HYD : ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. Helmet సరిగ్గా పెట్టుంటే ఈ ఘోరం జరిగుండేది కాదేమో..!

ABN , First Publish Date - 2021-07-22T18:58:49+05:30 IST

ఇటీవలే ప్రారంభమైన బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై ..

HYD :  ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. Helmet సరిగ్గా పెట్టుంటే ఈ ఘోరం జరిగుండేది కాదేమో..!
1. వాహనం అదుపుతప్పి సేఫ్టీ వాల్‌ వైపు దూసుకువెళ్తూ...

  • బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ప్రమాదం
  • సేఫ్టీ వాల్‌ను ఢీ కొట్టిన యువకుడి మృతి

హైదరాబాద్ సిటీ/బాలానగర్‌ : ఇటీవలే ప్రారంభమైన బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వేగంగా వెళుతూ అదుపు తప్పి ఫ్లైఓవర్‌ సేఫ్టీ వాల్‌ను ఢీ కొట్టి యువకుడు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని 108సహాయంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.... ఏపీలోని ప్రకాశం జిల్లా కుడిదెన గ్రామానికి చెందిన అశోక్‌ (24) లారీడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కేపీహెచ్‌బీలోని తన సోదరుడు యనమల అనిల్‌ ఇంటికి వచ్చాడు. డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం తన బంధువు బైకుపై ఉదయం 11 గంటల సమయంలో తిరుమల గిరి ఆర్టీఏ కార్యాలయానికి బాలానగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్తున్నాడు.


అధిక వేగంతో వెళ్తున్న అశోక్‌ అదుపుతప్పి బ్రిడ్జికి ఎడమవైపున ఉన్న సేఫ్టీ గోడను బలంగా ఢీ కొట్టి కింద పడ్డాడు. హెల్మెట్‌ ధరించినప్పటికీ క్లిప్‌ సరిగా  పెట్టకపోవడంతో గోడను ఢీ కొట్టిన వెంటనే అది ఎగిరిపోయింది. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు ఫోన్‌ చేసి సమాచారం అందించగా సిబ్బంది అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అశోక్‌ మృతి చెందాడని తెలిపారు. హెల్మెట్‌ సరిగ్గా ధరించి ఉంటే బతికేవాడేమోనని స్థానికులు భావిస్తున్నారు. తమ్ముడు అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.







Updated Date - 2021-07-22T18:58:49+05:30 IST