భారత సంతతి బ్రిటన్ మాజీ మంత్రి Rishi Sunak పై విమర్శల వెల్లువ.. ఇలాంటి వారు ప్రధాని కాకూడదంటూ..

ABN , First Publish Date - 2022-07-11T01:50:49+05:30 IST

తాజాగా మరోసారి ఆయనపై బ్రిటన్ ప్రజలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

భారత సంతతి బ్రిటన్ మాజీ మంత్రి Rishi Sunak పై విమర్శల వెల్లువ.. ఇలాంటి వారు ప్రధాని కాకూడదంటూ..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్(Boris Johnson) రాజీనామా చేసిన అనంతరం దేశ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాని పదవికి తాము పోటీపడుతున్నామంటూ పలువురు ప్రముఖ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక బోరిస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా చేసిన భారత సంతతి రిషి సునాక్(Rishi Sunak) కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు రంగంలోకి దిగారు. అయితే.. రాజకీయ రేసులో దూసుకుపోతున్న సునాక్‌ను తొలి నుంచి ప్రజావిమర్శ వెంటాడుతోంది. తాజాగా మరోసారి ఆయనపై బ్రిటన్ ప్రజలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఆయన ఎప్పటికీ మంత్రి కాకూడదంటూ సోషల్  మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సునాక్ యువకుడిగా ఉన్నప్పుడు బీబీసీ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తన మిత్రుల్లో కార్మిక కుటుంబాలకు చెందిన వారెవరూ లేరని కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది. 


2001లో బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిషి సునాక్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘నన్ను నేను మధ్యతరగతి వ్యక్తిగా భావిస్తా. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను కలిసినప్పుడు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ కళాశాలకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతుండేవాడిని. వారితో కొంత సేపు చర్చించాక నేను వించెస్టర్‌లో(Winchester) చదువుకున్నానని చెప్పి ఆశ్చర్యపరిచే వాడిని. నా బెస్ట్ ఫ్రెండ్ ఈటన్‌లో(Eton) చదివాడని చెప్పేవాడిని. దీంతో.. వారు అవునా అంటూ ఆశ్చర్యపోయేవారు. నా మిత్రుల్లో ఉన్నత వర్గాలకు చెందిన వారు, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు ఉన్నారు. కానీ.. కార్మిక కుటుంబాలకు చెందిన వారెవరూ లేరు.’’ అని అప్పట్లో సునాక్ వ్యాఖ్యానించారు. 


ఇది చూసిన బ్రిటన్ ప్రజలు మండిపడుతున్నారు. వాస్తవ ప్రపంచానికి, సామాన్య ప్రజాజీవితానికి ఇంత దూరంగా ఉన్న వారెవరూ బ్రిటన్‌కు ప్రధాని కాకూడదంటూ కామెంట్లు పెడుతున్నారు. తనకు దిగువ మధ్యతరగతి స్నేహితులెవరూ లేరని బహిరంగంగా ఎవరైనా చెప్పగలరా అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈటన్, వించెస్టర్ స్కూళ్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. బ్రిటన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, ఉన్నత వర్గాల వారి సంతానం వీటిల్లో చదువుకుంటారు.

Updated Date - 2022-07-11T01:50:49+05:30 IST