Share News

సీఐ గంగిరెడ్డిపై ఎట్టకేలకు వేటు

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:48 AM

వైసీపీకి అనుకూలంగా ఉంటూ మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా ముద్రపడిన సీఐ గంగిరెడ్డి మీద ఎట్టకేలకు వేటు పడింది. జిల్లా ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ చేసింది.

సీఐ గంగిరెడ్డిపై ఎట్టకేలకు వేటు

ఫ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని సీఈసీ ఆదేశం

ఫ టీడీపీ నాయకుల ఫిర్యాదుతో స్పందించిన సీఈసీ

చిత్తూరు, ఏప్రిల్‌ 23: వైసీపీకి అనుకూలంగా ఉంటూ మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా ముద్రపడిన సీఐ గంగిరెడ్డి మీద ఎట్టకేలకు వేటు పడింది. జిల్లా ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ చేసింది. వెంటనే పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించింది. పుంగనూరు సీఐగా సుదీర్ఘకాలం పనిచేసిన గంగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారని, నామినేషన్లు వేసిన ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి విత్‌డ్రా చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన సమక్షంలోనే వైసీపీ నేతలు నామినేషన్లను చించేసిన ఘటనలున్నాయి. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించి, బదిలీ చేసింది. పెద్దిరెడ్డి అండతో మళ్లీ అయన పుంగనూరుకే వచ్చారు. జిల్లాలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నా ఎన్నికల నేపథ్యంలో ఆయన జిల్లా వదలిపోలేదు. లూప్‌లైన్‌ పేరుతో ఎస్పీకి దగ్గరగా ఉండే స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో కూర్చున్నారు. ఈ విభాగంలో ఉన్న తనకంటే పైస్థాయి అధికారికి తెలియకుండా 14 మంది అనుకూల సిబ్బందితో స్పెషల్‌ టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. గంగిరెడ్డితో పొసగక పై స్థాయి అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగానికి గంగిరెడ్డి చీఫ్‌గా మారి ఏకపక్షంగా పనిచేయాలంటూ జిల్లాలోని పోలీసు అధికారులకు హుకుం జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చిన ఎస్పీ మణికంఠ చందోలు గంగిరెడ్డి అంశాన్ని పరిశీలించి స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో గంగిరెడ్డి ఇలా లూప్‌లైన్‌ పేరుతో జిల్లాలోనే కొనసాగితే ఇబ్బంది అవుతుందని, గతంలో ఆయన వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం గంగిరెడ్డికి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది.

Updated Date - Apr 24 , 2024 | 01:48 AM