
తన డ్రైవర్ తనని వేధిస్తున్నాడంటూ.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన ఓ నటి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. యూట్యూబ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యువనటిని, ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహిం అనే అతను వేధిస్తున్నట్లుగా బంజారాహిల్స్ పిఎస్‌లో కేసు నమోదైంది. డ్రైవర్ ఇబ్రహిం డ్రగ్స్‌కు బానిసగా మారి, పదే పదే డబ్బు కోసం తనని వేధిస్తున్నట్లుగానూ.. ఇటీవల తను కేరళ వెళ్లినప్పుడు అతని వేధింపులు శృతిమించినట్లుగా.. సదరు నటి పోలీసులకు తెలియజేస్తూ.. బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు చేసింది. నటి నుంచి ఫిర్యాదు అందుకున్నబంజారాహిల్స్ పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
పోలీసులు చెబుతున్న ప్రకారం.. హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ నటి వద్ద రెండు సంవత్సరాలుగా షేక్ ఇబ్రహిం అనే అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13న ఆ నటి డ్రైవర్‌తో కలిసి కేరళకు వెళ్ళింది. డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఇబ్రహిం సమయానికి అవి దొరకక ఆమె పట్ల అసభ్యంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె తిరిగి నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉంటుంది. ఈ నెల 22న గెస్ట్ హౌస్‌కు వచ్చిన ఇబ్రహిం ఆమె వద్ద బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇబ్రహిం గొలుసు తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఇబ్రహిం తనను మానసికంగా వేధిస్తున్నాడని నటి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపిసి 354 సెక్షన్ కింద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.