జెడ్పీలో బదిలీలలు

ABN , First Publish Date - 2022-07-06T07:02:09+05:30 IST

జిల్లా పరిషత్‌ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి.

జెడ్పీలో బదిలీలలు

మునగపాక మండలాధ్యక్షురాలి పేరుతో ఫోర్జరీ లేఖ

బండారం బయటపడడంతో ఏజెన్సీకి ఇద్దరు ఉద్యోగులు బదిలీ

మరోపక్క చక్రం తిప్పిన యూనియన్‌ నాయకులు

ఉద్యోగుల నుంచి భారీగా వసూళ్లు?

మంత్రి, మాజీ మంత్రి సిఫారసులను కూడా పక్కనపెట్టినట్టు ప్రచారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒకేచోట ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక కారణం చూపిస్తే...ఐదేళ్లు కంటే తక్కువ సర్వీసు ఉన్నా బదిలీ చేయవచ్చునని సూచించింది. ఆ మేరకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, సీఈఓలు బదిలీల ప్రక్రియ చేపట్టారు. కావాలనుకున్న ప్రాంతానికి వెళ్లడానికి పలువురు ఉద్యోగులు...ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకొని జెడ్పీ కార్యాలయంలో సమర్పించారు. అయితే అక్కడ వాటిని కూడా పక్కనపెట్టేలా ఉద్యోగ సంఘ నాయకులు చక్రం తిప్పారు. కోరుకున్న చోటకు బదిలీ చేయిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఆ మేరకు కొందరికి బదిలీలు చేయించారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసులను కూడా ఖాతరు చేయలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే...మునగపాక ఎంపీపీ పేరుతో ఫోర్జరీ లేఖ తయారుచేసి దానిని జెడ్పీ కార్యాలయంలో సమర్పించిన ఐదుగురిని అడ్డగోలుగా బదిలీ చేశారు. ఈ విషయం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు తెలియడంతో ఏమి జరిగిందో మొత్తం ఆరా తీశారు. ఈ విషయంలో జెడ్పీ ఉద్యోగి స్వామి, మరో మహిళ హస్తం వున్నదని తెలియడంతో వారిలో ఒకరిని గూడెంకొత్తవీధికి, మరొకరిని కొయ్యూరుకు బదిలీ చేయించారు. 

మునగపాకకు చెందిన గోపీ ఉరఫ్‌ స్వామి విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్నారు. అనకాపల్లిలో పనిచేస్తున్న ఓ మహిళ మునగపాకకు బదిలీ చేయించుకోవాలని భావించారు. అందుకోసం స్థానిక మండలాధ్యక్షురాలు జయలక్ష్మిని లేఖ అడిగారు. తనకు రాయడం రాదని, రాయించి తీసుకువస్తే...సంతకం చేస్తానని ఆమె చెప్పారు. స్థానికుడైన గోపీ (స్వామి) ఈ విషయం తెలుసుకొని ఆ లేఖ తాను రాయిస్తానని చెప్పాడు. ఆ మహిళతో పాటు మరో నలుగురి పేర్లు అందులో రాసి ఎంపీపీతో సంతకం చేయించాడు. ఆమెకు పెద్దగా చదువు రాకపోవడంతో ఇంగ్లీష్‌లో వున్న ఆ లేఖ సారాంశం అర్థం చేసుకోలేకపోయారు. మునగపాకలో ఈఓఆర్‌డీ, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇద్దరూ ప్రతిపక్ష పార్టీకి సహకరిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, వారిని బదిలీ చేసి ఆ స్థానంలో స్వామిని, ఆ మహిళను నియమించాలని ఆ లేఖలో రాశారు. ఎంపీపీ సిఫారసు కావడంతో జెడ్పీ అధికారులు ఆ ప్రకారమే బదిలీ చేసేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా ఎమ్మెల్యే కన్నబాబురాజుకు తెలియడంతో ఎంపీపీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లేని లెటర్‌ హెడ్‌పై తప్పుడు సమాచారం రాసి బదిలీలు చేయించుకున్నందుకు వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవానికి ఆ మహిళకు అనకాపల్లి జిల్లా మంత్రి సిఫారసు చేసినా, ఆయనకు కూడా ఈ విషయం చెప్పి ఆమెను కొయ్యూరు బదిలీ చేయించారు. స్వామిని జీకే వీధి పంపించారు. ఇంకా ఏం జరిగిందంటే...

- అనకాపల్లి సమీపానున్న తోటాడ హైస్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ను బదిలీ చేశారు. ఆ స్థానంలో మరొకరిని వేయాల్సిందిగా ఆ జిల్లా మంత్రి సిఫారసు చేశారు. ఆయన చెప్పిన వారిని కాదని వేరే ఉద్యోగిని అక్కడ వేశారు.

- విశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భీమిలి ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయానికి బదిలీ కోరారు. అందుకు అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ సమర్పించారు. అధికారులు ఆయన్ను భీమిలి వేయకుండా అచ్యుతాపురం బదిలీ చేశారు. తాజా మాజీ మంత్రి సిఫారసును కూడా పక్కన పెట్టేశారు.

- ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ ఆఫీసు సూపరింటెండెంట్‌ను చోడవరం బదిలీ చేశారు. సాధారణంగా ఇలాంటి వాటికి అక్కడి ఎమ్మెల్యే అనుమతి అవసరం. కరణం ధర్మశ్రీ ఈ విషయం తెలుసుకొని తన అనుమతి లేకుండా ఎలా బదిలీ చేశారని ఆ ఉద్యోగిని చేరనీయలేదు. ఇక్కడ కూడా యూనియన్‌ నేతలు చక్రం తిప్పారు.

- చోడవరం నుంచి ఓ ఆఫీసు సూపరింటెండెంట్‌ను విశాఖపట్నం వేశారు. ఆమె తనకు విశాఖపట్నం వద్దని, కోరుకోలేదని వాపోతున్నారు. 

- మునగపాక మండలం ఎంజే పురంలో అటెండర్‌ ఒకరు రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఏడు నెలలుగా అక్కడ పనిచేస్తుంటే...మధురవాడ సమీపాన చంద్రంపాలెం బదిలీ చేశారు. అదే ఎంజే పురంలో ఇంకో ఉద్యోగి ఏజెన్సీలో 11 ఏళ్లు పనిచేసి వస్తే...తిరిగి అతడిని ఏజెన్సీకే వేశారు.


పోలీసు కేసు పెట్టాల్సిందిగా మండలాధ్యక్షురాలికి చెప్పా

కన్నబాబురాజు, ఎమ్మెల్యే, ఎలమంచిలి

పెద్దగా చదువుకోని ఎంపీపీని మభ్యపెట్టి ఇద్దరు ఉద్యోగులు నాటకం ఆడారు. ఫోర్జరీ లెటర్‌ పెట్టారు. ఇది చిన్న విషయం కాదు. అందుకే వారిద్దరినీ ఏజెన్సీకి బదిలీ చేయించా. ఇంకా పోలీసు కేసు కూడా పెట్టాల్సిందిగా ఎంపీపీకి చెప్పా. బదిలీలకు డబ్బు తీసుకోవడం నీతిమాలిన చర్య. అంతా ఉద్యోగ సంఘ నాయకులే చేస్తున్నారు. 

Updated Date - 2022-07-06T07:02:09+05:30 IST