Zomato: చిక్కుల్లో పడ్డ జొమాటో.. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో..

ABN , First Publish Date - 2022-08-21T23:46:35+05:30 IST

బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌తో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) తాజాగా చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ దిగివచ్చింది.

Zomato: చిక్కుల్లో పడ్డ జొమాటో..  ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో..

ముంబై: బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌తో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) తాజాగా చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ దిగివచ్చింది. యాడ్‌ కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జొమాటో ఇటీవల హృతిక్‌ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో ఓ ప్రకటన రూపొందించింది. అందులో కమాండోగా నటించిన హృతిక్.. జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డరిస్తారు. ఎవరిచ్చారు ఈ ఆర్డర్.. అని తోటి కమాండోలు ప్రశ్నిస్తే.. నేనే అని సమాధానం చెబుతారు. ఉజ్జయినిలో ‘తాలీ’ తినాలనిపించిందని,  ‘మహాకాల్’ నుంచి ఆర్డరిచ్చానని చెబుతాడు. ఇలా ‘మహాకాల్’ ప్రస్తావన తేవడంతో పెద్ద వివాదం చెలరేగింది. ద్వాదశ జోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం(Mahakal Temple) గురించి యాడ్‌లో ఇలా ప్రస్తావిస్తారా అంటూ నెటిజన్లు గగ్గోలు పెట్టారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 


ఇక ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ అర్చకులు కూడా ఈ యాడ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాలీ అంటే మహాశివుడి నైవేద్యమని.. ఇది ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదని మండిపడ్డారు. ఇలా నలుదిశలా విమర్శలు వెల్లువెత్తడంతో జొమాటో దిగొచ్చి క్షమాపణలు(Apology) చెప్పింది. ప్రజల మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వివరించింది. ఉజ్జయినిలో ప్రముఖ మహాకాల్‌ రెస్టారెంట్‌ను మాత్రమే తమ యాడ్‌లో పేర్కొన్నామని చెప్పింది. వివిధ ప్రాంతాల్లో ప్రముఖ రెస్టారెంట్లను ప్రస్తావిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రకటన రూపొందించామని చెప్పింది. ఇవి ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమని చెప్పింది. అయితే.. ప్రజల అభిప్రాయాలకు తాము ఎంతో విలువనిస్తామన్న జొమాటో.. ఆ యాడ్‌ను ప్రస్తుతం ప్రదర్శించట్లేదంది. ఇదిలా ఉంటే.. బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌తో హిందీ సినిమాలు చిక్కుల్లో పడుతున్న ఈ తరుణంలో జొమాటో యాడ్‌తో హృతిక్‌ కూడా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-08-21T23:46:35+05:30 IST