Zomato: జొమాటో కస్టమర్లకు కలలో కూడా ఊహించని సర్వీస్.. ఆర్డర్ చేసుకున్న 24 గంటల్లో..

ABN , First Publish Date - 2022-08-31T02:03:44+05:30 IST

ఇటివలే ‘ప్రో ప్లస్’ మెంబర్‌‌షిప్ ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato).. సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Zomato: జొమాటో కస్టమర్లకు కలలో కూడా ఊహించని సర్వీస్.. ఆర్డర్ చేసుకున్న 24 గంటల్లో..

న్యూఢిల్లీ: ఇటివలే ‘ప్రో ప్లస్’ మెంబర్‌‌షిప్ ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato).. సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కస్టమర్లు ఎంచక్కా ఇంట్లో కూర్చుని ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు.. ఇలా దేశంలోని ఏ సిటీ నుంచైనా తమకు నచ్చిన ప్రత్యేక వంటకాన్ని ఆర్డర్ చేయవచ్చు. 24 గంటల్లో ఈ వంటకం కస్టమర్‌కు అందుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘జొమాటో ఇంటర్‌‌సిటీ లెజెండ్స్’(Zomato Intercity Legends) త్వరలోనే ఆరంభమవనుంది. ఈ స్కీమ్‌లో ఆహారం లేదా వంటకాన్ని సిద్ధం చేసి గడ్డకట్టే శీతల స్థితిలో ఉంచుతారు. ఆ తర్వాత వాయు లేదా రోడ్డు మార్గంలో మరుసటి రోజు కస్టమర్‌కి చేరేలా నిర్వహిస్తారు. ఒక్కోసారి 24 గంటల సమయం కూడా మించే అవకాశాలుంటాయి. ఈ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని నగరాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.


ఎలా పనిచేస్తుంది?

ప్రతి నగరంలో పలు రెస్టారెంట్లను ఎంపిక చేసి ఒక జాబితాను జొమాటో సిద్ధం చేస్తుంది. ఇంటర్‌సిటీ లెజెండ్స్ కింద ఈ జాబితా నుంచే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి మైసూర్ పాక్, కోల్‌కతా నుంచి సందెశ్ వంటి ప్రఖ్యాత వంటకాలను తమతమ ప్రాంతాల నుంచే తెప్పించుకోవచ్చు. అయితే రేటు మాత్రం ఎక్కువగా ఉండడం ఖాయం. ఎందుకంటే ఆహార పదార్థం ధరతోపాటు డెలివరీ, షిప్పింగ్ చార్జీలు కూడా వినియోగదారులపైనే పడే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ జొమాటో ఆర్డర్లతో పోల్చితే ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ ఆర్డర్లపై బిల్లులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రేట్లు ఎలా ఉండబోతున్నాయనేది ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తేనే తెలుస్తుంది.


అయితే జొమాటో కొత్త ప్రొడక్ట్స్, సర్వీసుల ఆవిష్కరణకు సంబంధించి గతంలో విస్తృత ప్రచారం జరిగిన సందర్భాలున్నాయి. అవి కార్యరూపం దాల్చినా లేకున్నా మార్కెట్‌లో మాత్రం మంచి ప్రచారం జరిగేది. ఈ తరహాలో సర్వీసులు ఆరంభించడం, ఆ తర్వాత ఉపసంహరించుకున్న పలు సందర్భాలున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ సర్వీస్, గ్రాసరీ డెలివరీ సర్వీస్‌ ఈ జాబితాకే చెందుతాయంటున్నారు. ఈ రెండింటినీ జొమాటో ప్రారంభించి.. ఆ తర్వాత ఉపసంహరించుకుందని పేర్కొంటున్నారు. మరి ఇంటర్‌సిటీ లెజెండ్స్ ప్రాజెక్ట్ ఏమవుతుందో వేచిచూడాలి మరి.

Updated Date - 2022-08-31T02:03:44+05:30 IST