Zimbabwe vs India: రెండో వన్డే కూడా కొట్టేశాం.. సిరీస్‌ టీమిండియా వశం

ABN , First Publish Date - 2022-08-21T00:05:48+05:30 IST

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా అదరగొట్టింది. జింబాబ్వే నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని 25.4 ఓవర్లలోనే..

Zimbabwe vs India: రెండో వన్డే కూడా కొట్టేశాం.. సిరీస్‌ టీమిండియా వశం

హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా అదరగొట్టింది. జింబాబ్వే నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని 25.4 ఓవర్లలోనే ఛేదించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విజయ తీరాలకు చేరింది. సంజూ శాంసన్ చివర్లో చెలరేగి ఆడాడు. నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 33 పరుగులు, దీపక్ హుడా 25, శుభ్‌మన్ గిల్ 33 పరుగులు చేశారు. లక్ష్యం తక్కువగానే ఉండటంతో ఏమాత్రం కంగారు లేకుండా టీమిండియా ఈ మ్యాచ్‌ను కూల్‌గా ముగించింది.



టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టుకు ఓపెనర్లు నిరాశే మిగిల్చారు. తొలి వన్డేలో పేలవంగా ఆడిన ఓపెనర్లు రెండో వన్డేలో కూడా అంతే నీరసంగా ఆడారు. జింబాబ్వే ఓపెనర్లు కైటానో 7 పరుగులు, ఇన్నోసెంట్‌ కెయా 16 పరుగులకే చేతులెత్తేశారు. సంజూ శాంసన్‌కు కీపర్‌ క్యాచ్‌గా చిక్కి ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. మిడిలార్డర్ అయినా ఆదుకుంటుందేమోనని భావించిన జింబాబ్వే అభిమానులకు నిరాశే ఎదురైంది. కెప్టెన్ చకబ్వా, మధెవెరె మరీ దారుణం. చెరో రెండు పరుగులకే ఔట్‌గా వెనుదిరిగారు. రజ 16 పరుగులు చేశాడు. అంత కష్టాల్లో ఉన్న జింబాబ్వే జట్టుకు కాస్తంత ఊపిరి పోసేందుకు సీన్ విలియమ్స్ ప్రయత్నించాడు. 42 బంతుల్లో ఒక సిక్స్, 3 ఫోర్లతో 42 పరుగులు చేసి కొంతలో కొంత నయమనిపించాడు. 


దీపక్ హుడా బౌలింగ్‌లో విలియమ్స్ కూడా ఔట్ కావడంతో జింబాబ్వే స్కోర్ మందగించింది. ఆ సమయంలో.. ర్యాన్ బర్ల్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జింబాబ్వే 161 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ ఒక్క పరుగు మాత్రమే చేసి నౌచి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే.. ఆ  తర్వాత ధావన్ 33 పరుగులు, శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ 6 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. దీపక్ హుడా 25 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ మాత్రం దూకుడుగా ఆడి 39 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టి 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సంజూ శాంసన్‌కు దక్కింది.

Updated Date - 2022-08-21T00:05:48+05:30 IST