కెనడా వెళ్లిన యువతను రప్పిస్తా: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-12T21:31:04+05:30 IST

ఉద్యోగాల కోసం కెనడా వెళ్లిన యువత వెనక్కి వచ్చేలా రాష్ట్రాన్ని సుసంపన్న..

కెనడా వెళ్లిన యువతను రప్పిస్తా: కేజ్రీవాల్

ఛండీగఢ్: ఉద్యోగాల కోసం కెనడా వెళ్లిన యువత వెనక్కి వచ్చేలా రాష్ట్రాన్ని సుసంపన్న పంజాబ్‌గా తీర్చిదిద్దుతామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేవారంలో పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సుపన్న పంజాబ్ లక్ష్యంగా పది పాయింట్ల 'పంజాబ్ మోడల్'తో ముందుకు వెళ్తామన్నారు.


పంజాబ్‌లో డ్రగ్ సిండికేట్‌కు చరమగీతం పాడతామని, పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే కేసుల్లో న్యాయం జరిపిస్తామని, అవినీతికి అంతం పలుకుతామని చెప్పారు. 16,000 మెహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పంజాబీకి ఉచిత చికిత్స అందిస్తామని, నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. పది పాయింట్ల ''పంజాబ్ మోడల్''లో భాగంగా అందరికీ ఉపాధి, డ్రగ్ మాఫియాకు కళ్లెం వేయడం, మహిళలకు నెలనెలా రూ.1000 పంపిణీ, రైతు సమస్యల పరిష్కరానికి పాటుపడతామని చెప్పారు. హెల్త్‌కేర్ విప్లవం, విద్యారంగంలో పెనుమార్పులు, వ్యాపారాలు చేసుకునేందుకు సానుకూలమైన వాతావరణం కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 'ఆప్' పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరనేది వచ్చే వారంలో ప్రకటిస్తామని చెప్పారు.


ప్రధానితో పాటు సామాన్య ప్రజానీకానికీ భద్రత..

ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై మాట్లాడుతూ, ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానితో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తగిన భద్రత కల్పిస్తామన్నారు. ప్రధాని భద్రతా లోపం తీవ్రమైన అంశమని అన్నారు. ప్రధానికి, సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంలో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Updated Date - 2022-01-12T21:31:04+05:30 IST