క్లినిక్‌లకు.. కష్టాలు

ABN , First Publish Date - 2021-10-30T05:02:13+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను పక్కన పెట్టేశారు.

క్లినిక్‌లకు.. కష్టాలు
తెనాలి: యడ్ల లింగయ్య కాలనీలో పునాదుల స్థాయిలో నిలిచిన నిర్మాణం


పట్టణాల్లో నిలిచిన నిర్మాణాలు

పునాదుల్లోనే వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు

రూ.2 కోట్లు కూడా విడుదల చేయని వైనం

డిసెంబరు 31కి పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారినట్లే


పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం సంకల్పించింది. నాలుగు నెలల క్రితం ఆర్భాటంగా ప్రజాప్రతినిధులతో శంకుస్థాపనలు చేశారు. అయితే ఆ సంకల్పం శంకుస్థాపనల దశ దాట లేక పోతోంది. కొన్ని ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభమైనా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఈ పరిస్థితుల్లో డిసెంబరు 31లోపు ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులో తెస్తామన్న పాలకుల ప్రకటనలు ప్రగల్భాలకే పరిమితమ య్యేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు మంజూరు చేశారు. అయితే ఎంతో వేగంగా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకున్న ప్రభుత్వం ఆలోచనలకు నిధుల లేమితో బ్రేక్‌లు పడ్డాయి. ఇదే పరిస్థితే కొనసాగితే మరో ఏడాదికి అయినా అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణాలు పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. కొత్తవి పక్కన పెడితే కనీసం ప్రస్తుతం ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలోనైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 



(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)


ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను పక్కన పెట్టేశారు. కొత్తగా వైసీపీ ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లీనిక్స్‌ను మంజూరు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 32 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 50 నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆర్భాటంగా వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ గురించి ప్రకటించింది. అయితే పనులు చేస్తోన్న కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిసెంబరు 31వ తేదీకి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం దాదాపుగా నీరుగారిపోయినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.


కాగితాల్లోనే నిధులు

జిల్లాలో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లీనిక్స్‌ 17 గుంటూరు నగరంలో, మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 9, తెనాలిలో 5, చిలకలూరిపేటలో 4, పిడుగురాళ్ల, దాచేపల్లి, నరసరావుపేట, సత్తెనపల్లి, పొన్నూరులో రెండు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. మాచర్ల, గురజాల, వినుకొండ, రేపల్లె, బాపట్ల మునిసిపాలిటీలకు కూడా ఒక్కొక్కటి మంజూరయ్యాయి. కొత్తగా నిర్మించే భవనాలకు రూ. 80 లక్షలు, ప్రస్తుతం ఉన్న వాటిల్లో 15 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల మరమ్మతులకు రూ.10 లక్షలు కేటాయించింది. అయితే ఆయా నిధుల విడుదల కాగితాలకే పరిమితమైంది. 10 భవనాల పనులు పీసీసీ(ఫుట్టింగ్స్‌) దశ, 15 నిర్మాణాలు ఫౌండేషన్‌ని పూర్తి చేసుకున్నాయి. 5 భవనాలకు ప్లింత్‌బీమ్‌ వరకు పనులు జరిగాయి. రూఫ్‌ స్థాయికి 2 భవనాలు వచ్చాయి. ఈ విధంగా మొత్తం రూ.2 కోట్ల 2 లక్షల 50 వేల విలువ చేసే పనులను కాంట్రాక్టర్లు ఖర్చు చేశారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఊసే లేదు.   మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో తమకు బిల్లుల చెల్లింపు చేస్తారో, లేదోనన్న అనుమానాలను కాంట్రాక్టర్లు వ్యక్తపరుస్తూ పనులు ఆపేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొంటే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ విషయంలో ప్రచారం జాస్తి ఆచరణ నాస్తి అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి.


సాగని పనులు

నరసరావుపేటలో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లినిక్‌ నిర్మాణాలకు రూ.1.30 కోట్లు కేటాయించారు. పనులకు ఆర్భాటంగా శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా  పనులు ముందుకు సాగడంలేదు. వెంకటరెడ్డి నగర్‌లోని తిలక్‌ స్కూల్‌ ప్రాంగణంలో భవనం ఫౌండేషన్‌ స్థాయికి కూడా రాలేదు. పెద చెరువులోని శివ అతిఽథి గృహం సమీపంలో అయితే ఇంతవరకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. 


ఆదిలోనే గండి

తెనాలిలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలకు ఆదిలోనే గండి పడింది. ఐదు కేంద్రాలు మంజూరుకాగా వీటిలో మూడు కేంద్రాల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లించడంలో జాప్యం కావడంతో పనులను నిలిపివేశారు. చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారనే అంశంలో ఇంతవరకు సంబంధిత అధికారుల వద్ద తగిన సమాచారం కూడా లేదనేది అసలు విషయం.  పాతగవర్నమెంటు ఆసుపత్రి ప్రాంగణం, యడ్ల లింగయ్యకాలనీ, సుల్తానాబాద్‌లో పనులు ప్రస్తుతం పునాదుల దశలోనే ఆగిపోయాయి. పినపాడు, ఐతానగర్‌లో కేంద్రాలకు తొలుత పాఠశాల ప్రాంగణాలు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలతో ఆ కేంద్రాలకు వేరే స్థలాలను కేటాయించారే కాని అక్కడ ఇంకా పనులు ప్రారంభించలేదు. 


వెక్కిరిస్తున్న శిలాఫలకం 

బాపట్లలోని ప్యాడిసన్‌పేట జగనన్నకాలనీలో రూ.80 లక్షలు వెచ్చించి వైఎస్సార్‌ అర్బన్‌హెల్త్‌క్లినిక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నెలలు గడుస్తున్న పనులు ప్రారంభంకాలేదు. వేసిన శిలాఫలకం వెక్కిరిస్తున్నది. చేసిన పనులకే బిల్లులు రావటంలేదని దీని నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రావటంలేదు.   

 



మంజూరు కాని బిల్లులు 

మాచర్ల పట్టణానికి వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లినిక్‌ మంజూరైంది. ఇందుకు రూ.90 లక్షల మేర ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బిల్డింగ్‌ శ్లాబ్‌ లెవల్‌ వరకు చేరుకుంది. అయినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కాంట్రాక్టర్‌ ఆందోళన చెందుతున్నారు. శ్లాబ్‌ దశలోనే నిర్మాణం నిలిచిపోయింది. 


బిల్లులు ఇస్తేనే పనులు

పొన్నూరులో సాంబశివనగర్‌ కాలనీ, నిడుబ్రోలు వడ్డిముక్కల రోడ్డులో సుమారు రూ.2 కోట్లతో ప్రారంభించిన  వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం పనులు పునాదుల దశలోనే ఉన్నాయి. జూన్‌ 5న పనులకు శంకుస్తాపన చేయగా అప్పటి నుంచి నత్తనడకన సాగిస్తున్నారు. రూ.34 లక్షల విలువ చేసే  పనులు  జరిగ్గా బిల్లులు మంజూరు కావాల్సి ఉంది.   బిల్లులు మంజూరైతే తప్ప తిరిగి పనులు ప్రారంభించే అవకాశాలు లేవు.


బేస్‌మట్టంలోనే భవనం

వినుకొండలో ఎన్‌ఎస్‌పీ కాలనీ ఆవరణలో సుమారు రూ.80 లక్షలతో వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్‌  పనులు ప్రారంభించారు. రూ.20 లక్షలు వెచ్చించి ఫౌండేషన్‌ను నిర్మించారు. ఈ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను ఆపివేశారు. ఆరు నెలలు గడుస్తున్నా బిల్డింగ్‌ నిర్మాణం కేవలం బేస్‌మట్టానికే పరిమితమైంది.  

 

పూర్తి కాని పనులు

తాడేపల్లికి మూడు వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వాటిలో ఒక క్లినిక్‌ను సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మిగతా రెండింటిలో ఒకటి డోలాస్‌నగర్‌, కుంచనపల్లిలో మరొకటి కేటాయించారు. ఒక్కో క్లినిక్‌కు రూ.80లక్షల వంతున రూ.1.60కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు ఇంతవరకు పూర్తి కాలేదు. కుంచనపల్లిలో క్లినిక్‌ను స్థానిక సబ్‌ సెంటర్‌ (ఆరోగ్య కేంద్రంలో), డోలాస్‌ నగర్‌ క్లినిక్‌ను ఆర్‌ఎంఎస్‌ కాలనీలోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.  


మూడింటికి ఒక్కటే

సత్తెనపల్లి పట్టణంలో మూడు ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేశారు. అయితే వీటిలో ఒక్క దగ్గర మాత్రమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వెంగళరెడ్డినగర్‌, ఎన్‌ఎస్పీ, ఆర్‌అండ్‌బీ బంగ్లా ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జూన్‌ 23న శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం   ఆర్‌అండ్‌బీ బంగ్లా  ప్రాంతంలో మాత్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 


నత్తనడకన నిర్మాణం

చిలకలూరిపేటకు మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు మంజూరయ్యాయి. అంబేద్కర్‌ కాలనీలోని ఆరోగ్యకేంద్రం శ్లాబు వరకు పూర్తయింది. మదర్‌ థెరిస్సాకాలనీలోని ఆరోగ్యకేంద్రం నిర్మాణం బేస్‌మెంట్‌ వరకు వచ్చింది. సాంబశివనగర్‌లో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

  

ప్రారంభంకాని పనులు

పిడుగురాళ్లలో మూడు, దాచేపల్లిలో రెండు, గురజాలలో రెండు చొప్పున ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. పిడుగురాళ్లలో రెండింటికి మాత్రమే స్థలాలు దొరకడంతో వాటిల్లో కొద్దిరోజుల క్రితమే పనులు ప్రారంభించారు. మరొకదానికి స్థలాన్వేషణలో అధికారులు ఉన్నారు. దాచేపల్లి, గురజాల పట్టణాల్లోని కేంద్రాల పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. పిడుగురాళ్లలో లెనిన్‌నగర్‌లోని కేంద్రానికి రూ.30 లక్షలు ఖర్చు చేసినా బిల్లు జమకాలేదు.  




Updated Date - 2021-10-30T05:02:13+05:30 IST