కళ్లు తెరిచారు!

ABN , First Publish Date - 2021-07-21T06:44:37+05:30 IST

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. ప్రతిరోజు అయిదు వందలకు మించి పాజిటివ్‌లు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు.

కళ్లు తెరిచారు!

జిల్లాలో ఎంతకూ అదుపులోకి రాని పాజిటివ్‌లు

ఇరవై రోజుల్లో ఏకంగా 10,944 కేసులు.. ప.గో.లో 6,117

తగ్గని పాజిటివిటీ రేటు నేపథ్యంలో ఎట్టకేలకు కళ్లుతెరిచిన అధికారులు

 కేసులు అధికంగా ఉన్న 175 గ్రామాల్లో మళ్లీ కంటైన్మెంట్‌ జోన్‌లు 

పోలీసు పికెట్లు, ఫీవర్‌సర్వే, ప్రైమరీ కాంటాక్టుల గుర్తింపు ప్రారంభం

అటు పొంచి ఉన్న థర్డ్‌వేవ్‌ ముప్పు నేపథ్యంలో జీజీహెచ్‌లో అప్రమత్తత

200 పిల్లల బెడ్లు, 1,000 పెద్దల పడకలు సిద్ధం చేస్తున్న అధికారులు

ప్రత్యేకంగా 64 మంది పిడియాట్రిక్‌ వైద్యుల భర్తీకి కసరత్తు ముమ్మరం

జిల్లాలో ఎంతకూ కొవిడ్‌ మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఏరోజుకారోజు కేసుల సంఖ్య తగ్గడం లేదు సరికదా అంతకంతకూ   మళ్లీ పెరుగుతూ సవాల్‌ విసురుతున్నాయి. ఇతర జిల్లాల్లో వైరస్‌ తీవ్రత గణనీయంగా తగ్గిపోతే ఇక్కడ మాత్రం బుసలు కొడుతూనే ఉంది. ఈ  నేపథ్యంలో ఇంతకాలం తర్వాత ఎట్టకేలకు జిల్లా అధికారులు కళ్లు తెరిచారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న 175 గ్రామాలపై దృష్టిసారించి  కొత్తగా కంటైన్మెంట్‌ జోన్లు విధిస్తున్నారు. కొవిడ్‌ తొలివేవ్‌ తరహాలో    పోలీస్‌ పికెట్లు, ఫీవర్‌ సర్వే, ప్రైమరీ కాంటాక్ట్స్‌ గుర్తింపు, బయటకు రాకపోకలు నిషేధించడం వంటి చర్యలు ప్రారంభించారు. ఇక థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లో పిల్లలకు 200, పెద్దలకు వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నారు. 64 మంది పిడియాట్రిక్‌  వైద్యులనూ నియమించబోతున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. ప్రతిరోజు అయిదు వందలకు మించి పాజిటివ్‌లు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో కేసులు రెండంకెల సంఖ్యకు దిగిపోతే, ఇక్కడ మాత్రం వందల్లోనే వస్తుండడంతో కారణాలు అంతుపట్టడం లేదు. అధిక జనాభా కలిగిన జిల్లా కావడంతో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకాలం సమర్థించుకుం టూ వస్తున్న అధికారులు పాజిటివిటీ రేటు ఏమాత్రం తగ్గకపోవడంతో ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఇతర జిల్లాల్లో కేసు లు తగ్గగా, ఇక్కడ మాత్రం అదుపులోకి రాకపోవడానికి కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్‌ల్లో జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గడచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 కేసులు నమోదవగా, పక్కనున్న విశాఖలో 2,629, పశ్చిమగోదావరిలో 6,117 చొప్పున పాజిటివ్‌ లు నిర్ధారణయ్యాయి. ఈ నేపథ్యంలో వేలల్లో వస్తున్న పాజిటివ్‌లను అదుపుచేయడంలో అధికారులు విఫలమయ్యారన్న వాదనలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో కళ్లుతెరిచిన అధి కారులు కంటైన్మెంట్‌ జోన్లను విధించడం ప్రారంభించారు. వాస్తవానికి సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వేలల్లో కేసులు వచ్చిన ప్రాంతాలను పూర్తిగా వదిలేశారు. ఎక్కడికక్కడ కంటైన్మెంట్‌ జోన్ల కింద ప్రకటించకుండా గాలికి వదిలేశారు. దీంతో విచ్చలవిడి రాకపోకలతో వైరస్‌ నలుమూలలా విస్తరించింది. తద్వారా వేలాది కేసులతో జిల్లాలో విలయం చోటుచేసుకుంది. వాస్తవానికి తొలివిడత కొవిడ్‌లో పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టేవారు. పోలీస్‌ పికెట్లు ఏర్పాటుచేసి ఆ ప్రాంత వాసులు విచ్చలవిడిగి బయటకు వెళ్లి రావడానికి అనుమతించేవారు కాదు. జ్వరాలపై సర్వే చేయడం, టెస్ట్‌లు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పక్కాగా జరిగాయి. కానీ సెకండ్‌వేవ్‌లో ఇదంతా వదిలేశారు. తీరా ఇప్పుడు ఎంతకూ వైరస్‌ అదుపులోకి రాకపోవడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు కళ్లు తెరిచారు. అందులోభాగంగానే కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం గడచిన కొన్ని వారాలుగా అధికంగా కేసులు నమోదవుతున్న 175 గ్రామాలు, పట్టణాలను గుర్తించారు. ఇందులో అత్యధికంగా కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవ రం, రామచంద్రపురం డివిజన్లల ఉన్నాయి. ఈ గ్రామాలు, పట్టణాలు ఇవే ఏఏ సచివాలయాలు, పీహెచ్‌సీల పరిధిలో ఉన్నాయో వివరాలు ఆరా తీశారు. వీటిలో ఇప్పుడు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారు. పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం ఫీవర్‌ సర్వేలు, టెస్ట్‌లు పెంచడం, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడుతున్నారు. జిల్లాలో పాజిటివిటీ రేటు నియంత్రణలోకి వచ్చేవరకు పర్యవేక్షణ పకడ్బందీగా చేయనున్నారు. మరోపక్క థర్డ్‌ వేవ్‌ ముప్పు నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో వేగం పెంచారు. పిల్లలకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందనే అంచనాల ఆధారంగా కాకినాడ జీజీహెచ్‌లో 200 పడకలు సిద్ధంచేస్తున్నారు. పిల్లలకు ప్రత్యేక మాస్కులు, శస్త్రచికిత్సకు ఉపయోగించే పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తున్నా రు. వీరికి వైద్యం చేసే పిల్లల వైద్యనిపుణుల కొరత తీవ్రంగా ఉండడంతో 64 మంది పిడియాట్రిక్‌ వైద్యులను భర్తీ చేయ డం కోసం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అటు మున్ముందు థర్డ్‌ వేవ్‌ కొవిడ్‌  బారిన పడే పెద్దల కోసం మరో వెయ్యి పడకలు కూడా సిద్ధం చేస్తున్నారు.

అక్కడ.. మళ్లీ కర్ఫ్యూ

చింతూరు/పి గన్నవరం, జూలై 20: జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చింతూ రు, పి గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి మర్నా డు ఉదయం ఆరు గంటల వర కూ కర్ఫ్యూ విధించారు. చింతూ రులో బుధవారం నుంచి తిరిగి కర్ఫ్యూ విధిస్తున్నట్టు చింతూరు ఆర్డీవో ఏ వెంకటరమణ ప్రకటిం చారు. ఉదయం ఆరు నుంచి మఽధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరుచుకోవాలని, అలాగే వారాంతపు సంతలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్టు ఆర్డీవో పేర్కొన్నారు. యువకులు అనవసరంగా రోడ్లపై తిరగవద్దని లాక్‌ డౌన్‌ సమయంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఇక కర్ఫ్యూ ఈనెల 27వ తేదీ వరకు అమలులో ఉంటుందని, అనంతరం కేసుల సంఖ్యను  బట్టి నిర్ణయం తీసుకుంటామని పి. గన్నవరం తహశీల్దార్‌ కార్యాల యంలో తహశీల్దార్‌ మృత్యుంజ యరావు పేర్కొన్నారు.


Updated Date - 2021-07-21T06:44:37+05:30 IST