రేపే కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-09-18T05:46:23+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం జిల్లాలోని ఐదు డివిజన్లలోని 48 మండలాలకు సంబంఽ దించి కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది.

రేపే కౌంటింగ్‌
ఏలూరులో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఐజీ, ఎస్పీ

జిల్లాలో 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
జిల్లాలో నాలుగుచోట్ల ముమ్మర ఏర్పాట్లు
ఉదయం 8 గంటలకు ప్రారంభం
కౌంటింగ్‌కు 3,693 మంది సిబ్బంది


ఏలూరు సిటీ, సెప్టెంబరు 17 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం జిల్లాలోని ఐదు డివిజన్లలోని 48 మండలాలకు సంబంఽ దించి కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.

 3,693 మంది సిబ్బంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని నాలుగు సెంటర్లలో 48 స్ట్రాంగ్‌ రూమ్స్‌లు ఉన్నాయి. మొత్తం 48 కౌంటింగ్‌ గదులలో 715 టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మూడు వేల 693 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 905 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 2,788 మంది అసిస్టెంట్లు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు అసిస్టెంట్లు కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిపై సిబ్బందికి మరోసారి శిక్షణ ఇస్తారు. సాధారణంగా ఒక్కో ఎంపీటీసీకి ఒక టేబుల్‌ను ఏర్పాటు చేయాలి. కాని అక్కడ వున్న పరిస్థితులను బట్టి టేబుల్స్‌ ఏర్పాటు చేసి రౌండ్లు వారీగా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఇలా లెక్కిస్తారు..
ముందుగా బ్యాలెట్‌ బాక్సులను తెరిచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను విడదీస్తారు. 25 చొప్పున వీటిని కట్టలుగా కడతారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించే సమయంలో ముందుగా ఆ కట్టలను డ్రమ్ములో వేసి కలుపుతారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను సమాంతరంగా లెక్కిస్తారు.

45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీలకు లెక్కింపు

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి 23,48,735 మంది ఓటర్లు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జరిగిన ఎన్నికలలో 16,03,588 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 48 జడ్పీటీసీలకు గాను ఏలూరు, జంగారెడ్డిగూడెం ఏకగ్రీవమయ్యాయి. పెనుగొండ జడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మృతి చెందడంతో 45 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 876 ఎంపీటీసీ స్థానాలకు గాను 73 స్థానాలు ఏకగ్రీవం కాగా, తొమ్మిది మంది అభ్యర్థులు మృతి చెందటం, 13 స్థానాలు పట్టణాల్లో విలీనం కావడంతో మిగిలిన 781 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి ఇప్పుడు కౌంటింగ్‌ జరుగుతుంది.


 ప్రత్యేకాధికారుల నియామకం
ఆదివారం నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియను ప్రత్యేకాధికారులు పర్యవేక్షించనున్నారు. ఏలూరు డివిజన్‌ కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా, జంగారెడ్డిగూడెం కౌంటింగ్‌ ప్రక్రియను జేసీ (రెవెన్యూ) బీఆర్‌ అంబేడ్కర్‌, నరసాపురం కౌంటింగ్‌ ప్రక్రియను జేసీ(అభివృద్ధి) హిమాన్షుశుక్లా, కొవ్వూరు కౌంటింగ్‌ ప్రక్రియను జేసీ (ఆసరా) పి.పద్మావతి పర్యవేక్షించారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
అభ్యర్థులు, పార్టీల నేతలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ కార్తికేయ
 
ఈ నెల 19వ తేదీ జరిగే కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కేంద్రాలు, కౌంటింగ్‌ ఏర్పాట్లు పర్యవేక్షణకు జేసీలు, ఐటీడీఏ పీవోలకు విధులు కేటాయించాం. మంచినీరు, పుడ్‌, మీడియా సెంటర్‌, సీసీ కెమేరాలు, ప్రాథమిక చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. కేంద్రాల్లో శానిటైజర్‌, ఆక్సీమీటర్లు, మాస్కులు, మందులు, పీపీఈ కిట్లు, ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. కేంద్రాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాం. ఎవరూ గుమికూడి ఉండరాదు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు సర్టిఫికేట్లు తీసుకోవడానికి వచ్చేటప్పుడు వారితోపాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నాం. కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కౌంటింగ్‌ ఏజెంట్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన వారికి ఐడీ కార్డులు ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఇస్తారని తెలిపారు. కేంద్రాల వద్ద పకడ్బంధీగా బారీ కేడింగ్‌ చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలను ఆదేశించారు. స్థానిక గౌతమి సమావేశ మందిరం నుంచి శుక్రవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆర్డీవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. శనివారం మఽధ్యాహ్నంలోపు స్ట్రాంగ్‌ రూమ్స్‌ నుంచి లెక్కింపు కేంద్రాలకు బారికేడింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు శానిటేషన్‌ పక్కాగా చేయాలన్నారు. కేంద్రాల వెలుపల నుంచి లోపలి వరకు మార్గాలను సూచిస్తూ సూచి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల తరపున నియమించే కౌంటింగ్‌ ఏజెంట్లు వివరాలను సేకరించి సంబంఽధిత జాబితాలను సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారులకు పంపాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలలో ఏజెంట్లుకు, సిబ్బందికి శనివారం శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వీసీలో జేసీలు బీఆర్‌ అంబేద్కర్‌, హిమాన్షుశుక్లా, డీఆర్‌వో డేవిడ్‌రాజు, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో కె.రమేష్‌బాబు పాల్గొన్నారు.

భారీ భద్రత.. 144 సెక్షన్‌ అమలు
ఏలూరు క్రైం, సెప్టెంబరు 17 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేపట్టినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాలను ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఏలూరు ఆర్డీవో రచన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఏలూరు, పెదపాడు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, గణపవరం, నిడమర్రు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. డీఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌, జిల్లాలో పోలీసు యాక్ట్‌ 30 అమలు చేస్తున్నాం. రాజకీయ పార్టీలన్నీ పోలీసులకు సహకరించాలని కోరారు. విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

లెక్కింపు జరిగేది ఇక్కడే..

ఏలూరు డివిజన్‌..
కేంద్రం : వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల
మండలాలు 16 : భీమడోలు, చింతలపూడి, ద్వారకా తిరుమల, దెందులూరు, ఏలూరు, గణపవరం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజర్ల, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, టి.నరసాపురం, ఉంగుటూరు.

కొవ్వూరు డివిజన్‌..
కేంద్రం : తణుకు ఏఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల
మండలాలు 13 : అత్తిలి, చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, పెనుమంట్ర, పెరవలి, తాళ్లపూడి, తణుకు, ఉండ్రాజవరం.

నరసాపురం డివిజన్‌..
కేంద్రం : భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల
మండలాలు 12 : ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ళ, మొగల్తూరు, నరసాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి.

జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లకు..
కేంద్రం : జంగారెడ్డిగూడెం నోవా  ఇంజనీరింగ్‌ కళాశాల
మండలాలు 7 : బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు.

Updated Date - 2021-09-18T05:46:23+05:30 IST