అమెరికన్ యువ ఓటర్లు బైడెన్‌వైపే..!

ABN , First Publish Date - 2020-10-29T00:08:50+05:30 IST

హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ యువ ఓటర్లపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

అమెరికన్ యువ ఓటర్లు బైడెన్‌వైపే..!

వాషింగ్టన్ డీసీ: హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ యువ ఓటర్లపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 18-29 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్లపై ఈ సర్వే నిర్వహించడం జరిగింది. 63 శాతం మంది యువత ఈసారి తాము ఎన్నికల్లో ఓటు వేయబోతున్నట్లు వెల్లడించారు. 2016లో ఓటింగ్‌లో పాల్గొన్న యువ ఓటర్ల(47 శాతం) కంటే ఇది అధికం. కాగా, ఈసారి 56 శాతం మంది యువత  బైడెన్‌వైపే ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. యువ ఓటర్ల ఆదరణలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే బైడెన్ 24 పాయింట్ల అధికంలో ఉన్నారని సర్వే తేల్చింది. ఇక 2008లో ఒబామా విజయం సాధించడంలో 18-29 మధ్య వయస్కుల ఓట్లే కీలకం అయ్యాయి. అప్పుడు ఒబామా ఏకంగా 68 శాతం యువ ఓట్లను కొల్లగొట్టారు. ఆ తర్వాత 2016లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్ 55 శాతం యువ ఓట్లు పొందారు.  


కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది. అయితే, ఇప్పటికే మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండడంతో పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి ఆసక్తిచూపించని ఓటర్లు ఈసారి పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌కు మొగ్గుచూపారు. దీంతో ముందస్తు ఓటింగ్ శాతం రికార్డుస్థాయిలో పెరిగింది. ఇక ఇప్పటికే పలు సర్వే ఫలితాలు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని తేల్చేశాయి. ఈసారి అమెరికన్లు బైడెన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.      

Updated Date - 2020-10-29T00:08:50+05:30 IST