Zimbabwe vs India: రెండో వన్డేలోనూ అదే తీరు.. జింబాబ్వే కొంపముంచుతోంది ఎవరంటే..

ABN , First Publish Date - 2022-08-20T20:49:09+05:30 IST

తొలి వన్డేలో చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ రెండో వన్డేలోనూ అంతే పేలవంగా ఆడారు. కైటానో 7 పరుగులు, ఇన్నోసెంట్‌ కెయా 16 పరుగులకే..

Zimbabwe vs India: రెండో వన్డేలోనూ అదే తీరు.. జింబాబ్వే కొంపముంచుతోంది ఎవరంటే..

హరారే: తొలి వన్డేలో చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ రెండో వన్డేలోనూ అంతే పేలవంగా ఆడారు. కైటానో 7 పరుగులు, ఇన్నోసెంట్‌ కెయా 16 పరుగులకే చేతులెత్తేశారు. మధెవెరె, చకబ్వ అయితే చెరో రెండు పరుగులకే చతికిలపడ్డారు. రజా 16 పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు. సీన్ విలియమ్స్ 42 పరుగులు చేసి కాస్తోకూస్తో జట్టుకు స్కోర్‌ను అందించే ప్రయత్నం చేశాడు. అయితే.. విలియమ్స్ కూడా దీపక్ హుడా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ కావడంతో జింబాబ్వే జట్టు కష్టాల్లో పడింది. 30 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే జట్టు ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆరు వికెట్లలో శార్దూల్ ఠాకూల్ రెండు వికెట్లతో రాణించగా, సిరాజ్, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీశారు.



జింబాబ్వే ఈ సిరీస్‌కు అంచనాలతోనే బరిలోకి దిగింది. అయితే టాపార్డర్‌ విఫలం కావడం ఆ జట్టు స్కోరుపై ప్రభావం పడుతోంది. ఇటీవలి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే జరిగింది. మిడిలార్డర్‌ మాత్రం ఆదుకుంటోంది. సీనియర్లు శాన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆ జట్టుకు నిరాశ కలిగించే అంశం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఈ ఇద్దరికి మినహా మరెవరికీ పెద్దగా అనుభవం లేకపోవడంతో భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమవుతోంది. అయినా తొలి వన్డేలో టెయిలెండర్లు చక్కటి పోరాటాన్ని కనబరిచారు.



ఇక తొలి వన్డేలో జింబాబ్వే బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం వారి పేలవ ప్రదర్శనను బహిర్గతం చేసింది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో జింబాబ్వేను చావుదెబ్బ తీసిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్‌ ఉండగానే రాహుల్‌ సేన సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. మరోవైపు బంగ్లాదేశ్‌పై టీ20, వన్డే సిరీస్‌లను గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన జింబాబ్వే జట్టు భారత్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడింది.

Updated Date - 2022-08-20T20:49:09+05:30 IST