ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈ మధ్య బహిరంగ సభల్లో ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగ సభలు పెట్టిన ప్రతిసారి ఆయా పథకాల గురించి మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan kalyan) విమర్శలు చేయడం పరిపాటిగా వస్తోంది. తాజాగా.. ఏలూరులో సీఎం పర్యటించారు. వైఎస్సార్ రైతుభరోసా నిధులు విడుదల చేశారు. 50.10 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం రైతుభరోసా పంపిణీ చేసింది. దీన్ని ఖరీఫ్ సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చింది.
ఒక్క రైతును కూడా..!
అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ (Runa Mafi) చేస్తానని గత ప్రభుత్వం దగా చేసిందని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు దత్తపుత్రుడు రైతు పరామర్శ పేరుతో బయలుదేరారు. పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారు. టీడీపీ, వైసీపీ (TDP, YSRCP) పాలనల మధ్య ప్రజలు తేడా గమనించాలి. టీడీపీ పాలనలో రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. రుణమాపీ చేస్తానన్న చంద్రబాబు మాట తప్పారు. ప్రశ్నించాల్సిన సమయంలో దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు. మా ప్రభుత్వంలో ఎక్కడా అవినీతి లేదు’ అని జగన్ చెప్పుకొచ్చారు. ఈ సభావేదికగా మరోసారి మీడియాపై సీఎం అక్కసు వెల్లగక్కారు. ‘దుష్టచతుష్టయం’ అని మీడియాను విమర్శించారు.
క్యాలెండర్ ప్రకారమే..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం రైతుభరోసా పంపిణీ చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా-పీఎం కిసాన్ సాయం అందించామని.. ఇప్పటివరకు రైతుభరోసా కింద రూ.23,875 కోట్లు ఇచ్చామన్నారు. మూడేళ్లలో రైతులకు రూ.లక్షా 10 వేల కోట్లు అందజేశామన్నారు. ముఖ్యంగా మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు లేదని జగన్ చెప్పుకొచ్చారు. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.13,500 జమ చేశామన్నారు. మొదటి విడతగా రూ.5,500 చొప్పున జమ కాగా.. పీఎం కిసాన్ పథకం కింద మరో రూ.2 వేలు అందించామన్నారు. నెలాఖరులోగా మొదటి విడతగా 50 లక్షల మంది రైతులకు రూ.3750 కోట్లు జమ చేశామని సీఎం జగన్ తెలిపారు.