YS Sharmila తో మొన్న YV Subbareddy.. నేడు Alla భేటీ.. ఆంతర్యమేంటో..!

ABN , First Publish Date - 2021-10-26T08:19:55+05:30 IST

‘‘నేనూ తెలంగాణ ఆడ బిడ్డనే.. ఇక్కడే పుట్టి పెరిగా.. ఇక్కడే చదివా.. నేను వివాహం చేసుకుందీ తెలంగాణ వ్యక్తినే. కొడుకును, కూతురిని ఇక్కడే కన్నా. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే

YS Sharmila తో మొన్న YV Subbareddy.. నేడు Alla భేటీ.. ఆంతర్యమేంటో..!

  • తెలంగాణ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. 
  • ప్రజల సంక్షేమానికే నా జీవితం అంకితం..
  • రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయరేం?: షర్మిల


మహేశ్వరం/ఇబ్రహీంపట్నం/కందుకూరు/రంగారెడ్డి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ‘‘నేనూ తెలంగాణ ఆడ  బిడ్డనే.. ఇక్కడే పుట్టి పెరిగా.. ఇక్కడే చదివా.. నేను వివాహం చేసుకుందీ తెలంగాణ వ్యక్తినే. కొడుకును, కూతురిని ఇక్కడే కన్నా. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే మీ ముందుకు వచ్చాను. ప్రజలకే నా జీవితాన్ని అంకితం చేస్తా. నన్ను ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఆరో రోజు మహేశ్వరం, తుమ్మలూరు మీదుగా కందుకూరు మండలం రాచులూరుగేటు, లేమూరు, తిమ్మాపురం శివారు వరకు 14.6 కిలో మీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని, దీన్ని ప్రశ్నించాలని పేర్కొన్నారు. మోసకారి కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ బందీ అయిందని, విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


వైఎస్‌ఆర్‌ ఐదేళ్ల పాలనలో 64లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు ఒకేసారి రుణమాఫీ చేశారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి సాగును పండుగలా మార్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌  ఏడేళ్ల పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అప్పట్లో గ్యాస్‌పై రూ.50 పెంచితే మహిళలపై భారం పడకుండా వైఎస్‌ ప్రభుత్వమే భరించిందని తెలిపారు. వైఎస్‌  హయాం నాటి సంక్షేమ పాలన తిరిగి తెచ్చుకోవాలంటే వైఎస్సార్‌ టీపీని ఆశీర్వదించాలని కోరారు.  కాగా, మహేశ్వరానికి చెందిన టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎడ్మ మోహన్‌రెడ్డి సోమవారం షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు.


మొన్న వైవీ సుబ్బారెడ్డి.. నేడు ఎమ్మెల్యే ఆళ్ల 

వైఎస్‌ షర్మిల పాదయాత్రలో భాగంగా లేమూరులో నిర్వహించిన ‘మాట- ముచ్చట’లో ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయ న వేదికను పంచుకోకుండా జనం మధ్యలో ఒకడిగా కూర్చొని షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అనంతరం అందరితో కలిసి పాదయాత్రలో నడిచారు. రాత్రి ఆర్మియాగూడలో క్యాంప్‌ వద్ద  షర్మిలతో గంటపాటు భేటీ అయ్యారు. ఆదివారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి షర్మిలతో భేటీ కాగా.. తాజాగా ఆళ్ల సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2021-10-26T08:19:55+05:30 IST