యుగ ధర్మం

ABN , First Publish Date - 2020-11-27T06:04:56+05:30 IST

ముక్తిని, మోక్షాన్ని కోరడం స్వర్గలోకంలో సుఖాలను కోరడం కాదని ఆత్మ వెళ్లి పరమాత్మలో లీనం కావాలని కోరుకోవడమే అని కొందరు...

యుగ ధర్మం

ఎవరికి వారు యుగధర్మాన్ని గుర్తించి, గౌరవించి, శ్రద్ధాసక్తులతో దాన్ని పాటిస్తే యుగానికొకసారి తన వైకుంఠాన్ని వదలి, మహీతలంపై జన్మించవలసిన అవసరం విష్ణుమూర్తికి కలగదు.


ముక్తిని, మోక్షాన్ని కోరడం స్వర్గలోకంలో సుఖాలను కోరడం కాదని ఆత్మ వెళ్లి పరమాత్మలో లీనం కావాలని కోరుకోవడమే అని కొందరు చెప్పవచ్చు. కాని పరమాత్మలో లీనం కావాలని కోరుకొనడమైనా ఆత్మోద్ధరణను, ఆత్మానందాన్ని కోరుకొనడమే కాదా? ఇది విడ్డూరమైన మాటగా పెక్కుమందికి తోచినా, తనకు ముక్తి మోక్షాలు లభించాలని తపన చెందేవానికంటే తన బిడ్డలు పైకిరావాలని కోరుకునే తండ్రి అధిక గౌరవపాత్రుడు. కారణం-అతడు కోరుకొనేది తన బిడ్డల బాగునే కాని, తన బాగును కాదు. వారి బాగుకై తన బాగును బలిపెట్టడానికి సయితం అతడు సంకోచించడు. ఏమైనా, వ్యక్తి కోరవలసింది తనకు ముక్తి మోక్షాలు లభించాలని కాదు, తన సంఘానికి, తన జాతికి, మొత్తం మానవాళికి ముక్తి మోక్షాలు సిద్ధించాలని. సరిగా ఇదే హెచ్చరికను నిన్న లక్నోలో ఉత్తరప్రదేశ్ ఆర్యసమాజం వజ్రోత్సవ సభలో ప్రసంగిస్తూ జవహర్ లాల్ చేశాడు. 

‘ధర్మం’ అనే మాటకు ‘మతం’ అనే అర్థం వున్నా, మతం కంటె ‘ధర్మం’ విపులమైనదని, విశిష్టమైనదని నెహ్రూ తన లక్నో ప్రసంగంలో వివరించాడు కూడా. మతం అనే అర్థంలో ధర్మం ఏ హిందూధర్మానికో, బౌద్ధధర్మానికో పరిమితం కావచ్చు. ‘యుగధర్మం’ అన్నప్పుడు మాత్రం ఆయా మత విశ్వాసాలను అనుసరించే వారి అవధులను దాటి అది విశ్వవ్యాప్త మౌతుంది. అందువల్ల మతధర్మం కంటె కూడా యుగ ధర్మమే ఉన్నతమైనదని, ఉదాత్తమైనదని నెహ్రూ చెప్పిన మాటను అత్యధిక సంఖ్యాకులు హర్షించలేక పోవచ్చు గాని, విజ్ఞుల దృష్టిలో అదే పరమసత్యం.

ధర్మాన్ని సంస్థాపించడానికి, అధర్మాన్ని వినాశం చేయడానికి భగవంతుడు యుగ యుగంలో అవతరిస్తాడో, లేదో తెలియదు గాని, కాలాన్ని బట్టి ధర్మం మారుతుందని, ఏ కాలానికి చెందినవారు ఆ కాలానికి సంబంధించిన ధర్మాన్ని (తమ యుగధర్మాన్ని) పాటించడానికి, దాన్ని పరిపోషించడానికి దీక్ష వహించాలని నెహ్రూ లక్నోలో చెప్పిన మాటలు సయితం మననం చేసుకోదగినవే. ఎవరికి వారు యుగధర్మాన్ని గుర్తించి, గౌరవించి, శ్రద్ధాసక్తులతో దాన్ని పాటిస్తే యుగాని కొకసారి తన వైకుంఠాన్ని వదలి, మహీతలంపై జన్మించవలసిన అవసరం విష్ణుమూర్తికి కలగదు. బౌద్ధమత గ్రంథాలు అవలోకితేశ్వరుని గురించి ప్రస్తావిస్తూ ‘ఈ అనంత విశ్వంలో చిట్టచివరి అణువుకు నిర్వాణం లభించేవరకు నాకు నిర్వాణం వలదు’ అని ఆయన పలికినట్టు వివరిస్తున్నాయి. అవలోకితేశ్వరుని ఈ మహోదాత్త వైఖరిని పూర్తిగా అవలంభించకపోయినా తన ముక్తి మోక్షాల కోసం కాక, సంఘోన్నతికై సమాజోద్ధరణకై, ప్రతి వ్యక్తి కొంతవరకైనా కృషి చేయాలి. అప్పుడే తన యుగధర్మాన్ని పాటించగలుగుతాడు. 

1963 మే 15 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘స్వార్థ చింత’ నుంచి

Updated Date - 2020-11-27T06:04:56+05:30 IST