Zimbabwe vs India: రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాటింగ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-08-20T21:40:15+05:30 IST

జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు 161 పరుగులకే ఆలౌట్ అయింది. 162 పరుగుల లక్ష్యంతో..

Zimbabwe vs India: రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాటింగ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

హరారే: జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు 161 పరుగులకే ఆలౌట్ అయింది. 162 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి వన్డేతో పోల్చుకుంటే రెండో వన్డేలోనూ జింబాబ్వే బ్యాటింగ్ ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత పేలంగా సాగిన పరిస్థితి. టాపార్డర్, మిడిలార్డర్‌ అనే తేడా లేకుండా బ్యాట్స్‌మెన్స్ అంతా పేలవంగా ఆడారు. ఇద్దరు మాత్రమే పర్వాలేదనిపించారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సీన్ విలియమ్స్ 42 పరుగులు చేయగా, ర్యాన్ బర్ల్ 39 పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ మినహాయిస్తే జింబాబ్వే బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ ఆశాజనకంగా ఆడలేదు. ఓపెనర్లు కైటానో 7 పరుగులు, ఇన్నోసెంట్‌ కెయా 16 పరుగులకే చేతులెత్తేశారు. మధెవెరె, చకబ్వ అయితే చెరో రెండు పరుగులకే చతికిలపడ్డారు. రజా 16 పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌ 3 వికెట్లతో సత్తా చాటగా, సిరాజ్, ప్రసీద్ కృష్ణ, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీశారు. ఇద్దరు రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో.. జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది.



తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ఆట తీరుతో సత్తా చాటిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్‌పరంగా ఆశించిన విధంగానే రాణించింది. 161 పరుగులకే జింబాబ్వేను కట్టడి చేసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియాను బ్యాట్స్‌మెన్స్ ఏమేరకు విజయ తీరాలకు చేరుస్తారో చూడాలి. తొలి వన్డేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా జింబాబ్వేను చావు దెబ్బ తీసిన టీమిండియా రెండో వన్డేలో కూడా గెలిస్తే ఈ మూడు వన్డేల సిరీస్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా వశమవుతుంది. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు దిగారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు టాస్ కలిసొచ్చిందని చెప్పాలి.

Updated Date - 2022-08-20T21:40:15+05:30 IST