బజారుకీడ్చొద్దు.. అంటూ వారిద్దరికి సీఎం జగన్ క్లాస్!

ABN , First Publish Date - 2020-11-26T17:33:14+05:30 IST

‘‘మీరు మీరు తిట్టుకుని పార్టీ..

బజారుకీడ్చొద్దు.. అంటూ వారిద్దరికి సీఎం జగన్ క్లాస్!

ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ బోస్‌లకు జగన్‌ క్లాస్‌

డీఆర్సీ సమావేశంలో ఇద్దరి వాగ్వాదంపై సీరియస్‌ 

బహిరంగ వేదికలపై కొట్లాటకు దిగితే నష్టపోతారని హెచ్చరిక

ద్వారంపూడి బూతుపురాణంతో చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం

ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, వైవీ సుబ్బారెడ్డి ఎదుట ‘పంచాయితీ’ పూర్తి

కాకినాడ టిడ్కో ఇళ్ల అవినీతిపై ఆధారాలను అధినేతకు అందజేసిన బోస్‌

తక్షణం నివేదిక పంపాలని అధికారులకు సీఎం ఆదేశాలు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి): ‘‘మీరు మీరు తిట్టుకుని పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు. ఇది పద్ధతి కాదు. సీనియర్‌ నేతలు అయి ఉండి బహిరంగ వేదికపై తిట్టుకోవడం ఏంటి. ఏవైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడండి. లేదంటే ఇన్‌చార్జి మంత్రి, పార్టీ జిల్లా వ్యవహారాల పర్యవేక్షకుడికి చెప్పండి. అంతేగానీ ఎవరికివారు రోడ్డున పడిపోతే చాలా చెడ్డపేరు వస్తుంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ బోస్‌లకు సీఎం జగన్‌ క్లాస్‌ పీకారు. సోమవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం, బూతు పురాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అమరావతి పిలిపించి పంచాయితీ నిర్వహించారు. 


వైసీపీలో కుమ్ములాటలపై అధినేత జగన్‌ దృష్టిసారించారు. నేతలు బహిరంగంగా గొడవలకు దిగుతుండడంతో ప్రభుత్వం, పార్టీకి నష్టం జరుగుతున్న విషయంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎంపీ బోస్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య వాగ్వాదం వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. సోమవారం జరిగిన డీఆర్సీలో కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతిపై ప్రశ్నించిన ఎంపీ బోస్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి బూతులతో దండెత్తారు. బహిరంగంగా మంత్రుల ముందే గొడవకు దిగారు. కాకినాడపై మీ పెత్తనం ఏమిటని మండిపడ్డారు. అసభ్యపదజాలంతో తిట్టారు. అటు బోస్‌ సైతం టిడ్కో ఇళ్ల అవినీతిపై మీకు చెప్పవలసిన అవసరం లేదని ద్వారంపూడి ముఖం మీదే చెప్పేశారు. సమావేశం చివర్లోనూ ఇద్దరు నేతలూ పోరా అంటే పోరా అన్నట్టు గొడవకు దిగారు.


అయితే ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగింది అనుకున్న పార్టీ నేతలకు అనూహ్యంగా అధినేత జగన్‌ నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరి వ్యవహారాన్నీ జగన్‌ సీరియస్‌గా తీసుకుని బుధవారం హుటాహుటిన అమరావతి పిలిపించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ జిల్లా వ్యవహారాల పర్యవేక్షకుడు వైవీ సుబ్బారెడ్డిని కూడా పిలిచి వారి సమక్షంలో బోస్‌, ద్వారంపూడిలను కూర్చోబెట్టి సుదీర్ఘంగా మాట్లాడారు. సీనియర్‌ నేతలు అయి ఉండి కూడా బహిరంగా గొడవకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్బాషలాడుకుని క్యాడర్‌కు ఏం సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. సమస్యలు ఏమున్నా అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బయటపడి రచ్చ చేస్తే పార్టీ పరువు బజారునపడుతుందన్నారు. ఇలాంటి విషయాలపై ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు సమాచారం.


అటు సీనియర్‌ నేత బోస్‌పై ద్వారంపూడి తిట్లపురాణంపైనా చర్చ జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిపై అంత దూకుడుగా వెళ్లి తిట్టడం సరికాదని ద్వారంపూడిని మందలించినట్టు పార్టీ వర్గాలు వివరించాయి. అయితే దీనిపై ద్వారంపూడి తన వివరణను జగన్‌కు వినిపించారు. కాకినాడ టిడ్కో ఇళ్ల అవినీతిపై తనకు తప్పించి బోస్‌ అందరికీ చెప్పారని ఫిర్యాదు చేశారు. పైగా డీఆర్సీలో నేరుగా దీనిపై చెప్పడంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయిందని వివరణ ఇచ్చారు. అనంతరం కృష్ణదాస్‌, సుబ్బారెడ్డి సమక్షంలో జరిగిన ఈ పంచాయతీలో ఏదైనా సమస్య ఉంటే వీరితో మాట్లాడాలని బోస్‌, ద్వారంపూడిలకి జగన్‌ సూచించారు.


అయితే టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని, తన దగ్గర బంధువుల వద్ద కూడా మామూళ్లు తీసుకున్నారని అధినేత జగన్‌కు బోస్‌ వివరించారు. ఇటీవల వరదలకు కాకినాడ మొత్తం మునిగిపోయిందని, ఇందుకు మేడలైన్‌లో అక్రమ నిర్మాణాలే కారణమని చెప్పారు. దీంతో మేడలైన్‌ విషయంలో అసలేం జరిగిందనే దానిపై తక్షణం నివేదిక పంపాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-11-26T17:33:14+05:30 IST