అధికారుల తప్పులకు లబ్ధిదారులకు తిప్పలు

ABN , First Publish Date - 2022-05-20T05:10:13+05:30 IST

ఆన్‌లైన్‌ నమోదులో అధికారుల తప్పులకు లబ్ధిదారు లకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

అధికారుల తప్పులకు లబ్ధిదారులకు తిప్పలు
తహసీల్దారు గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేస్తున్న మత్స్యకారులు

25 కుటుంబాలకు అందని మత్స్యకార భరోసా

లేని భూములు ఉన్నట్లుగా ఆన్‌లైన్‌ నమోదు

అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు

బాపట్ల, మే 19: ఆన్‌లైన్‌ నమోదులో అధికారుల తప్పులకు లబ్ధిదారు లకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మండలంలోని అడవిపంచాయతీ పరిధిలోని అడవిపల్లెపాలెంలో 25 మత్స్యకార కుటుంబాల వారికి భూములు లేకున్నా ఉన్నట్లు అధికారులు రికార్డులలో చూపడంతో వారు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకానికి అనర్హులుగా మిగిలారు. ఒక్కొక్కరికి 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో తప్పుడు ధ్రువీకరణ చేయటంతో వారు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కోల్పోయారు. దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బాధిత కుటుంబాలవారితో కలిసి గురువారం తహసీల్దారు కేవీ గోపాలకృష్ణకు, మత్స్యశాఖ జేడీ పీ.సురేష్‌ను కలిసి వినతిపత్రం అందజేసి ఆ మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెందిన చౌడుపల్లి నాగేశ్వరరావు, కంభాల శ్రీను, యాకోబు,తాతారావు, అక్కల రామిరెడ్డి, ఎం.దేవుడు, కనకరాజు, హరికృష్ణరెడ్డి, సాలెంరాజు, ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల మండల కార్యదర్శి మువ్వల పల్లవి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T05:10:13+05:30 IST