శీతల గిడ్డంగుల్లో జీరో బిజినెస్‌

ABN , First Publish Date - 2021-04-18T05:42:56+05:30 IST

కోల్డ్‌స్టోరేజ్‌లలో మిర్చి జీరో బిజినెస్‌ విచ్ఛలవిడిగా జరుగుతోన్నది.

శీతల గిడ్డంగుల్లో జీరో బిజినెస్‌

  ప్రత్తిపాడు ఏఎంసీలో ఈనామ్‌ లేకపోవడంతో అటు కన్నేసిన వ్యాపారస్థులు

స్థానికంగా కారం మిల్లులకు తరలింపు 


గుంటూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కోల్డ్‌స్టోరేజ్‌లలో మిర్చి జీరో బిజినెస్‌ విచ్ఛలవిడిగా జరుగుతోన్నది. గత ఏడాది నిల్వ చేసిన మిరపకాయల టిక్కీలను రైతుల వద్ద వ్యాపారస్థులు కొనుగోలు చేసి వారి పేరు లేకుండా రైతుల సరుకుగానే గిడ్డంగుల నుంచి బయటకు తీసి కారంమిల్లులకు తరలిస్తోన్నారు. అలానే స్థానికంగా రిటైల్‌ మార్కెట్‌లలోనూ విక్రయిస్తోన్నారు. ఈనామ్‌ విధానం జిల్లాలో గుంటూరు, దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మాత్రమే అమలు జరుగుతోన్నది. కొత్తగా ఏర్పడిన ప్రత్తిపాడు ఏఎంసీలో ఈ విధానం లేదు. ఇదే అదనుగా ఆ మార్కెట్‌ కమిటీ పరిధిలోని గిడ్డంగుల నుంచి గత కొద్ది  రోజులుగా జీరో బిజినెస్‌ పెద్దఎత్తున జరుగుతోన్నట్లు మార్కెటింగ్‌ వర్గాలకు ఫిర్యాదులు వస్తోన్నాయి. 

గత ఏడాది కరోన లాక్‌డౌన్‌ కారణంగా మిర్చి లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో చాలామంది రైతులు తమ సరుకుని కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లకు కొత్త కాయలు వస్తోన్నాయి. వాటిల్లో తేమ శాతం అధికంగా ఉంటోన్నందున గత సంవత్సరం కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసిన వాటికి డిమాండ్‌ పెరిగింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసే మిర్చి టిక్కీలకు అయితే బిల్లులు, మార్కెట్‌ ఫీజు చెల్లించినట్లుగా రశీదులు అవసరం అవుతాయి. అదే స్థానికంగా రవాణ జరిగే సరుకుకు బిల్లులతో పని ఉండదు. వ్యాపారస్థులు కోల్డ్‌స్టోరేజ్‌లకు వెళ్లి సరుకు నాణ్యతని పరిశీలించి రైతుల వద్ద కొనుగోలు చేస్తోన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. ఎక్కడికైతే సరుకుని తరలించాలో అక్కడికి రైతు ద్వారానే చేరుస్తున్నారు. ఈ విధంగా పెద్దఎత్తున జీరో బిజినెస్‌కి వ్యాపారస్థులు తెరలేపారు. 

మార్కెటింగ్‌ శాఖ నిబంధనల ప్రకారం ఏఎంసీలలో జరిగే మిర్చి విక్రయాలపై ఒక శాతం మార్కెట్‌ ఫీజుని వ్యాపారస్థులు ఆయా కమిటీలకు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి అక్కడ ఫీజు కట్టించుకొంటారు. అలానే కోల్డ్‌స్టోరేజ్‌లలోనూ జరిగే లావాదేవీలపై ఒక శాతం మార్కెట్‌ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వ్యాపారస్థులు ఇక్కడ తెలివిగా రైతులను అడ్డం పెట్టుకొని జీరో బిజినెస్‌ చేస్తోన్నారు. శీతల గిడ్డంగిలో నిల్వ చేసిన మిర్చిని బయటకు తీసి ఇంటికి తీసుకెళుతోన్నట్లుగా సృష్టించి దానిని కారంమిల్లులు, రిటైల్‌మార్కెట్‌లకు చేరవేస్తోన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా రవాణ జరిగే మిర్చి టిక్కీలపై మార్కెటింగ్‌ వర్గాలు నిఘా పెంచకపోతే ఒక శాతం సెస్సు రూపంలో ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇదిలావుంటే పల్నాడు, క్రోసూరు వైపున కూడా ఇటీవలకాలంలో ఇక్కడి నుంచి వెళ్లి వ్యాపారస్థులు కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మిస్తోన్నారు. వాటిల్లోనూ ఇదే తంతు కొనసాగుతోన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి.   

Updated Date - 2021-04-18T05:42:56+05:30 IST