YS Rajasekhar Reddy జయంతి నేడు

ABN , First Publish Date - 2022-07-08T13:50:44+05:30 IST

దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు

YS Rajasekhar Reddy జయంతి నేడు

అమరావతి (Amaravathi): దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించనున్నారు. అలాగే వైఎస్ భార్య విజయలక్ష్మి, కుమార్తె షర్మిళ, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. కాగా సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తాడేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొని, సమావేశాలు ప్రారంభిస్తారు.


రెండ్రోజులపాటు జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా కాజ సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ మైదానంలో వీటిని నిర్వహిస్తున్నారు. వేదికను సర్వాంగసుందరంగా అలంకరించారు.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి అయిన శుక్రవారం ఉదయం ప్రారంభమై శనివారం సాయంత్రానికి ముగిసే ఈ సమావేశాల ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు గురువారం పరిశీలించారు. గ్రామస్థాయి సభ్యుడి నుంచి పార్టీ అధ్యక్షుడు-ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వరకు.. అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. రెండ్రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్లీనరీ మొదటి రోజు సీఎం జగన్‌ ప్రసంగంతో ప్రతినిధుల సభ మొదలవుతుంది. మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన, మంత్రులు మాట్లాడతారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం, సాధికారిత మహిళా భద్రత వంటి నవరత్నాల హామీలపై తొమ్మిది తీర్మానాలు ప్రవేశ పెడతారు. శనివారం రెండోరోజున పార్టీ, ప్రభుత్వం ఇప్పటి దాకా అనుసరించిన వైఖరి, పాలనా విధానాలతోపాటు.. వచ్చే రెండేళ్లలో అనుసరించే వ్యూహంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు. కాగా.. ప్లీనరీకి హాజరుకావాలని గ్రామ/వార్డు సభ్యుడి నుంచి ముఖ్యనేతల దాకా అందరికీ జగన్‌ సంతకంతో కూడిన ఆహ్వాన లేఖలను పంపారు. తొలిరోజున లక్షన్నర మంది, రెండోరోజున నాలుగున్నర లక్షల మంది హాజరవుతారని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ రెండు రోజులూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు.. స్నాక్స్‌ కూడా అందిస్తారు.

Updated Date - 2022-07-08T13:50:44+05:30 IST