Rahul Gandhi Row: సుప్రీంకోర్టుకు వెళ్లిన Rohit Ranjan

ABN , First Publish Date - 2022-07-06T21:29:18+05:30 IST

రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలైన జీ న్యూస్ యాంకర్ రోహిత్...

Rahul Gandhi Row: సుప్రీంకోర్టుకు వెళ్లిన Rohit Ranjan

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలైన జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ (Rohit Ranjan సుప్రీంకోర్టు (Supreme court)ను ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీపై తప్పుడు వార్త ప్రసారమైనందుకు తనపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాన్ని గురువారం విచారణకు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించినప్పటికీ, పిటిషన్ పేపర్లు అధికారికంగా కోర్టు ముందు సమర్పించలేదని గుర్తించింది. ఈ విషయమై యాంకర్ తరఫు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథరా క్షమాపణ చెప్పారు.


''రంజన్‌ను నొయిడా పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. ఆయన యాంకర్‌గా చేసిన ఒక షోలో పొరపాటు జరిగింది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆయనను అరెస్టు చేయాలనుకుంటున్నారు. దయచేసి ఈ అంశాన్ని అర్జెంటుగా లిస్ట్ చేయండి. లేనట్లయితే తిరిగి ఆయనను కస్టడీలోకి వెళ్లొచ్చు'' అని న్యాయవాది సిద్ధార్ధ్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.


అసలేం జరిగిందంటే...

జీ టీవీ  షోలో రోహిత్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ, రాహుల్‌కు చెందిన ఓ వీడియో న్యూస్‌ను తప్పుగా రిపోర్ట్ చేశారు. అయితే ఛానెల్ వెంటనే ఆ పొరపాటు గ్రహించి క్షమాణపలు చెప్పింది. రాహుల్ గాంధీ ఒక వీడియాలో వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ....''ఆ పని చేసిన యువకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అయినా కూడా వారు చిన్న పిల్లలు..క్షమించేయండి'' అని అన్నారు. అయితే, జీ ఛానెల్ ఈ వ్యాఖ్యలు ఉదయ్‌పూర్‌లో కన్హయ్యలాల్‌ను చంపినవారు చిన్నపిల్లలని, క్షమించి వదిలేయాలంటూ రాహుల్ చెబుతున్నట్టుగా వక్రీకరించి సమాచారాన్ని అందించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్ పోలీసులు రోహిత్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసం నుంచి ఎలా అరెస్టు చేస్తారంటూ ఓ ట్వీట్‌లో రోహిత్ ప్రశ్నించారు. దీనికి వెంటనే రాయపూర్ పోలీసులు స్పందిస్తూ, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పుడు తెలిసింది కాబట్టి సహకరించాలని రంజన్‌కు చెప్పారు.  ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల కంటే ముందే ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి రంజన్‌ను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.

Updated Date - 2022-07-06T21:29:18+05:30 IST