Zimbabwe vs India: గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాసలా.. ‘దీపక్ చాహర్ ఈజ్ ఆన్ ఫైర్’ !

ABN , First Publish Date - 2022-08-18T20:16:40+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత జట్టులోకి..

Zimbabwe vs India: గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాసలా.. ‘దీపక్ చాహర్ ఈజ్ ఆన్ ఫైర్’ !

హరారే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా గాయాల నుంచి కోలుకుని చాలా రోజుల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన పేసర్ దీపక్ చాహర్ అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే 75 పరుగులు చేసి ఐదు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లలో మూడు వికెట్లు దీపక్ చాహర్ తీసినవే కావడం విశేషం. మరుమణి, కైయా ఇద్దరూ దీపక్ చాహర్ బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగారు. హరారే వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇటీవలే బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జట్టుకు పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. అందుకే.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో ఆలోచనే లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉదయం పేసర్లకు కొంత అనుకూలించే అవకాశం ఉందని రాహుల్ అంచనా వేయడమే ఇందుకు కారణం. ఆ అంచనా టీమిండియా భావించినట్టుగానే నిజమైంది.



18 ఓవర్ల లోపు జింబాబ్వే కోల్పోయిన ఐదు వికెట్లలో మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణకు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉండగా జింబాబ్వే పిచ్‌లపై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్‌-జింబాబ్వే మధ్య జరిగిన 8 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఏడుసార్లు టీమిండియా గెలిస్తే, 1996-97లో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే నెగ్గింది. హరారే పిచ్‌పై ఆడిన 16 వన్డేల్లో భారత్‌పై జింబాబ్వే రెండుసార్లు మాత్రమే గెలిచింది. జింబాబ్వేలో కేఎల్‌ రాహుల్‌ వన్డే అరంగేట్రం చేయగా.. అక్షర్‌, శాంసన్‌ తమ తొలి టీ20 మ్యాచ్‌లు ఇక్కడే ఆడటం విశేషం.

Updated Date - 2022-08-18T20:16:40+05:30 IST