ఇసుక లేక ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-12-03T06:01:23+05:30 IST

ఇసుక లేక ఇక్కట్లు

ఇసుక లేక ఇక్కట్లు
ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయం


ప్రజాప్రతినిధుల అభ్యర్థనలూ బేఖాతరు

ఇసుక, సీనరేజీపై నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 2: జిల్లాలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, వంతెనలు, రోడ్లు.. ఇలా ప్రతీ పనికి ఇసుక అవసరం. కానీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనులను ఇసుక కొరత వేధిస్తోంది. పలుమార్లు ప్రజాప్రతినిధులు సాక్ష్యాత్తు కలెక్టర్‌కు మొర పెట్టుకుంటున్నా.. స్థానికంగా ఉండే అధికారులు.. పోలీసులు పట్టించుకోవడం లేదు. అంగట్లో అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు.. జిల్లా సరిహద్దుల్లో ఇసుక రీచ్‌లు ఉన్నా.. అవి మనకు ఉపయోగపడడం లేదు. దీంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.

జిల్లాలో ఆరువేలకు పైగా డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. సుమారు రూ.15కోట్ల విలువైన సీసీరోడ్లు, కార్యాలయాలకు భవనాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ ఇసుకే ప్రధానం. గతంలో భద్రాచలం, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక లోటు లేకుండా రవాణా అయ్యేది. కానీ గత ఐదారేళ్లుగా ఇసుక కొరత జిల్లావాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఖమ్మం రూరల్‌ మండలం, తిరుమలాయపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఇసుక కొరతపై అక్కడి ప్రజాప్రతినిధులు ఇసుకపై ఎన్నోమార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎర్రుపాలెం మండలంలోని ఇసుక రీచ్‌ల నుంచి కల్లూరు. మధిర ప్రాంతానికి రావాలంటే సరిహద్దు కష్టాలు తప్పడం లేదని అంతరాష్ట్ర సరిహద్దు వివాదాలతో ఇసుకకు ఆటంకం ఏర్పడుతోంది. మన జిల్లాలోని ఇసుకను మన అవసరాలకే వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇసుక సమస్యలపై ఎర్రుపాలెం, సత్తుపల్లి, కల్లూరు జడ్పీటీసీలు పలుమార్లు జడ్పీ సమావేశంలో తమ గళాన్ని విప్పినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపలేకపోయారు. దీంతో అనేక అభివృద్ధి పనులకు ఇసుక ఆటంకంగా మారింది. ఇటీవలె ఖమ్మంలో ఇసుక డిపో ఏర్పాటు చేసినప్పటికీ దందానే కొనసాగుతోంది. ఇక్కడ ఇసుక డిపో ఉందన్న విషయంపై ప్రచారం లేకపోవడం వల్ల సొంతింటి నిర్మాణ దారులు, ఇసుక అవసరం ఉన్న వారు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ పాగా వేసిన వ్యాపారులే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకుంటూ అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇసుక డిపోపై జిల్లా వాసులకు ప్రచారం కల్పిస్తూ దళారీల వ్యవస్థను నిర్మూలిస్తే ప్రభుత్వ లక్ష ్యం నెరవేరే ఆస్కారం ఉంది. దీనిపై నేడు నిర్వహించనున్న జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గళమెత్తనున్నారు.  ఇసుక, సీనరేజితో పాటు మహిళా సంక్షేమం, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై అజెండాగా ఈ సర్వసభ్య సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాపరిషత్‌ అధికారులు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంకు అధికారులు, సభ్యులు సకాలంలో హాజరుకావాలని జడ్పీ సీఈవో ప్రియాంక కోరారు.

Updated Date - 2020-12-03T06:01:23+05:30 IST