పెళ్లి విషయం తాడోపేడో తేల్చుకుందామని యువతి ఇంటికెళ్లి..!

ABN , First Publish Date - 2021-06-22T14:00:54+05:30 IST

పెళ్లి విషయంలో తాడోపేడో తేల్చుకుందామని యువతి ఇంటికి వెళ్లిన యువకుడు...

పెళ్లి విషయం తాడోపేడో తేల్చుకుందామని యువతి ఇంటికెళ్లి..!

  • దూకాడా.. తోసేశారా?
  • నాలుగు అంతస్తుల భవనం  నుంచి పడి..
  • ఉద్యోగి అనుమానాస్పద మృతి
  • తన కొడుకుది హత్యే అంటున్న తండ్రి

హైదరాబాద్ సిటీ/బాలానగర్‌ : పెళ్లి విషయంలో తాడోపేడో తేల్చుకుందామని యువతి ఇంటికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాలుగు అంతస్తుల భవనం నుంచి పడడంతో ఆత్మహత్య అని పోలీసులు భావిస్తుండగా, యువతి తల్లిదండ్రులే తోసేశారని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వివరాలు... మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు చెందిన కోడ్లి సుదర్శన్‌ నగరంలో వ్యాపారం చేస్తున్నాడు. అతడి పెద్ద కొడుకు శుభం (27) అమెజాన్‌ కంపెనీ ఉద్యోగి. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టాలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో బాలానగర్‌ శోభనా కాలనీలో నివాసముండే ఓ అమ్మాయితో శుభానికి పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఇద్దరూ ఫోన్‌ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శుభం ఆమెతో చెప్పేవాడు.


కులాలు ఒకటే కావడంతో పెద్ద కూతురి పెళ్లి అయిన తర్వాత చూద్దామని అమ్మాయి తల్లిదండ్రులు కూడా చెప్పారు. పెళ్లి వాయిదా పడుతూ వస్తుండడంతో ఏదో ఒకటి తేల్చుకుందామనే నిర్ణయానికి వచ్చిన శుభం ఆదివారం రాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. తనతో మాట్లాడాలని ఆమెను ఫోన్‌లో అడిగాడు. రాత్రి కావడంతో ఇప్పుడు బయటకు రాలేనని, తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకుంటారని స్నేహితురాలు చెప్పింది. తర్వాత కలుస్తానని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. శుభం వినకుండా తనను అప్పుడే కలవకపోతే ఆమె నివాసం ఉండే నాలుగంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఊరికే బెదిరిస్తున్నాడని  స్నేహితురాలు తేలికగా తీసుకుంది. స్నేహితురాలు ఎంతకూ రాకపోవడంతో బిల్డింగ్‌ పై నుంచి శుభం దూకాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ వచ్చిన శబ్ధం విన్న శుభం స్నేహితురాలు, ఆమె తల్లిదండ్రులు బయటకు వచ్చారు. మృతి చెందిన శుభంను అంబులెన్స్‌లో ఎక్కించడం చూసి భయపడ్డారు. దీంతో జరిగిన విషయం గురించి బాలానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.


చంపేశారు..

తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, స్నేహితురాలి ఇంటికి వెళ్లిన శుభంను అమ్మాయి తల్లిదండ్రులే బిల్డింగ్‌ పైకి రమ్మని పిలిచి, తోసేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి తండ్రి సుదర్శన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులపై మృతుడి కుటుంబసభ్యులు దాడి చేస్తారేమోననే అనుమానంతో వారిని సనత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఉంచినట్లు  తెలిసింది.  వారి నుంచి వివరాలు సేకరించనున్నట్లు  సమాచారం.

Updated Date - 2021-06-22T14:00:54+05:30 IST