‘అమరరాజా’ వ్యవహారంపై MLA Roja సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2021-08-06T17:25:03+05:30 IST

గత నాలుగైదు రోజులుగా ‘అమరరాజా’ ఫ్యాక్టరీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే.

‘అమరరాజా’ వ్యవహారంపై MLA Roja సంచలన కామెంట్స్

చిత్తూరు : గత నాలుగైదు రోజులుగా ‘అమరరాజా’ ఫ్యాక్టరీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. అమరరాజా, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమరరాజా’ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఒక అమరరాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇది రాజకీయం కాదు.. కాలుష్యం సమస్యగా మాత్రమే చూడాలని హితవు పలికారు. నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందన్న విషయాన్ని రోజా గుర్తు చేశారు.


ఇదేం పద్ధతి కాదు..!

చంద్రబాబు పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు. అమరరాజా ఒక్కటే కాదు.. రాష్ట్రంలో 54 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైంది. అమరరాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. హైకోర్టు ఆదేశాలను శిరసా వహించి కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలి. తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలి. పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. అమరరాజా కంపెనీని జగన్ ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదు. తప్పులను సరిదిద్దుకుని నియమ నిబంధనలతో పరిశ్రమలు నడిపించాలని అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారులు కోరారుఅని రోజా చెప్పుకొచ్చారు.


కాగా.. చిత్తూరు జిల్లాలో 16వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... ఐదేళ్లలో రూ.11,865 కోట్ల పన్నులు ‘అమరరాజా’ కట్టిన విషయం విదితమే. అమరరాజా విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే... ‘మూసివేయించాలి’ అని ముందే అనుకుని, దానికి అనుగుణంగా అడుగులు వేసినట్లు బలమైన అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, రాజకీయ జోక్యం లేకుండా జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన సంస్థకు పీసీబీ ‘మూసివేత’ నోటీసులు ఇచ్చే అవకాశమే లేదని అధికారులే చెబుతున్నారు.

Updated Date - 2021-08-06T17:25:03+05:30 IST