జెన్‌కో ప్రైవేటీకరణ వద్దు

ABN , First Publish Date - 2022-05-26T05:57:19+05:30 IST

జిల్లాలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరించొద్దని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు.

జెన్‌కో ప్రైవేటీకరణ వద్దు
సదస్సులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

నష్ట నివారణ చర్యలు చేపట్టక పోవటం దుర్మార్గం

సీపీఎం నేత గఫూర్‌, ఎమ్మెల్సీ విఠపు, టీడీపీ నేత అజీజ్‌


నెల్లూరు(వైద్యం), మే 25 : జిల్లాలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరించొద్దని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం నెల్లూరులోని టౌన్‌హాల్‌లో పరిరక్షణ కమిటీ బహిరంగ సదస్సు నిర్వహించింది.  కమిటీ కన్వీనర్‌ మోహన్‌రావు అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ జెన్‌కో నష్టాల్లో ఉందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ నష్టాల నివారణకు చర్యలు తీసుకోకుండా ప్రైవేట్‌పరం చేస్తామనటం సిగ్గుచేటన్నారు. బొగ్గు సరఫరా చేయకుండా, నిధులివ్వకుండా ప్రభుత్వమే ఆ సంస్థను నష్టాల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. దీనిపై ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నామ న్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జెన్‌కోను ప్రైవేట్‌పరం చేస్తే విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత ఉండదని చెప్పారు. టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పరిరక్షణకు టీడీపీ ముందుంటుందన్నారు. రూ.19 వేల కోట్ల ప్రజాధనంతో 1500 ఎకరాల్లో నిర్మించిన పవర్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించ నుండటం దుర్మార్గమన్నారు. జగన్‌రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని అదానీకి అమ్మేసే పన్నాగం పన్నారని విమర్శించారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మూలం రమేష్‌, దామా అంకయ్య మాట్లాడుతూ జెన్‌కో ప్రైవేటీకరణను తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ నేత సునీత, సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎలక్షి్ట్రసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ బాలకాశి, యూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శివయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్‌, సీపీఐ నేత రామరాజు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీఎల్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:57:19+05:30 IST