మీరా? మీ అమ్మగారా? లేక భారతి గారా?.. జగన్ తర్వాత ఎవరికి ఛాన్స్ అని షర్మిలను అడిగితే..

Published: Mon, 27 Sep 2021 02:05:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మీరా? మీ అమ్మగారా? లేక భారతి గారా?.. జగన్ తర్వాత ఎవరికి ఛాన్స్ అని షర్మిలను అడిగితే..

ఆర్కే:  మీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? 

షర్మిల:స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ శివార్లలో ఒక ధాబాకు వెళ్లినప్పుడు ఆయన కలిశారు. అప్పుడు నేను చదువుకొంటున్నా. అప్పటి నుంచి అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్లం. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అయితే కాదు. అయితే ముందు అనిలే ప్రపోజ్‌ చేశాడు. కానీ ఇంట్లో నాన్న ఒప్పుకోలేదు. ‘వాళ్లు బ్రాహ్మిణ్స్‌. మన పద్ధతులు వేరు. వాళ్ల పద్ధతులు వేరు. నువ్వు ఉండలేవు. నీకు ఇప్పుడు బానే ఉంటుంది. తరువాత తరువాత తెలుస్తుంది’ అన్నారు. 


ఆర్కే:  ఆహారపు అలవాట్ల నుంచి తేడాలుంటాయి కదా! 

షర్మిల:అవును. నాకసలు చికెన్‌ లేకపోతే కుదరదు(నవ్వు). ‘నువ్వు అనుకొంటున్నావు కానీ తరువాత చాలా గొడవలు వస్తాయి. వద్దు’ అని నాన్న నచ్చజెప్పారు. నేను వినలేదు. అలా అలా జరిగిపోయింది(నవ్వు). 


ఆర్కే:  ఆ తరువాత ఎప్పుడైనా బాధపడ్డారా? 

షర్మిల: లేదన్నా. 


ఆర్కే: మరి వాళ్లింట్లో నాన్‌వెజ్‌ సమస్య ఎలా పరిష్కరించుకున్నారు? అనిల్‌కి కూడా అలవాటు చేశారా?

షర్మిల: అనిల్‌ ముందు నుంచే తినేవాడన్నా. ఆ ధాబాలో కూడా తినేవాడు (నవ్వు). వాళ్లింట్లోవాళ్లు తినరు. 


ఆర్కే:  అనిల్‌ మీ క్యాంపెయిన్‌కు వస్తారా? 

షర్మిల:లేదు. ఆయన ఇవాంజలిస్ట్‌ (మత ప్రచారకుడు) కదా! ఎప్పుడూ క్యాంపెయిన్‌ చేయలేదు. 


ఆర్కే:  ఇవాంజలిస్ట్‌‌గా ఆయన పరోక్షంగా జగన్‌కు ఉపయోగపడ్డాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్‌ ఓట్లన్నీ గంపగుత్తగా ఒక నాయకుడికి సొంతమవడం ఏపీలోనే జరిగింది. ఇప్పుడు జగన్‌ని... క్రిస్టియన్స్‌ని విడదీయలేనంత బంధం ఏర్పడింది. దానికి ప్రధాన కారణం అనిలే కదా! 

షర్మిల: అవును. 


ఆర్కే: అన్న ఆంధ్రాలో సీఎం. చెల్లి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వం పనితీరు ఇక్కడ నీ మీద పడుతుంది. అవునా? 

షర్మిల: మొదటి నుంచి నాకొక స్పష్టత అయితే ఉంది. నేను, జగన్‌ రెండు ప్రాంతాలను ఎంచుకున్నాం. ఈ ప్రాంతాల్లో ప్రజలు వేరు... వాళ్ల ఆకాంక్షలు వేరు. వాళ్ల చరిత్ర... వాళ్ల రాజకీయాలు వేరు. ఒక పార్టీ రెండుచోట్లా ఉండి... రెండింటికీ న్యాయం చేయడం కష్టమవుతుంది. ఆ విషయం జగన్‌ అర్థం చేసుకున్నాడు కాబట్టే ఒక ప్రాంతానికే పరిమితమయ్యాడు. కానీ వైఎస్సార్‌ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రెండు ప్రాంతాలవారికీ సమ న్యాయం చేశాడు. ఆయనకు రెండు ప్రాంతాలూ రెండు కళ్లు. కనుక ఆయన ప్రేమించిన ఈ ప్రాంత ప్రజలకు నేను సేవ చేయాలనుకొంటున్నాను. మా పార్టీ పేరులో ‘తెలంగాణ’ కూడా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికే ఇక్కడ పార్టీ పెట్టాను.  


ఆర్కే:  మంచికన్నా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా! ఇప్పుడు ఏపీ విషయం తీసుకొంటే జగన్‌ పరిపాలన రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలా లేదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఆ ప్రభావం మీపై పడుతుంది కదా! ఆ పరిపాలన కంటే భిన్నమైన పరిపాలన ఇస్తామని, నిజమైన రాజన్న రాజ్యం తెస్తానని మీరు ఇక్కడ చెప్పగలరా? 

షర్మిల:మేము చెప్పేది వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని. ఆయన మొదలు పెట్టిన పథకాలు ఇక్కడ నామ్‌కేవాస్తేగా నడుస్తున్నాయంతే. సంక్షేమం అంటేనే ప్రాథమిక అవసరాలు. అవి తీర్చకపోతేనే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. అక్కడైనా ఇక్కడైనా ఐదేళ్లు అధికారం ఇస్తారు. పరిపాలన బాగుంటే మళ్లీ ఎన్నుకొంటారు. లేదం టే తిరగబడతారు. అక్కడేంజరుగుతుందనేది తెలియదు. 


ఆర్కే:  మీరు సీఎం పోస్టుకు పోటీపడుతున్నారు! 

షర్మిల: నిస్సందేహంగా. 


ఆర్కే: అలాంటప్పుడు ఎవరి ప్లస్‌లేంటి... మైన్‌సలేంటి అనేది పరిశీలిస్తారు కదా! 

షర్మిల:అయితే ఏపీలో ఏం జరుగుతుందన్నది నాకు సంబంధం లేని విషయం. తెలంగాణ ప్రజలకు నేను ఏంచేయగలుగుతాను అన్నదానిపైనే నా దృష్టి. 


ఆర్కే: తమిళనాడు, కర్ణాటకల్లో ఏంజరుగుతుందన్నది మనం పట్టించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. రెండు రాష్ట్రాలూ దాదాపు అరవై సంవత్సరాలు కలిసున్నాయి. అదీ కాకుండా మీదైనా, జగన్‌దైనా రూటు ఒకటే... రాజశేఖర్‌రెడ్డి! మైనస్‌ వైఎస్‌... మీరేంటి? 

షర్మిల: నథింగ్‌. అందుకేనన్నా... నేను రాజశేఖర్‌రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని మాత్రమే చెబుతున్నా. 


ఆర్కే: అలాంటి పాలన అక్కడ (ఏపీ) ఉందో లేదో నాకు తెలియదంటారు! 

షర్మిల: మీరు కనుక్కోండి (నవ్వు). అక్కడ స్థానిక ఎన్నికలు జరిగాయి. బానే వచ్చాయి కదా! 


ఆర్కే:  వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అంతా కలిసి ప్రార్థనలు చేశారు. కానీ మాట్లాడుకోలేదు! 

షర్మిల: అన్నా... మీరు పాత వీడియోలు చూడండి. ప్రేయర్‌లో ఎప్పుడూ మాట్లాడలేదు. మొన్న కూడా ప్రేయర్‌లో ఉన్నాం. ఆయన వచ్చాడు. ప్రేయర్‌ అయిపోయింది. దండలేశాం. ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయాం. అంతే తప్ప మాట్లాడుకోకూడదు అని కూడా ఏమీ లేదక్కడ. 


ఆర్కే:  జగన్‌కు మీకు మధ్య మాటా మంతి ఉందా? 

షర్మిల: ఎందుకు లేదన్నా? మాట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు కూడా ఫోన్‌ చేసి మాట్లాడాడు.  


ఆర్కే:  ప్రశాంత్‌ కిశోర్‌ని మీరు కూడా హైర్‌ చేసుకొంటున్నారా? 

షర్మిల: ‘ఓ సోదరుడిగా నీకు సాయం చేస్తాన’ని ప్రశాంత్‌ కిశోర్‌ గారు మాటిచ్చారు. ఏం చేయాలి... ఎలా చేయాలన్నది ఇంకా చర్చించలేదు. 


ఆర్కే:  ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నాడు..!

షర్మిల:చేరినా ఇక్కడ సమస్య కాదు. 


ఆర్కే:  అంటే నేననేది... నిదానంగా మిమ్మల్ని కాంగ్రెస్‌కి జత చేస్తాడేమోనని!

షర్మిల: అవకాశం ఉందన్నా. కానీ అక్కడ ఆయన పని చేసేది పార్లమెంట్‌ ఎన్నికల కోసం. ఇక్కడ నాకు... అసెంబ్లీకి. రెండు ఎన్నికలూ కలిసి కూడా రావు. 


ఆర్కే:  మరి జనాల్ని మెప్పించి, ఒప్పించడానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? 

షర్మిల: అక్టోబర్‌లో పాదయాత్ర మొదలుపెడుతున్నా. దానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. 


ఆర్కే:  అన్ని రోజులు సాధ్యమా? 

షర్మిల: ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పనేముంటుందన్నా! 


ఆర్కే: మరి పిల్లలు? 

షర్మిల:చదువుకొంటున్నారు. మా అబ్బాయి రాజాకు 21 సంవత్సరాలు. అమ్మాయికి 19. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. రాజాకి మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా ఇష్టం. ఎకనామిక్స్‌ స్టూడెంట్‌. అమ్మాయి బిజినెస్‌ స్కూల్లో ఫైనాన్స్‌ చదువుతోంది. నన్ను వదిలి అంత దూరం వెళ్లడం తనకు ఇష్టంలేదు.  


ఆర్కే:  వైఎస్‌ పన్నెండో వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశం పెట్టారు? ఆయన మద్దతుదారులందరి మద్దతు కోసమేనా? 

షర్మిల: అలాగేంలేదు. ఆయన మద్దతుదారులు అప్పుడూ ఉన్నారు... ఇప్పుడూ ఉన్నారు. ఆహ్వాన పత్రికల్లో కూడా ఎక్కడా పార్టీ పేరు లేదు. పుష్కర వర్ధంతి సందర్భంగా నాన్నని అభిమానించే వాళ్లని పిలిచి నివాళి అర్పించాలనుకున్నాం. కానీ దానికి రాజకీయాన్ని అంటగట్టేశారు. పిలిచినవాళ్లలో 70 శాతం ఆంధ్రావాళ్లు. రాజకీయం చేయాలనుకొంటే వాళ్లని ఎందుకు పిలుస్తాం? విజయవాడలో చేసినా నేను వెళ్లేదాన్ని. 


ఆర్కే:  మరి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిచారా?

షర్మిల: పిలిచాం. మేం వారం పది రోజుల ముందు అనుకుని చేసిన కార్యక్రమం. వచ్చినవాళ్లు కూడా ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. 


ఆర్కే:  వైఎస్‌ మరణానంతరం మీ అమ్మగారు కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది? 

షర్మిల: అమ్మకు నాన్నే ప్రపంచం. ‘నేనెందుకు బతికున్నాను? ఆ చాపర్‌లో నేనెందుకు లేను?’ అంటూ చాలా రోజులు బాధపడింది. మూడు నాలుగేళ్లయితే అమ్మ ముఖంలో అసలు నవ్వే లేదు. 


ఆర్కే:  కాంగ్రెస్‌ వాళ్లు అప్పట్లో హామీ గానీ, భరోసా గానీ ఏమీ ఇవ్వలేదా? సోనియా, మన్మోహన్‌ వచ్చారు కదా! 

షర్మిల:ఏం ఇవ్వలేదన్నా. కానీ సీఎంని చేయమని మేమేమీ అడగలేదు. మేం చేద్దామనుకున్న ఓదార్పు యాత్ర వద్దన్నారు.


ఆర్కే:  ఎవరు వద్దని చెప్పింది?

షర్మిల:సోనియాగాంధీ. ఆమెను కలవడానికి వెళ్లినప్పుడు చెప్పారు. అప్పటికీ ‘వాళ్లని ఓదార్చి, సానుభూతి తెలపడం మన బాధ్యత’ అని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాను. ఆమె అర్థం చేసుకోలేదు. 


ఆర్కే:  మీ ఉపన్యాసాలకు మెటీరియల్‌ ఎవరు తయారు చేస్తున్నారు?

షర్మిల: మాకో టీమ్‌ ఉందన్నా. కొంత పరిశోధన చేసి... సమాచారం సేకరించి... స్పీచ్‌ రెడీ చేసుకొంటాం. 


ఆర్కే:  కానీ ఇన్ని రోజులైనా జనంలో పట్టున్న నాయకులు ఇంకా మీ దగ్గరకు ఎందుకు రాలేదు? 

షర్మిల: మేము ఎవర్నీ ఆకర్షించే ప్రయత్నం చేయడంలేదు. తెలంగాణ ప్రజలు సరికొత్త సిద్ధాంతాలతో సరికొత్త నాయకత్వాన్ని, రాజకీయాన్నీ కోరుకొంటున్నారు. తరాలు మారుతున్నాయి. 45 శాతం ఓటర్లు 35 ఏళ్ల లోపువారే. అలాంటప్పుడు కొత్త నాయకులు అవసరం. కార్యకర్తల నుంచే నాయకులను ఎన్నుకొంటాం. 


ఆర్కే:  కేసీఆర్‌ ప్రభుత్వ బలం ఏమిటి? వాళ్ల బలహీనతలు ఏమిటి? మీరనుకొనేది కాకుండా జనం ఏమనుకొంటున్నారనేది కూడా తెలుసుకోవాలి కదా! 

షర్మిల: అవును. ఆ దిశగా చాలా ఫీడ్‌బ్యాక్‌ తీసుకొంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది.


ఆర్కే:  సో... నన్ను నన్నుగా చూడమని చెబుతున్నారు! 

షర్మిల:అంతే. 


ఆర్కే:  జగన్‌పై కేసులు వచ్చే ఏడాదికి కన్‌క్లూజన్‌కు వస్తాయి. ఆయన కన్విక్ట్‌ అవుతాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే సీఎం ఎవరు అవుతారు? మీరా? మీ అమ్మగారా? లేక జగన్‌ సతీమణి భారతి గారా? 

షర్మిల:ఒకవేళ ఏ కారణంచేతనైనా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేకపోతే ఆ పార్టీ విధివిధానాలను బట్టి ఆ పార్టీవాళ్లు నిర్ణయించుకొంటారు. 


ఆర్కే:  ప్రాంతీయ పార్టీల్లో విధివిధానాలు ఉంటాయా? 

షర్మిల: ఉండాలన్నా. అదే పద్ధతి. 


ఆర్కే:  ఇవాళ... రేపు జాతీయ స్థాయి పార్టీలే ప్రాంతీయ పార్టీలయ్యాయి. మోదీ, అమిత్‌షాలను కాదని బీజేపీలో, కేసీఆర్‌ని కాదని టీఆర్‌ఎ్‌సలో, చంద్రబాబుని కాదని టీడీపీలో ఎవరూ ఏ నిర్ణయం తీసుకోలేరు కదా!   

షర్మిల: అట్లంటే మీ లెక్క ప్రకారం వైఎస్సార్‌సీపీలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించాలి. అంతే కదా!   


ఆర్కే:  అలాంటి నిర్ణయాలు ఒక్కోసారి ఆమోదయోగ్యం కావచ్చు... కాకపోవచ్చు కదా! 

షర్మిల: అవును.  


ఆర్కే:  ఇప్పుడు మీ పార్టీ షర్మిల చుట్టూనే కదా ఉంది! 

షర్మిల: ప్రస్తుతానికి! బట్‌ వియ్‌ నీడ్‌ టు బిల్డ్‌ ఏ టీమ్‌! 


ఆర్కే:  మీ రాజకీయ ప్రస్థానం ప్రోత్సాహకరంగానే ఉందా? 

షర్మిల: యస్‌ అన్నా. లుకింగ్‌ వెరీ బ్రైట్‌. భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది. 


ఆర్కే:  మీ ఈ ప్రయాణం విజయవంతమవ్వాలని కోరుకొంటూ... థ్యాంక్యూ వెరీమచ్‌! 

షర్మిల: థ్యాంక్యూ అన్నా!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.