అవన్నీ చిన్న నోటిఫికేషన్లు.. ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు.. మరి ఇప్పుడేం చేస్తున్నారు..?

ABN , First Publish Date - 2021-11-07T15:08:08+05:30 IST

‘‘అవన్నీ చిన్న నోటిఫికేషన్లు. ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయి...

అవన్నీ చిన్న నోటిఫికేషన్లు.. ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు.. మరి ఇప్పుడేం చేస్తున్నారు..?

నిరుద్యోగులకు చీకట్లే

పండగలెన్ని వచ్చిపోతున్నా బతుకులో చేదే

మెగా డీఎస్సీపై రెండున్నరేళ్లుగా ఎదురుచూపులు

20 వేల ఖాళీలు.. ఒక్కటీ భర్తీచేయలేదు.. అక్కడి నుంచి ఇక్కడకు మార్చడం తప్ప

కొత్తగా ఇచ్చిన టీచరు ఉద్యోగం లేదు.. గత ప్రభుత్వంలో రెండుసార్లు డీఎస్సీ

2 విడతల్లో 19 వేల పోస్టుల భర్తీ.. అవేం సరిపోతాయని జగన్‌ నాడు ఎద్దేవా

మెగా డీఎస్సీ అంటూ లక్షల మందికి మోసం


‘‘వైసీపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తాం. 23వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పిల్లలకు మంచి చదువులూ, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రభుత్వాల బాధ్యత. అలాంటిది ఈ పెద్దమనిషి చంద్రబాబు 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్‌ ఇచ్చిందెంత? కేవలం 7,900 పోస్టులు. అది కూడా సిలబస్‌ మార్చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో పిల్లలున్నారు. దేవుడి దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పెడతామని ప్రతి పిల్లాడికీ చెబుతున్నా.’’

- 2018లో జగన్‌ ఇచ్చిన హామీ


(అమరావతి, ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో 11వేల ఉపాధ్యాయ పోస్టులకు, 2018లో మరో 7,900 పోస్టులకు డీఎస్సీ వేశారు. అన్ని పోస్టులు పెట్టుకుని ఇచ్చే టీచరు ఉద్యోగాలు ఇంతేనా.. అని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ చిన్న నోటిఫికేషన్లు. ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయి. వేసింది కొన్నే. నేనొస్తే మెగా డీఎస్సీ వేస్తాను’’ అని గొప్పలు చెప్పిన ఆయన.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైంది. మెగా డీఎస్సీ అంటే కనీసం 25వేల పోస్టులు ఉంటాయని నిరుద్యోగులు వెయ్యికళ్లతో ఎదురుచూశారు. హామీ ఇచ్చిన మెగా డీఎస్సీ పడితే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయనే ఆశతో ఉన్నారు. కానీ రెండున్నరేళ్లుగా డీఎస్సీ వేయకపోవడంతో వారి జీవితాల్లో చీకట్లే తారట్లాడుతున్నాయి.


వినాయకచవితి, దసరా, దీపావళి.. ఇలా పండగలెన్నో వచ్చిపోతున్నా ఈ చీకట్లు మాత్రం తొలగడం లేదు. మూడేళ్ల క్రితమే కోచింగ్‌ తీసుకున్నవాళ్లు కూడా ఇప్పటికీ డీఎస్సీ కోసం వేచి చూస్తుండటం నిరుద్యోగల దైన్యానికి దర్పణం పడుతోంది. విపక్షంలో ఉండగా జగన్‌ వేసిన లెక్కల ప్రకారమే.. 2018నాటికి 23వేల ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం 7,900 పోస్టులు భర్తీచేస్తే.. ఇక సుమారు 15వేల పోస్టులు మిగిలున్నాయి. ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో కనీసం 20వేల మంది పదవీ విరమణ చేశారని అంచనా. మొత్తం రెండులక్షల మంది ఉపాధ్యాయులుంటే...అందులో ఏటా 3శాతం పదవీ విరమణ చేస్తారు. అంటే రెండులక్షలకు సుమారు ఏడాదికి ఆరువేల మంది పదవీ విరమణ చేస్తారన్న మాట. మరి ఈ మూడేళ్లలో 18వేల మంది పదవీ విరమణ చేసినట్లు.


అంటే జగన్‌ చెప్పినట్లు గతంలో ఖాళీగా ఉన్న 15వేల పోస్టులు...ఈ మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన 18వేల పోస్టులు కలిపి మొత్తం సుమారు 33వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండాలి. మరి ఈ పోస్టుల భర్తీ సంగతి ఏమైనట్లు? ఎయిడెడ్‌ బడులు, కాలేజీలను ప్రభుత్వం విలీనం చేస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6,900 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వంలో కలవనున్నారు. ఒకవేళ వీరు కలిసినా ఇంకా వేల పోస్టులు ఖాళీగా ఉంటాయి. పైగా ఎయిడెడ్‌ విలీనం స్వచ్ఛందమేనని, కావాలంటే విలీనం కావడానికి అంగీకరించినవారు కూడా వెనక్కు వెళ్లొచ్చని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఈ సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయి. మరి ఖాళీగా ఉన్న మిగతా వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా ఉండడంలో ఆంతర్యమేంటని పలువురు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 


తరగతికో ఉపాధ్యాయుడైనా ఉండక్కర్లేదా?

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా ఉండక్కర్లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అలా ఉంటేనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యా రంగ నిపుణులు వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు కలిగినవి 15వేలు. అన్ని తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడంటే ఏ తరగతికి ఎప్పుడు పాఠం చెప్పాలి? మరోవైపు యాప్‌ల భారం. మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల వరకు ఆ ఒక్క టీచరే ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎక్కువమంది ఉపాధ్యాయులున్నచోటే ఇది కష్టతరంగా మారిన పరిస్థితుల్లో.. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులన్నీ చేస్తూ చదువు చెప్పడమంటే.. వానాకాలం చదువులే ఉంటాయన్న అభిప్రాయం నెలకొంది.

Updated Date - 2021-11-07T15:08:08+05:30 IST