Share News

కొనసాగుతున్న నామినేషన్ల జోరు

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:46 AM

జిల్లాలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. మొదటి నాలుగు రోజుల్లో 93 నామినేషన్లు అందగా మంగళవారం పార్లమెంటుకు 4, అసెంబ్లీ స్థానాలకు 20 అందాయి.

కొనసాగుతున్న నామినేషన్ల జోరు

- పార్లమెంటుకు 4, అసెంబ్లీకి 20

- 117కు చేరిన సంఖ్య - రేపే చివరి రోజు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23 : జిల్లాలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. మొదటి నాలుగు రోజుల్లో 93 నామినేషన్లు అందగా మంగళవారం పార్లమెంటుకు 4, అసెంబ్లీ స్థానాలకు 20 అందాయి. దీంతో మంగళవారం నాటికి మొత్తం 117 అందాయి. ఈనెల 25తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. చిత్తూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ తరఫున ఎన్‌.జగపతి, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు ఆర్‌.భూలక్ష్మి, ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్‌ తరఫున ఇ.రమేష్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్‌. జయకర్‌ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు పుంగనూరు నుంచి బహుజన సమాజ్‌ పార్టీ తరపున వి. సురేష్‌, నగరికి టీడీపీ తరఫున గాలి భానుప్రకాష్‌, కాంగ్రెస్‌ నుంచి పి.రాకేష్‌ రెడ్డి, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఉప్పు రవికుమార్‌ ఒక్కో నామినేషన్‌ దాఖలు చేశారు. నీతి నిజాయితీ పార్టీ తరఫున అరవ చిట్టిబాబు రెండుసెట్ల నామినేషన్లు వేశారు. గంగాధరనెల్లూరుకు కాంగ్రెస్‌ తరపున డి.రమేష్‌ బాబు, టీడీపీ నుంచి థామస్‌, సమాజ్‌ వాది పార్టీ తరఫున గుణశేఖర్‌, చిత్తూరు స్థానానికి వైసీపీ నుంచి ఎంసీ విజయానందరెడ్డి, పూతలపట్టుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎంవీ విజయభాస్కర్‌, విడుదలై చిరుతైగళ్‌ పార్టీ నుంచి కె.సంతోష్‌కుమార్‌, పలమనేరుకు వైసీపీ నుంచి ఎన్‌.పావని, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఆర్‌.శోభ, ఇండిపెండెంట్‌గా ఎ.సుబ్రహ్మణ్యం నామినేషన్‌ వేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి భరత్‌ రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయగా, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి గణేష్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నీలమ్మ, ఎన్‌. నాగరాజు రిటర్నింగ్‌ అధికారికి తమ నామినేషన్లు అందజేశారు. బుధ, గురువారాల్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.

Updated Date - Apr 24 , 2024 | 01:46 AM