జీవితమంటే అంతే!

Jun 11 2021 @ 00:08AM

భరించరాని కష్టాలూ, నష్టాలూ ఎదురైనప్పుడు ధనికులైనా, దరిద్రులైనా, అధికారులైనా, పాలకులైనా, పండితులైనా, పామరులైనా భగవంతుడి వైపు చూస్తారు. గుడులకూ, గోపురాలకూ తిరుగుతారు. ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు. తమ గోడు వెళ్ళబోసుకుంటారు. వారి దుఃఖాన్ని తగ్గించడానికి గురువులు ఏవో రెండు మంచి మాటలు చెబుతారు. పూర్వం అంతకన్నా కష్టపడినవారి ఉదాహరణలు చెప్పి ఓదారుస్తారు.


జపాన్‌లో ఇస్సా అనే ఒక ప్రముఖ కవి ఉండేవాడు. అతను హైకూ కవిత్వాన్ని ధారాళంగా ప్రవహింపజేసిన వాడు. అతని పూర్తి పేరు కొబయాషి ఇస్సా. జపాన్‌లో నలుగురు ప్రముఖ హైకూ కవుల్లో (ది గ్రేట్‌ ఫోర్‌) ఇస్సా ఒకరు. ఇస్సా అతని కలం పేరు. ‘టీ కప్పు’ అని దాని అర్థం. చిన్న వయసులోనే ఇస్సా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఇస్సాకు మూడేళ్ళ వయసులో తల్లి మరణించింది. పెంచి పోషించిన అవ్వ అతనికి పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి కన్ను మూసింది. తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇస్సాను అతని సవతి తల్లి ఎంతో హీనంగా చూసేది. అతనికి ముప్ఫై ఏళ్ళ వయసు రాకముందే... అయిదుగురు పిల్లలు ఒకరి తరువాత మరొకరు మరణించారు. ఆ తరువాత, అతను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఇలా జీవితమంతా విషాదాన్ని అనుభవించిన ఇస్సాకు... ఆ కష్టాలే కవిత్వాన్నీ, జీవిత తత్త్వాన్నీ తెలియజేశాయి.

రోగాలు, మరణాలు, కష్టాలు ఒకదాని తరువాత మరొకటి చుట్టు ముట్టేసరికి ఊపిరాడని ఇస్సా... ఆనాటి జెన్‌ గురువు ఒకరిని ఆశ్రయించాడు.‘‘ఎందుకు ఈ లోకంలో ఇంత బాధ ఉంది?’’ అని ప్రశ్నించాడు.

ఆ గురువు అతని వివరాలన్నీ అడిగాడు. ఇస్సా తన జీవితంలోని విషాదాన్నంతటినీ ఏకరవు పెట్టాడు. 

‘‘నేను ఒక కవిని. ఎప్పుడూ ఏకాంతంగా, మౌనంగా ఉంటూ, నాకు తట్టిన ఆలోచనలను కవిత్వంగా మలిచాను. నా బాల్యంలోనే తల్లి, అవ్వ మరణించారు. ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి నా కళ్ళ ముందే అయిదుగురు పిల్లలు రాలిపోయారు. నా భార్య నాకు దూరమయింది. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. నాకు తెలిసి ఎవరికీ, ఎప్పుడూ ఎలాంటి హానీ చేయలేదు. నాకెందుకు ఇంత దుఃఖం కలిగింది? ఈ చావు బతుకులేమిటి’’ అని తన వేదన వెళ్ళబోసుకున్నాడు.

ఆ జెన్‌ గురువు చాలా ప్రశాంతంగా ‘‘అంతే! అది అంతే! ఈ జీవితం ఉదయాన్నే పడే ఒక మంచు బిందువు లాంటిది. మరణాన్ని వెంట తీసుకురావడమే జీవిత లక్షణం. మరణానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాల్సిన పని లేదు. పొద్దున్నే ఒక ఆకు మీద కురిసిన మంచు బిందువు ఏ చిన్న గాలి వీచినా పడిపోతుంది. సూర్యోదయమై, ఎండ పడిన వెంటనే ఆవిరైపోతుంది. ఎవరి జీవితమైనా ఇంతేనని మరచిపోకూడదు. ఈ నిత్యసత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి’’ అని చెప్పాడు.

ఆ మాటలు ఇస్సాకు ఎంతో ఊరట కలిగించాయి. ఇవన్నీ అతనికి తెలియని విషయాలు కావు. కానీ గురువు నోటి నుంచి ఒక అద్భుతమైన నూతన శక్తితో అవి వెలువడ్డాయి. అందుకే ఆ మాటలు ఇస్సాకు ఔషధంలా పని చేశాయి. దుఃఖాన్నీ, విషాదాన్నీ విడిచిపెట్టి కవిత్వ రచనలో మరింతగా నిమగ్నమయ్యాడు. హైకూ రచనలో సమున్నతంగా నిలిచాడు.

- రాచమడుగు శ్రీనివాసులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.