వాడివేడిగా జడ్పీ సమావేశం

ABN , First Publish Date - 2022-08-17T06:00:30+05:30 IST

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సమావేశంలో కౌలు రైతులకు నష్ట పరిహారం అంశంపై మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

వాడివేడిగా జడ్పీ సమావేశం

 కాకినాడ సిటీ, ఆగస్టు 16: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సమావేశంలో కౌలు రైతులకు నష్ట పరిహారం అంశంపై మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పలు సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు నిరసన గళం విప్పారు. అయితే సమస్యలపై మాట్లాడనీయకుండా మంత్రి నిలువరించడంతో సభ్యులు అసహనానికి గురయ్యారు. మహిళా సభ్యులు ఒకానొక దశలో సమావేశం నుంచి బయటకు వెళ్లి పోవడానికి ప్రయత్నించారు. సమావేశం ఆద్యంతం అంతా తానై మంత్రి వ్యవహరించిన తీరు పట్ల సభ్యులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌలు రైతులకు నష్ట పరిహారంపై ప్రధానంగా చర్చ సాగింది. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై  కీలకంగా చర్చ జరిగింది.
రైతు సంక్షేమమే ధ్యేయం: మంత్రి వేణు
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు, కౌలు రైతుల సంక్షేమానికి రాష్ట్ర  ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, ఇళ్ల వెంకటేశ్వరరావు, జగ్గంపేట, అనపర్తి, పిఠాపురం ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జడ్పీ వైస్‌చైర్మన్‌లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ హాజరయ్యారు. జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ 1986, 2006 తర్వాత ఇటీవల గోదావరికి 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, అయినా ఈ వరద ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. ఇటీవల 15 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, అధికారులు అహర్నిశలు కష్టపడి ప్రజలకు తోడ్పాటునందించారన్నారు.ఇటీవల వరదల వల్ల ఎదురైన సమస్యలు, పరిష్కారాలు, ప్రస్తుత ఖరీ్‌ఫకు సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, నీటి పారుదల, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు, రహదారుల అభివృద్ధి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు తమ ప్రాంత అంశాలను లేవనెత్తగా అధికారులు వివరాలు అందించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు లేవనె త్తిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు కృతికా శుక్లా, హిమాన్షు శుక్లా తెలిపారు.
ఎమ్మెల్యే వర్సెస్‌ మంత్రి
సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుల మధ్య వాగ్వాదం జరిగింది. పలు సమస్యలపై అధికార పార్టీ నేతలు నిలదీసుకున్నారు. కౌలు సమస్యలను మంత్రి వేణు దృష్టికి ఎమ్మెల్యే చంటిబాబు తీసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి సంబంధిత జీవోను చదివి వినిపించి చర్చ ముగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఎమ్మెల్యే మండిపడుతూ తమకు జీవోలు తెలుసని, కొత్తగా వాటి గురించి మంత్రి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మీరు డెసిషన్‌ మేకర్‌ కానప్పుడు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. మంత్రి అన్నింటికి సమాధానం చెప్పాలని మండిపడ్డారు. చంటిబాబు మాట్లాడుతున్నది సరైన పద్ధతి కాదని మంత్రి వేణు అన్నారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, అఽధికారులైనా సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు జడ్పీటీసీలు నిలదీశారు. 

Updated Date - 2022-08-17T06:00:30+05:30 IST