ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాల ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-07-25T06:00:03+05:30 IST

ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాల ఆకస్మిక తనిఖీ

ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాల ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జేసీ శివ శంకర్‌, ఇతర అధికారులు

  నాడు -నేడు అవినీతిపై వివరాలు చెబుతున్న ఎస్‌ఎంసీ సభ్యుడిపై జేసీ ఆగ్రహం

  వీడియో తీస్తున్న రిపోర్టర్‌పైనా మండిపాటు..    బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశం

  జేసీ తీరుపై సర్వత్రా  విస్మయం

కంకిపాడు, జూలై 24 : అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోయినా, నిర్మాణ పనులు సక్రమంగా జరగకపోయినా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు.. ఇప్పుడు నేనేం చేయను అంటూ స్కూల్‌ యాజమాన్య కమిటి సభ్యుడిపై సచివాలయ, సర్వ శిక్ష జాయింట్‌ కలెక్టర్‌ శివ శంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాలలో ‘నాడు - నేడులో అవినీతి’ అంటూ  శనివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి స్పందించిన  జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి లక్ష్మీదుర్గ ఉదయాన్నే  ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులు, అవినీతి, అక్రమాలు, అదనపు బిల్లులపై వివరాలు సేకరించారు. స్కూల్‌ యాజమాన్య కమిటీ సభ్యులు, స్థానికులతో సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. మధ్యాహ్న సమయానికి సచివాలయ, సర్వశిక్ష జాయింట్‌ కలెక్టర్‌ శివ శంకర్‌ చేరుకున్నారు. స్కూల్‌ యాజమాన్య కమిటీ చైర్మన్‌ పాములు, హెచ్‌ఎం శివ రామకృష్ణ, స్కూల్‌ యాజమాన్య కమిటీ సభ్యులు, స్థానికులతో సమావేశం నిర్వహించారు.  పాఠశాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై పంచాయతీ రాజ్‌ ఏడీతో విచారించాలని ఆదేశించామన్నారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుల్తాన, తహసీల్దార్‌ టి.వి.సతీష్‌, ఎంఈవో కనకమహాలక్ష్మి, ఈవోఆర్డీ దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇప్పటి వరకు ఏం చేస్తున్నావ్‌..

పాఠశాలలో జరిగిన అవినీతిపై జేసీ శివశంకర్‌కు రామారావు అనే స్కూల్‌ కమిటీ సభ్యుడు వివరిస్తుండగా జేసీ సీరియస్‌ అయ్యారు. ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు. ఇంత జరుగుతుంటే మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖలకు ఫిర్యాదు చేయాలని తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ కమిటీ సభ్యుడిని ఏకవచనంతో సంభోదిస్తూ చిరాకు పడ్డారు. సంభాషణనలను వీడియో తీస్తున్న రిపోర్టర్‌పై నా అనుమతి లేకుండా వీడియో ఎందుకు తీస్తున్నారని, వెంటనే ఫోన్‌ లాక్కోండి అంటూ మండిపడ్డారు. నా స్కూల్‌ల్లోకి ఎవరూ రాకూడదంటూ రిపోర్టర్లను, స్థానికులను బయటకు పంపించి వేశారు. జేసీ తీరుతో ఎస్‌ఎంసీ సభ్యులతో పాటు అధికారులు విస్మయానికి గురైయ్యారు.

Updated Date - 2021-07-25T06:00:03+05:30 IST