చాపకింద నీరులా వ్యాపిస్తున్న Zika వైరస్

ABN , First Publish Date - 2022-07-06T16:52:47+05:30 IST

ప్రమాదకర జీకా(ZIKA) వైరస్ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

చాపకింద నీరులా వ్యాపిస్తున్న Zika వైరస్

న్యూఢిల్లీ : ప్రమాదకర జీకా(ZIKA) వైరస్ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. స్థానికంగా వ్యాప్తికి అవకాశాలున్నాయని పుణెలోని ICMR (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఎన్ఐవీ(National Institute of Virology) హెచ్చరించింది. జీకా వైరస్‌పై చేపట్టిన అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ‘ ఫ్రాంటియర్ ఇన్ మైక్రోబయాలజీ’లో ఇటివలే ప్రచురించింది. జీకా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించిందని, తక్షణమే పర్యవేక్షణ పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక హెచ్చరించింది. అధ్యయనంలో భాగంగా మొత్తం 1475 నమూనాలను పరీక్షించగా అందులో 64 నమూనాలు పాజిటివ్‌గా తేలాయని వెల్లడించింది. గతంలో బారిన పడిన వ్యక్తుల నుంచి క్రమంగా ఇతరులకు  వ్యాప్తి చెందుతోందని, ఇలా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ ఈ వైరస్ విస్తరించిందని ఐసీఎంఆర్ పేర్కొంది. 


వర్షకాలం కావడంతోపాటు జీకా వైరస్‌తోపాటు దోమకాటు వలన వ్యాపించే డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. 2017-2021 మధ్య కాలంలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్-ఎన్ఐవీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ చెప్పారు. ఒకవైపు కరోనా భయాలు నెలకొన్న వేళ జీకా వ్యాప్తి ఆందోళనకరమన్నారు.


ఈ ప్రాంతాల్లో జీకా వైరస్ గుర్తింపు..

ఢిల్లీ, రాంచీ (జార్ఖండ్), జోధ్‌పూర్(రాజస్థాన్), అమృత్‌సర్(పంజాబ్), హైదరాబాద్(తెలంగాణ), తిరువనంతపురం(కేరళ), పుణె (మహారాష్ట్ర), అలీగఢ్, కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)లలో జీకా వైరస్ నిర్ధారణ అయ్యిందని ఐసీఎంఆర్ రిపోర్ట్ పేర్కొంది. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన నమూనాలో కూడా జీకా వైరస్ నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది.  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్,  ఎపిడెమాలజిస్ట్ డా బీఆర్ శమన్న స్పందిస్తూ.. శాస్త్రవేత్తలు జీకావైరస్‌ను గుర్తించడంపై  దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. గతంలో జీకా వైరస్ అంటే ఏంటో  పెద్దగా తెలియదు. ఇప్పుడు అవగాహన పెరుగుతోందని చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. కాగా జీకా వైరస్ అనేది దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధి. జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు. గతేడాది కేరళలో 66 కేసులు నమోదయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-06T16:52:47+05:30 IST