ద్రావిడ చర్చకు పురిగొలిపిన యువన్ శంకర్ రాజా పోస్ట్‌

ABN , First Publish Date - 2022-04-19T21:42:58+05:30 IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని

ద్రావిడ చర్చకు పురిగొలిపిన యువన్ శంకర్ రాజా పోస్ట్‌

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోల్చడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కుమారుడు యువన్ శంకర రాజా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్రావిడ సిద్ధాంతంపై చర్చకు పురిగొలిపింది. ‘‘నల్ల ద్రావిడుడు, గర్వకారణమైన తమిళుడు’’ అంటూ తన ఫొటోను యువన్ శంకర రాజా పోస్ట్ చేశారు. 


మోదీని అంబేద్కర్‌తో పోల్చిన ఇళయరాజాపై విమర్శలు వస్తుండటంతో, ఇళయరాజాకు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఈ వివాదానికి కారణం తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేయేనని ఆరోపించారు. 


యువన్ నల్ల రంగు టీ-షర్ట్, లుంగీ ధరించి కనిపిస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘‘డార్క్ ద్రవిడియన్, ప్రౌడ్ తమిళియన్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అణ్ణామలై స్పందిస్తూ, యువన్ నల్లనివాడైతే, ఓ అడవి కాకి మాదిరిగా ఉన్న తాను అంతకన్నా ఎక్కువ నల్లనివాడినని, తాను కూడా స్వచ్ఛమైన ద్రావిడుడినేనని పేర్కొన్నారు. 


నామ్ తమిళార్ కట్చి నేత సీమన్ స్పందిస్తూ, ‘‘కేవలం ఓ వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రానికి, ఆ వ్యక్తి ద్రావిడుడని కాదు. తాను నల్లగా ఉన్నాను కాబట్టి తాను ద్రావిడుడినని ఆయన చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్నవారంతా నల్లగానే ఉంటారు. అది వాళ్ళని ద్రావిడులను చేస్తుందా? గేదె కూడా నల్లగానే ఉంటుంది. దాని అర్థం అది కూడా ద్రావిడ గేదె అనేనా?’’ అని ప్రశ్నించారు. 


‘‘అంబేద్కర్ అండ్ మోదీ’’ అనే పుస్తకానికి ఇళయరాజా రాసిన ముందుమాటలో మోదీ ప్రభుత్వ తీరును చూసి అంబేద్కర్ కచ్చితంగా గర్విస్తారని పేర్కొన్నారు. అంబేద్కర్, మోదీ మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలిపారు. వీరిద్దరూ పేదరికాన్ని, అణచివేతను అనుభవించారన్నారు. యువతరానికి ఈ పుస్తకాన్ని సిఫారసు చేస్తున్నానని తెలిపారు. 


Updated Date - 2022-04-19T21:42:58+05:30 IST