యూరియా.. ఏదయ్యా!?

ABN , First Publish Date - 2022-01-04T05:19:45+05:30 IST

అందరూ శాఖాహారులే. మరి రొయ్యల బుట్ట ఎలా మాయమైందో.. అన్న సామెతలా మారింది జిల్లాలో యూరియా పరిస్థితి.

యూరియా.. ఏదయ్యా!?
బుచ్చిరెడ్డిపాళెం : వవ్వేరు బ్యాంకు వద్ద యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులు

ఆర్బీకేల్లో స్టాకు ఉందంటారు.. వెళితే లేదంటారు!?

పొంతనలేని అధికారుల ప్రకటనలు

కాళ్లరిగేలా తిరుగుతున్న అన్నదాతలు


నెల్లూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : అందరూ శాఖాహారులే. మరి రొయ్యల బుట్ట ఎలా మాయమైందో.. అన్న సామెతలా మారింది జిల్లాలో యూరియా పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జలవనరులు పుష్కలంగా ఉండటంతో వరి సాగు ఊపందుకుంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఇంత విస్తీర్ణానికి ఇప్పుడు యూరియా వేయాలి. కానీ ఎక్కడుంది!? అధికారులేమో 3.6 లక్షల ఎకరాలకు అవసరమైన యూరియా ఎప్పుడో విక్రయించామని, ఇంకా 38 వేల టన్నులు నిల్వ ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, ఆర్బీకేలు, ప్రైవేటు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు మాత్రం యూరియా దొరకడం లేదు. దీనికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఆర్బీకేల ప్రతినిధులను ప్రశ్నిస్తే ఇండెంట్‌ పెట్టి పక్షం రోజులు దాటుతోంది. ఇంకా రాలేదంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లా అధికారులేమో ‘‘సమస్య ఎక్కడుంది.. ఇప్పటి 35వేల మెట్రిక్‌ టన్నులు విక్రయించాము. ఇంకా 30 వేల మెట్రిక్‌ టన్నులు స్టాక్‌ ఉంది. అదనంగా ఇంకా రాబోతోంది. యూరియా కొరత అన్నది అసత్య ప్రచారం మాత్రమే’’నని సమాధానం ఇస్తున్నారు. మరి నిజంగా యూరియా ఇప్పటికే ఇంత విక్రయించి ఉంటే, 30 వేల మెట్రిక్‌ టన్నుల స్టాకు ఉంటే మరి ఆర్బీకేలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి. 


ఆంధ్రజ్యోతి విజిట్‌లో..

అనంతసాగరం మండలంలో 16 ఆర్బీకేలు ఉండగా సోమవారం నాటికి ఒక్కదానిలో కూడా యురియా నిల్వలు లేవు. ఇక్కడ 250 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. అది కూడా అధికార పార్టీ నాయకుల సిఫారసు ఉన్నవారికే. మిగిలిన రైతులు యూరియా కోసం బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు. 

చిల్లకూరు మండలంలో 19 ఆర్బీకేలు ఉండగా వాటిలో ఒక్కదానిలో కూడా యూరియా లేదు. 

ఏఎ్‌స.పేట మండలంలో 13 ఆర్బీకేలు ఉండగా కేవలం కొండమీద కొండూరు గ్రామంలో మాత్రం కొంత మేర యూరియా నిల్వలు ఉన్నాయి. మిగిలిన ఆర్బీకేలతో పాటు రాబోజు సొసైటీలో కూడా 10 రోజులుగా యూరియా నిల్వలు లేవు. 

వరికుంటపాడు మండలంలో మొత్తం 12 ఆర్బీకేలు ఉండగా వేంపాడులో 20, తిమ్మారెడ్డిపల్లిలో 30 బస్తాలు మాత్రం స్టాకు ఉన్నాయి. 

సైదాపురంలో 19, కొండాపురం మండలంలో 13 ఆర్బీకేలు ఉండగా ఒక్కదానిలో కూడా యూరియా స్టాకు లేదు. 

డెల్టా ప్రాంతమైన కోవూరు మండలంలో 16 ఆర్బీకేలు ఉండగా కేవలం రెండు కేంద్రాల్లో మాత్రం 36 టన్నుల యూరియా స్టాక్‌ ఉంది. ఈ మండలంలో సుమారు 10,500 ఎకరాల్లో వరి పైరు యూరియా కోసం ఎదురుచూస్తోంది. 

సూళ్లూరుపేటలో 10, కోటలో 16, మర్రిపాడులో 10, విడవలూరులో 13 ఆర్బీకేలలో ఒక బస్తా కూడా యూరియా లేదు. 

కేవలం ఇవి ఉదాహరణలు మాత్రమే. జిల్లా అంతటా ఆర్బీకేలు, సొసైటీల్లో పది రోజులుగా ఇదే పరిస్థితి.


అధికారు పార్టీ నేతల సిఫారసుతో..

అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి ఆర్బీకేల ద్వారా 14 వేల మెట్రిక్‌ టన్నులు, సొసైటీల ద్వారా 11 వేల మెట్రిక్‌ టన్నులు రైతులకు విక్రయించినట్లు చెబుతున్నారు. ఇంకా 30వేల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ రికార్డుల్లో దాదాపు చాలా ఆర్బీకేల్లో నిల్వలు ఉన్నట్లు చూపుతున్నాయి. కానీ అక్కడ స్టాకు మాత్రం లేదు. చాలా చోట్ల అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీకేల వద్దకు వచ్చిన యూరియా లారీలను లారీల నుంచే నాయకులు సిఫారసు చేసిన వారికి అడిగినన్ని బస్తాలు పంచేశారు. దీంతో చాలావరకు స్టాకు అధికార పార్టీ విధేయుల వారి ఇళ్లకే చేరిపోయినట్లు సమాచారం.  విక్రయిస్తున్న సమయంలో ఆధార్‌, అడంగల్‌ వివరాలు తీసుకోకుండా, వేలి ముద్ర వేయించుకోకుండా కేవలం కాగితం మీద పేర్లు రాసుకొని ఇచ్చేశారు. వేలి ముద్ర తీసుకుంటే కానీ ఆన్‌లైన్‌లో పంపిణీ చేసినట్లు కనిపించదు. దీంతో ఆన్‌లైన్‌లో మాత్రం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది పెద్ద గందరగోళం కావడంతో ఇప్పుడు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వేలిముద్రలు తీసుకొంటున్నారు. 


ప్రైవేటు దుకాణదారుల్లోనూ నో స్టాక్‌

జిల్లాకు వచ్చే కేటాయింపుల్లో 60 శాతం స్టాక్‌ ప్రైవేటు దుకాణాలకు కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో ఆర్బీకేలకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని వ్యాపారుల నుంచి సమాధానాలు వినిపిస్తున్నాయి.  మరోవైపు కంపెనీలు కూడా కొత్త షరతులు విధిస్తున్నాయి. యూరియా స్టాకు లేని కారణంగా కాంప్లెక్స్‌ ఎరువులు అమ్ముడుపోవడం లేదు. దీనికితోడు యూరియా కావాలంటే ఒక టన్నుకు రెండు టన్నుల కాంప్లెక్స్‌ కొనాలని షరతులు పెడుతున్నాయి. ఒక బస్తా యూరియా (రూ.366) కావాలంటే 3400 రూపాయల పెట్టుబడులు పెట్టి కాంప్లెక్స్‌ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేయాలంటనే భయపడి వెనకడుగు వేస్తున్నారు. 


రోజు రోజుకు సంక్షోభం

జిల్లాలో ఈ సీజన్‌లో సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. అధికారుల లెక్కల ప్రకారం ఎకరానికి రెండు బస్తాలతో లెక్కించినా జిల్లాకు సుమారు 96వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికి సాగులోకి వచ్చింది 3.60 లక్షల ఎకరాలు మాత్రమే. ఇంకా సుమారు 4-5లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనడంలో అనుమానం లేదు. నాట్లు పడిన మూడు లక్షల ఎకరాలకే యూరియా కోసం అల్లాడిపోతుంటే మొత్తం నాట్లు పడితే పరిస్థితి ఏమిటి. అదునుమించి పోయిన తరువాత యూరియా స్టాకు వచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు అధికారులు మేల్కొని యూరియా సరఫరా చేయకపోతే నాట్ల దశలోనే రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 


అవసరానికి అందని ఎరువులు 

కావలి మండలం కొత్తపల్లిలో సుమారు 1000 ఎకరాలల్లో వరి సాగుచేస్తున్నాం. రైతు భరోసా కేంద్రంలో మూడు నెలల క్రితం రైతులకు యూరియా అందజేశారు. అప్పట్లో ఆ యూరియా బోర్ల కింద నాటిన వరికి, పశుగ్రాసానికి వాడుకున్నాం. ప్రస్తుతం నారుమళ్లతో పాటు నాట్లు జరుగుతున్నాయి. యూరియా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళితే లేవంటున్నారు. బయటి ఎరువుల దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 

- చిమ్మిలి మోహన్‌ రావు, కొత్తపల్లి, కావలి మండలం




Updated Date - 2022-01-04T05:19:45+05:30 IST