కనుసన్నల్లో వ్యవహారం 

సీజన్ల వారీగా  పోలీసుల ఒప్పందం 


ఐపీఎల్‌ సీజన రాగానే కొంతమంది యువతలో కొత్త జోష్‌ నిండుకుంటోంది. జీవితాలను ఫణంగా పెట్టి పందేలను ఆడుతున్నారు. సర్వం కోల్పోయినా పందెం మాత్రం వదలడం లేదు. కొందరు  నిర్వాహకులు క్రికెట్‌ బెట్టింగ్‌ల వ్యవహారాన్ని నడుపుతూ రూ. కోట్లల్లో టర్నోవర్‌ చేస్తూ దర్జాగా ఉంటున్నారు.  ఓ రింగ్‌ మాస్టర్‌ కనుసన్నల్లో బెట్టింగ్‌ దందా సాగుతోంది. కర్ణాటకకు చేరువలో ఉండటంతో రాయదుర్గంను కేంద్రంగా మార్చుకుని క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడిపిస్తూ  కోట్లు గడిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ మోజులో పడి యువత నాశనమవుతున్నా పోలీసులు పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం బాధాకరం. బెట్టింగ్‌ నిర్వాహకులను టచ చేస్తే రాజకీయ నాయకులు కొందరు రంగంలోకి దిగి నీడలా నిలిచి వారిని కాపాడుకుంటున్నారు. దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌ దందా బాహాటంగా నడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే రాయదుర్గంలో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం నడిపేందుకు  నిర్వాహకులు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లాలో కీలకంగా ఉండే ఓ వ్యక్తి దీని వెనుక సూత్రధారిగా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం భారీగా నడుస్తున్నా పట్టించుకోవడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందుతోంది. తమకు వచ్చిన తలనొప్పి ఎందుకంటూ ఏకంగా కొందరు సీజనల్‌ వారిగా ఒప్పందాలు కుదుర్చుకుని అటువైపు కన్నెత్తి చూడకుండా వుంటున్నట్లు  విమర్శలు ఉన్నాయి. 

- రాయదుర్గం


ప్రాంతాల వారీగా  నిర్వాహకులు 

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులకు రాజకీయ అండ ఉండటంతో ప్రాంతాల వారిగా విడదీసి వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో లక్ష్మీ బజారు, నేసేపేట, శాంతినగర్‌ లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్‌ వ్యవహారం నడిపించేందుకు కీలకంగా ఐదుగురు దాకా వున్నట్లు తెలిసింది. వీరి కనుసన్నల్లో బెట్టింగ్‌ దందా నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెట్టింగ్‌ నిర్వాహకుల మధ్య అంతర్యుద్ధం ఉన్నప్పటికీ బయటకు పొక్కకుండా ప్రాంతాల వారిగా విడగొట్టుకుని వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కర్ణాటకకు సమీపంలో ఉండటంతో ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను రాత్రి వేళల్లో సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించి చక్రం తిప్పే రింగ్‌ మాస్టర్‌కు వాహనాల్లో తీసుకెళ్లి చెల్లింపులు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌ దందాకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నట్లు గుప్పుమంటోంది.


ప్రాణాలను ఫణంగా పెట్టి బెట్టింగ్‌ 

 యువకులు బెట్టింగ్‌లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గత కొద్ది కాలం నుంచి బెట్టింగ్‌ల వ్యవహారం పుంజుకునే కొద్దీ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఓ యువకుడు బెట్టింగ్‌లకు బానిసగా మారి ఏకంగా రూ. 25 లక్షలు దాకా పోగొట్టుకోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా వున్నట్లు తీవ్ర చర్చ సాగుతోంది. అదేవిధంగా చిట్‌ఫండ్‌ కంపెనీలో పనిచేసే ఓ చిరుద్యోగి ఏకంగా కంపెనీకి సంబంధించిన రూ. 5 లక్షలను బెట్టింగ్‌లో కోల్పోయి నాశనమైనట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే యువకుడు బెట్టింగ్‌ల ఉచ్చులో పడి రూ. 12 లక్షల దాకా అప్పులు చేసి చివరకు బెట్టింగ్‌ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి నట్లు విశ్వసనీయ సమాచారం.  క్రికెట్‌ బెట్టింగ్‌ల వ్యవహారం నడుపుతున్న కొందరిని కర్ణాటకలోని మొలకాల్మూరులో అక్కడ పోలీసులు దాడులు చేసి పట్టుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్‌ చేసుకుని వచ్చినట్లు సమాచారం. 


టీమ్‌ను బట్టి చెల్లింపు శాతం 

క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో చెల్లింపుల ప్రక్రియ కీలకం. ముఖ్యంగా ఐపీఎల్‌ మ్యాచల్లో టీమ్‌లను బట్టి చెల్లింపు శాతాన్ని నిర్ణయిస్తారు. ఒకటికి రెండు కొన్ని టీమ్‌లకు.. ఒకటికి పది మరికొన్ని టీమ్‌లకు చెల్లింపులు వుంటాయి.  దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి యువత ఎక్కువ మొగ్గుచూపి బానిసగా మారిపోతోంది. కష్టం లేకుండా రాత్రికి రాత్రి సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్‌ నిర్వాహకుల ఉచ్చులో పడి వారి చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు కోల్పోయి అప్పులపాలై నాశనమవుతున్నారు. అంతేకాకుండా కొందరు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే వారు జిల్లాలోని ఒకరి కంట్రోల్‌లో వ్యవహారాన్ని నడిపి స్తున్నట్లు తెలిసింది. ఆయన కొందరు రాజకీయ ప్రము ఖులకు సన్నిహితంగా వుంటూ ఏ మాత్రం ఆపద వచ్చిపడినా కాపాడుకునే బాధ్యతను తీసుకుంటారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో బెట్టింగ్‌లు నిర్వహించే వారికి రెండు శాతం తేడా పెట్టుకుని చెల్లింపుల్లో వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు నిర్వాహకులు ధైర్యం చేసి పూర్తిగా డబ్బును తామే చెల్లిస్తామన్నట్లు నడిపిస్తున్నట్లు తెలిసింది. కాకపోతే దీనికి కొన్ని ప్రాంతాలను ఎంచుకుని వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. 


సీజన వారిగా ఒప్పందాలు 

క్రికెట్‌ బెట్టింగ్‌ల వ్యవహారంలో కొందరు పోలీసు యంత్రాంగం సీజన వారిగా లోపాయి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పట్లో నడుస్తున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో ఈ సీజన వరకు రూ. 2 లక్షల దాకా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రజల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు సంబంధించిన నిర్వాహకుల సమాచారం పోలీసు జిల్లా యంత్రాంగం వద్ద ఉన్నట్లు తెలియవచ్చింది. ఉన్నతాధికారులు నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని పంపినప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు వారిపై ఈగ వాలకుండా కాపాడుకుంటున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. పైగా కొందరు రాజకీయ నాయకులు కూడా బెట్టింగ్‌ నిర్వాహకులకు అండగా వుండటంతో దీనిని అదునుగా తీసుకుని ఒప్పందాలతో సరిపెట్టుకుంటున్నట్లు తెలియవచ్చింది. కనీసం సీజన నడుస్తున్నా బెట్టింగ్‌లపై దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేదనే విమర్శలు పోలీసులపై వస్తున్నాయి. 

Updated Date - 2022-05-16T07:09:38+05:30 IST