జెన్‌ గగనంలోచందమామ

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

ఒటగాకి రెంగెట్సు ఒక కళాకారిణిగా జపనీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. జెన్‌ చరిత్రలో శాశ్వత స్థానం పొందింది.

జెన్‌ గగనంలోచందమామ

టగాకి రెంగెట్సు ఒక కళాకారిణిగా జపనీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. జెన్‌ చరిత్రలో శాశ్వత స్థానం పొందింది.  ఆమె జపాన్‌లోని క్యోటో నగరంలో 1791లో జన్మించింది. చిన్న వయసులోనే ఆమె దత్తతకు వెళ్ళింది. ఒటగాకిని పెంచిన తల్లితండ్రులు ఆమెకు యుక్తవయసు రాగానే వివాహం జరిపించారు. ఇద్దరు పిల్లలు పుట్టాక... భర్త మరణించాడు. కొద్ది రోజుల తరువాత ఆమె మరో వివాహం చేసుకుంది. ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టాక... రెండవ భర్త కూడా కన్నుమూశాడు. కొన్ని సంవత్సరాలు గడవకముందే... ఆమె పిల్లలందరూ ఒకరి తరువాత మరొకరుగా ఈ లోకాన్ని విడిచి పెళ్ళిపోయారు.


తనకు ముప్ఫై ఏళ్ళయినా రాకముందే కుటుంబ సభ్యులందరూ మరణించడంతో... సున్నిత మనస్కురాలైన ఒటగాకి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ‘నా’ అన్న వారెవరూ లేరని బాధపడుతున్న ఆమెకు తన పెంపుడు తండ్రి గుర్తుకువచ్చాడు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న అతని దగ్గరకు వెళ్ళింది. సన్యాసం స్వీకరించింది. అక్కడే ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని నివసించసాగింది. 


ఇలా తొమ్మిదేళ్ళు గడిచాయి. పెంపుడు తండ్రి కూడా మరణించాడు. అతని వారసులు ఆమెను ఆ స్థలం నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఒటగాకికి తినడానికి తిండి లేదు. ఉండడానికి చోటు లేదు. ఆమె అటూ, ఇటూ తిరిగి చివరకు చాయిన్‌ ఇన్‌ లేదా చియానిన్‌ అనే ఆలయంలోకి చేరి తలదాచుకుంది. అక్కడ ఆమె రెంగెట్సు అనే బౌద్ధ సన్యాస నామం తీసుకుంది. ‘రెంగెట్సు’ అంటే ‘లోటస్‌ మూన్‌’ అని అర్థం. ఆ ఆలయంలోనే ఆమె పదేళ్ళ పాటు ఉంది. మహిళ కావడంతో ఏ మఠంలోనూ, ఏ ఆశ్రమంలోనూ ఎక్కువకాలం ఉండే అవకాశం లేకపోయింది. ఆమె దేశ సంచారం చేస్తూ... ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళుతూ ఉండేది.


కసారి ఒక గ్రామానికి సూర్యాస్తమయ సమయంలో చేరుకుంది. ఆ రాత్రి తలదాచుకోవడానికి ప్రతి ఇంటి తలుపూ తట్టింది. రాత్రి నిద్రపోడానికి కాస్త చోటు ఇవ్వమని వేడుకుంది. కానీ ఆమె మహిళ కావడం వల్ల, సన్యాసిని కావడం వల్ల ఎవరూ అంగీకరించలేదు. ఆమెను చీదరించుకొని, తరిమేసి తలుపు వేసుకున్నారు. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు. కప్పుకొని, ముడుచుకొని పడుకుందామంటే దుప్పటీ లేదు. ఊరి బయట ఒక ఛెర్రీ వృక్షం కింద... నేల మీద నడుము వాల్చింది. ఆమె బాగా అలసిపోయింది, కానీ నిద్ర రాలేదు. చలిగా, ఆకలిగా ఉన్నప్పుడు, క్రూర మృగాల భయం ఉన్నప్పుడు... ఇక నిద్ర ఎలా వస్తుంది? చివరికి... అలసట వల్ల కాస్త కునుకు పట్టింది. అంతలోనే మెలకువ వచ్చింది. 


అర్ధరాత్రయింది. చుట్టూ చీకటి. ఆకాశంలో మబ్బులు కప్పిన చంద్రుడు... ఆ వాతావరణం ఆమెకు ఏదో తెలియని ఆనందాన్ని ఇచ్చింది. వెంటనే లేచి నిలబడి, ఆ గ్రామం వైపు చూస్తూ, ముకుళిత హస్తాలతో తన గౌరవాన్ని వెలిబుచ్చుతూ ‘‘వారు నన్ను వారి ఇళ్ళలోకి అనుమతించకపోవడం వల్ల కదా... ఈ అందమైన చందమామను, పూలమొక్కలను చూస్తూ, ప్రశాంత వాతావరణంలో ఉండే సదవకాశం కలిగింది’’ అంది. ఆమె కవయిత్రి, మంచి నర్తకి కూడా. ఆ ఆహ్లాద వాతావరణంలో ఆమెకు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఆమె హృదయం నాట్యం చేసింది. 


ఒటగాకి సన్యాసం స్వీకరించినా... భిక్షాటనతో జీవితం సాగించలేదు. మట్టి పాత్రలు చేసేది. వాటి మీద తను రచించిన పద్యాలను చెక్కేది. ఆమె స్వయంగా తయారు చేసిన టీని ఆ కప్పుల్లో తాగి, ఆ కప్పుల మీద ఉన్న కవిత్వం చదవడానికి ప్రజలు ఇష్టపడేవారు. ఆమె జియెజిట్సు లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా ఆరితేరింది. 1865లో... జింకోఇన్‌ అనే ఆలయంలో ఆమె స్థిరపడింది. మూడు దశాబ్దాలపాటు అక్కడే గడిపి తుదిశ్వాస విడిచింది. తన జీవితకాలంలో ఆమె యాభైవేలకు పైగా కళాఖండాలను సృజించింది. జెన్‌ గగనంలో ప్రకాశించిన చందమామ ఒటగాకి రెంగెట్సు.  

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST