ఓపెనర్లే బాదేశారు

ABN , First Publish Date - 2022-08-19T10:04:09+05:30 IST

ఇటీవల బంగ్లాదేశ్‌పై భారీ లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించి వన్డే సిరీస్‌ సాధించిన జింబాబ్వే.. భారత్‌ ముందు మాత్రం పసికూనే అయ్యింది.

ఓపెనర్లే బాదేశారు

ధవన్‌, గిల్‌ అజేయ అర్ధసెంచరీలు 

దీపక్‌, అక్షర్‌ రాణింపు

10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

జింబాబ్వేతో తొలి వన్డే

 జింబాబ్వేపై భారత్‌కిది వరుసగా 13వ విజయం. బంగ్లాతో 12 విజయాల రికార్డును అధిగమించింది.

భారత్‌పై తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (70) నమోదు చేసిన జింబాబ్వే.

వన్డేల్లో పది వికెట్ల తేడాతో గెలిచిన సందర్భాల్లో భారత్‌ తరఫున తొలి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం (192). గతంలో జింబాబ్వేపైనే 197 (1998) పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.

హరారే: ఇటీవల బంగ్లాదేశ్‌పై భారీ లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించి వన్డే సిరీస్‌ సాధించిన జింబాబ్వే.. భారత్‌ ముందు మాత్రం పసికూనే అయ్యింది. ఆరు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్‌ దీపక్‌ చాహర్‌ (3/27) సూపర్‌ స్వింగ్‌తో సత్తా చాటగా.. ఇక 190 పరుగుల ఛేదనలో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (72 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 82 నాటౌట్‌), శిఖర్‌ ధవన్‌ (113 బంతుల్లో 9 ఫోర్లతో 81 నాటౌట్‌) నిలకడైన బ్యాటింగ్‌తో ఆతిథ్య బౌలర్లను ఆడేసుకున్నారు. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘనవిజయంతో పాటు, మూడు వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది.


అంతకుముందు జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ చకబ్వ (35) టాప్‌ స్కోరర్‌. అయితే 110/8 స్కోరుతో దయనీయ స్థితిలో ఉన్న జట్టును బ్రాడ్‌ ఇవాన్స్‌ (33 నాటౌట్‌), ఎన్‌గరవ (34) అద్భుతంగా ఆదుకుని తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 70 పరుగులు జోడించారు. అక్షర్‌, ప్రసిద్ధ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 30.5 ఓవర్లలో 192 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా దీపక్‌ చాహర్‌ నిలిచాడు.


అలవోక ఆటతీరుతో..:

అద్భుత ఫామ్‌లో ఉన్న నయా ఓపెనింగ్‌ జోడీ ధవన్‌-గిల్‌ను కెప్టెన్‌ రాహుల్‌ మార్చే ప్రయత్నం చేయలేదు. ఈ నిర్ణయానికి తగ్గట్టుగానే గబ్బర్‌, గిల్‌ చెలరేగారు. ఇటీవలి విండీస్‌ టూర్‌లో చూపిన ఫామ్‌నే ఇక్కడా ప్రదర్శిస్తూ జింబాబ్వే బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇక ఆరంభంలో గిల్‌ నెమ్మదిగానే ఆడినా కుదురుకున్నాక ధవన్‌ను మించిపోయాడు. 25వ ఓవర్‌లో రెండు ఫోర్లు.. తర్వాతి ఓవర్‌లో 4,6తో గేరు మార్చాడు. ప్రత్యర్థి బౌలింగ్‌లో ఎలాంటి వైవిధ్యం లేకపోవడంతో ఈ జోడీ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించింది. ఇదే క్రమంలో తమ చివరి నాలుగు వన్డేల్లో ఈ ఇద్దరూ తమ మూడో అర్ధసెంచరీలు సాధించడంతో పాటు తొలి వికెట్‌కు మూడో శతక భాగస్వామ్యం అందించారు. అదే జోరుతో మరో 19.1 ఓవర్లుండగానే మ్యాచ్‌ను ముగించారు.


బౌలర్ల తడాఖా..

చివర్లో పోరాటం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  జింబాబ్వేను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు. అటు పరుగులు చేయలేక.. ఇటు వికెట్లు కాపాడుకోలేక సతమతమైంది. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న దీపక్‌ చాహర్‌ స్వింగ్‌, బౌన్స్‌తో బెంబేలెత్తిస్తూ టాపార్డర్‌ పనిబట్టాడు. సీన్‌ విలియమ్స్‌(1)ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో 31 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్‌ చకబ్వ పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ అక్షర్‌, పేసర్‌ ప్రసిద్ధ్‌ చెలరేగడంతో వికెట్ల పతనం ఆగలేకపోయింది. ఇలా 110 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన వేళ ఇక ఆతిథ్య జట్టు 150 పరుగులలోపే ఆలౌట్‌ అవుతుందనిపించింది.


అయితే తొమ్మిది, పదో నెంబర్‌ బ్యాటర్లు ఇవాన్స్‌, ఎన్‌గరవ మాత్రం భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఈ జోడీ అనూహ్య ఆటతీరుతో చెత్త బంతులను బౌండరీలు బాదేస్తూ చకచకా పరుగులు రాబట్టింది. 65 బంతుల్లోనే తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జత చేసింది. చివరకు 40వ ఓవర్‌లో ఎన్‌గరవను సూపర్‌ యార్కర్‌తో ప్రసిద్ధ్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత ఓవర్‌లో అక్షర్‌ చివరి వికెట్‌ తీయడంతో జింబాబ్వే పోరాటం ముగిసింది.


స్కోరుబోర్డు

జింబాబ్వే :

కేయా (సి) శాంసన్‌ (బి) చాహర్‌ 4; మరుమణి (సి) శాంసన్‌ (బి) చాహర్‌ 8; మధెవెరె (ఎల్బీ) చాహర్‌ 5; విలియమ్స్‌ (సి) ధవన్‌ (బి) సిరాజ్‌ 1; రజా (సి) ధవన్‌ (బి) ప్రసిద్ధ్‌ 12; చకబ్వ (బి) అక్షర్‌ 35; రియన్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 11; జోంగ్వే (ఎల్బీ) అక్షర్‌ 13; ఇవాన్స్‌ (నాటౌట్‌) 33; ఎన్‌గరవ (బి) ప్రసిద్ధ్‌ 34; న్యాచి (సి) గిల్‌ (బి) అక్షర్‌ 8; ఎక్స్‌ట్రాలు: 25;

మొత్తం:

40.3 ఓవర్లలో 189 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-25, 2-26, 3-31, 4-31, 5-66, 6-83, 7-107, 8-110, 9-180, 10-189. బౌలింగ్‌: చాహర్‌ 7-0-27-3; సిరాజ్‌ 8-2-36-1; కుల్దీప్‌ 10-1-36-0; ప్రసిద్ధ్‌ 8-0-50-3; అక్షర్‌ 7.3-2-24-3.


భారత్‌ ఇన్నింగ్స్‌:

ధవన్‌ (నాటౌట్‌) 81; గిల్‌ (నాటౌట్‌) 82; ఎక్స్‌ట్రాలు: 29; మొత్తం: 30.5 ఓవర్లలో 192/0. బౌలింగ్‌: ఎన్‌గరవ 7-0-40-0; న్యాచి 4-0-17-0; ఇవాన్స్‌ 3.5-0-28-0; విలియమ్స్‌ 5-0-28-0; సికిందర్‌ రజా 6-0-32-0; జోంగ్వే 2-0-11-0; మధెవెరె 2-0-16-0; బుర్ల్‌ 1-0-12-0.


Updated Date - 2022-08-19T10:04:09+05:30 IST