వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-17T23:16:42+05:30 IST

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా...

వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం దేవిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు వారెంట్ ఇచ్చారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. 


అసలు వివేక హత్య ఎలా జరిగింది.. నిందితులెవరంటే..!

అత్యంత సంచలన రీతిలో 2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఇప్పటివరకు నలుగురి పాత్రను సీబీఐ అధికారులు వెలికితీశారు. ఈ నిందితుల్లో దస్తగిరి ఒకడు. గతంలో అతడు వివేకాకు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్‌ యాదవ్‌, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగిరెడ్డి ఈ కేసులో మిగతా నిందితులు. వీరందరిపై ఇటీవల సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. 


సీబీఐ దర్యాప్తులో భాగంగా 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీబీఐ అధికారులు నమోదు చేయించారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, యర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌తో కలిసి తాను గొడ్డలితో నరికి వివేకాను అంతమొందించినట్టు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంగీకరించాడు. ‘‘నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాము.. మరియు దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు’’ అని యర్ర గంగిరెడ్డి అన్నట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ‘ఎవరా పెద్దవాళ్లు’ అని తాను అడగ్గా.. ‘వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నారు’ అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ర్టేట్‌ ఎదుట వెల్లడించాడు. 

Updated Date - 2021-11-17T23:16:42+05:30 IST